హరహర మహాదేవ!
ABN , First Publish Date - 2020-12-14T05:30:00+05:30 IST
జిల్లాలోని ఆలయాల్లో కార్తీక మాసోత్సవాలు ముగిశాయి. చివరి రోజు సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
ముగిసిన కార్తీక మాసం
ఆకాశదీపం అవనతం
హోరెత్తిన శివనామస్మరణాలు
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 14 : జిల్లాలోని ఆలయాల్లో కార్తీక మాసోత్సవాలు ముగిశాయి. చివరి రోజు సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే బారులు తీరి శివయ్యకు పాలాభిషేకం చేయించుకున్నారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహించారు. కొన్నిచోట్ల వన సమారాధన, మరికొన్ని చోట్ల కార్తీక అమావాస్య సందర్భంగా అన్నదానం జరిగాయి. రాత్రి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. హరనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.
నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయంలో ఉదయం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. సాయంత్రం ఆకాశ దీపాన్ని మాజీ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి అవనతం చేశారు. ముగింపు సందర్భంగా ప్రత్యేక పూలంగిసేవ, ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆల్తూరు గిరీష్‌రెడ్డి ఆధ్వర్యంలో శివదీక్ష చేపట్టిన భక్తులు ఇరుముడులు సమర్పించి శివపంచాక్షరీ భజన చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తలు, ఈవో వేణుగోపాల్ పర్యవేక్షించారు.
రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోని సుందరేశ్వరస్వామికి కార్తీక మాసం ముగింపు పూజలు జరిగాయి. రాత్రి జరిగిన ఆకాశదీపం అవనతం కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి కుంభహారతులు జరిగాయి. ఆలయ చైర్మన్ రత్నం జయరామ్, ఈవో సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.
ఇదేవిధంగా నవాబుపేట శివాలయం, ఉస్మాన్‌సాహెబ్‌పేట అన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాఽథస్వామి ఆలయంలో కార్తీక మాసం ముగింపు వేడుకలు జరిగాయి.
కంసాలి వీధిలోని భ్రమరాంభ సమేత హరిహరనాథస్వామి ఆలయంలో శ్రీకాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర భక్త సేవా బృందం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరిగింది. 1000 మందికిపైగా భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో రంగనాథ భక్త మండలి సభ్యులు మెంటా రామ్మోహన్‌రావు, వైౖసీపీ యువజన నగర ఇన్‌చార్జి మజ్జిగ జయకృష్ణారెడ్డి, భక్తులు చెంచల చంద్రశేఖర్, అంబూరు మురళీ ఆచారి, వంగా సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కోటి దీపారాధన....
నగరంలో రాయాజీవీధిలోని ఆంజనేయస్వామి ఆలయంలో కోటి దీపార్చన సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. ఉదయం కళాకారుడు చంద్ర తయారు చేసిన మహాకాళేశ్వరస్వామి శివలింగాన్ని ప్రతిష్టించి భక్తులతో సాయంత్రం వరకు అభిషేకాలు చేయించారు. మధ్యాహ్నం కార్తీక అమావాస్య సందర్భంగా అన్నదానం చేశారు. రాత్రి ద్వాదశ మహాశివలింగాలను సంకల్పం చేసి కోటివత్తుల దీపాలు 12 వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరిశెట్టి నరేంద్ర, కొణిదల సుధీర్, రాఘవ, వేలూరు మహేష్, దార్ల వెంకయ్య, ఆలయ చైర్మన్ సూరిశెట్టి ఉమాసురేంద్ర, విజయకృష్ణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
