అందరి చూపు.. పారిశ్రామిక పంచాయతీల వైపు!!

ABN , First Publish Date - 2020-03-12T09:32:17+05:30 IST

కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పరిశ్రమలు.. వాటి నుంచి పంచాయతీలకు వచ్చే ఆదాయం..

అందరి చూపు.. పారిశ్రామిక పంచాయతీల వైపు!!

సర్పంచు పదవులకు పోటీ

ఆధిపత్యం కోసం పోరు


ముత్తుకూరు, మార్చి11: కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పరిశ్రమలు.. వాటి నుంచి పంచాయతీలకు వచ్చే ఆదాయం.. పంచాయతీకి కేటాయించే కోట్ల రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులు.. వెరసి ఆయా పంచాయతీల సర్పంచు పదవుల వైపే అందరి చూపు. ముత్తుకూరు మండలంలో పరిశ్రమలు ఉన్న పంచాయతీల సర్పంచు ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగనున్నాయి. దక్షిణ ఆసియాలో పెద్దదైన కృష్ణపట్నం పోర్టుతో కృష్ణపట్నం పంచాయతీకి ప్రాధాన్యం పెరిగింది. జెన్‌కో, సెంబ్‌కార్ప్‌ థర్మల్‌ కేంద్రాలు ఉన్న నేలటూరు, పైనంపురం, పామాయిల్‌ పరిశ్రమలు ఉన్న పంటపాళెం పంచాయతీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మండల కేంద్రమైన ముత్తుకూరు కీలకంగా మారింది.

 

పంచాయతీలపై ఆధిపత్యం కోసం..

అభివృద్ధి చెందిన ఈ ఐదు పంచాయతీలపై ఆధిపత్యం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. థర్మల్‌ కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో సర్పంచుల పాత్ర కీలకం కానున్నది. పరిశ్రమలు సీఎస్‌ఆర్‌లో భాగంగా ప్రతి ఏటా కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తుంది. అలాగే పన్నులు, ఇతర మార్గాల రూపంలో పంచాయతీ ఆదాయం అధికంగా ఉంటుంది. దీంతో ఈ పంచాయతీల్లో పాగా వేయాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటితో పాటు ప్రతి విషయంతో పరిశ్రమల యాజమాన్యాలు స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తారు.


అభివృద్ధి పనుల్లోనూ సర్పంచులకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. పంటపాళెం పంచాయతీ ఓసీలకు రిజర్వు చేయగా, కృష్ణపట్నం, పైనంపురం పంచాయతీలు ఎస్సీ మహిళకు, నేలటూరు బీసీ మహిళకు, ముత్తుకూరు ఎస్టీ మహిళకు కేటాయించారు. పంటపాళెం పరిధిలో పామాయిల్‌ పరిశ్రమల ద్వారా పంచాయతీకి అధిక ఆదాయం వస్తుంది. ఇక్కడ వైసీపీ, టీడీపీల మధ్య సర్పంచు పదవి కోసం ఉత్కంఠ పోరు సాగనుంది. మిగిలిన నాలుగు చోట్ల మహిళలకే రిజర్వు చేయడంతో తమ అనుచరులను నిలబెట్టి, ఆధిపత్యం కాపాడుకునేందుకు స్థానిక నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇందులో కృష్ణపట్నం పంచాయతీ సర్పంచు ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఇటీవలే పోర్టు యాజమాన్యం నవయుగ కంపెనీ నుంచి ఆదానీ కంపెనీకి బదలాయించిన విషయం తెలిసిందే. దీంతో నూతన యాజమాన్యం పంచాయతీ అభివృద్థికి ప్రాధాన్యం ఇస్తుందన్న అంశం సర్పంచు ఎన్నికలను మరింత కీలకంగా మార్చాయి. మరి ఈ పారిశ్రామిక పంచాయతీల ఆధిపత్యం ఎవరిదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!!

Updated Date - 2020-03-12T09:32:17+05:30 IST