గిరిజనులపై వైసీపీ నేతల దౌర్జన్యంపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-05-09T08:37:12+05:30 IST
మండలంలోని నిడిగుంటపాళెం గిరిజనులపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడడంపై బీజేపీ మండల
వెంకటాచలం, మే 8 : మండలంలోని నిడిగుంటపాళెం గిరిజనులపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడడంపై బీజేపీ మండల అధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు శుక్రవారం గిరిజన సంఘాల నాయకులు, బాధిత గిరిజనులతో కలిసి తహసీల్దారు ఐఎస్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ 2004లో అప్పటి ప్రభుత్వం నిడిగుంటపాళెం గ్రామంలో మంజూరు చేసిన స్థలాల్లోనే గిరిజనులు ఆర్థిక స్థోమత లేక గుడిసెలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రస్తుతం వైసీపీ నాయకులు తమ వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గిరిజనుల గుడిసెలను తొలగిస్తున్నారన్నారు. దీనిపై ప్రశ్నించిన కొందరు గిరిజనులపై తప్పుడు కేసులు కూడా బనాయిస్తున్నారని ఆరోపించారు. గుడిసెలు తొలగించి కొత్త లే అవుట్ ఏర్పాటు చేసి ప్లాట్లను పంపిణీ చేస్తామంటే ఆ గుడిసెలు తమకు చాలని చెప్పిన గిరిజనులపై దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైసీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.