పూర్తయిన ‘పరిశీలన’!

ABN , First Publish Date - 2020-03-13T09:51:59+05:30 IST

జడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

పూర్తయిన ‘పరిశీలన’!

జడ్పీటీసీ నామినేషన్లలో ఒకటి తిరస్కరణ

రేపటి వరకు ఉపసంహరణ గడువు


నెల్లూరు (జడ్పీ), మార్చి 12 : జడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టిన అధికారులు గురువారం పరిశీలనను పూర్తి చేశారు. జిల్లాలోని 46 జడ్పీటీసీ స్థానాలకు 330 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మండలాల వారీగా నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి జడ్పీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బాపిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాఖలైన నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోద ముద్ర వేశారు. అభ్యర్థులు కూడా భారీగా తరలి వచ్చి తమ నామినేషన్లు ఆమోదం పొందాయా లేదా అన్న విషయాలను తెలుసుకున్నారు.  330 నామినేషన్లకు గాను కేవలం ఒక్కటి మాత్రమే తిరస్కరించబడింది. పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థిగా (వైసీపీ డమ్మీ అభ్యర్థి) నామినేషన్‌ వేసిన ప్రశాంతి కుల ధృవీకరణ పత్రాన్ని అందచేయలేదు.


ఆమెకు బుధవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు సెట్లు వేసిన 26 మంది ఒక సెట్టును ఉపసహరించుకున్నారు. మిగతా 303 నామినేషన్ల ఆమోదం పొందినట్లు బాపిరెడ్డి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం వరకు గడువు ఇచ్చారు. దీంతో ఉపసంహరించుకునే వారంతా 14లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంది. అయితే ఒక స్థానానికి రెండు, మూడు నామినేషన్లను వేసిన వారు డమ్మీలుగా వేసిన వారు నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారు. 


ఎంపీటీసీ నామినేషన్లు..

జిల్లాలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనను గురువారం అధికారులు చేపట్టారు. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను ఎమ్పీడీవో కార్యాలయాల్లో స్వీకరించగా, అక్కడే పరిశీలనను కూడా చేపట్టారు. జిల్లాలో మొత్తం 554 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో వాటికి ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.


బీఎస్పీ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి 230 మంది, సీపీఐ నుంచి 12 మంది, సీపీఎం నుంచి 30 మంది, కాంగ్రెస్‌ నుంచి 20 మంది, టీడీపీ నుంచి 952 మంది, వైసీపీ నుంచి 1368 మంది, జనసేన నుంచి 40 మంది, స్వతంత్రులు 172 మంది మొత్తం 2,832 మంది నామినేషన్లను వేశారు. దీంతో వాటన్నింటిని పరిశీలించి పత్రాలు సక్రమంగా లేని వాటిని తిరస్కరించి అన్ని పత్రాలు ఉన్న వాటిని ఆమోదిస్తున్నారు. ఈ నేపథ్యంలో వందకుపైగా నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 

Updated Date - 2020-03-13T09:51:59+05:30 IST