కోడ్‌ ..డోంట్‌ కేర్‌

ABN , First Publish Date - 2020-03-15T09:39:07+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల నేపఽథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ మండలంలో

కోడ్‌ ..డోంట్‌ కేర్‌

ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఉల్లంఘన

చోద్యం చూస్తున్న అధికారులు


వరికుంటపాడు, మార్చి 14: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ మండలంలో మాత్రం అందుకు భిన్నంగా పలు శాఖల అధికారులు డోంట్‌ కేర్‌ అన్నట్లు ఎన్నికల నిబంధనలను సాక్షాత్తు తమ కార్యాలయాల్లోనే ఉల్లంఘిస్తుండడం గమనార్హం. కోడ్‌ అమలులో భాగంగా ప్రధానంగా రాజకీయ నాయకుల విగ్రహాలు, చిత్రపటాలు, ప్రభుత్వ పథకాలను సూచించే గోడపత్రికలు, ప్లెక్సీలు వంటివి కనిపించకూడదనే నిబంధనలు ఉంటుంది.


అయితే ముందస్తుగా వాటిని అమలు పరచాల్సిన అధికారులే నిబంధనలను తుంగలో తొక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉండే ఐకేపీ కార్యాలయంలో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండే ప్లెక్సీ అధికారి కార్యాలయంలోనే ఉండడం విశేషం.


సమీపంలోని హౌసింగ్‌ కార్యాలయంలోను ఎటువైపు చూసినా తలుపులు, గోడలపై పధకాలను సూచించే గోడపత్రికలు అలాగే ఉండడం చూస్తుంటే అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతుంది. 


అంతేగాక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పశువైద్యశాలలోను అలాంటి పరిస్థితే కన్పిస్తుంది. వీటికితోడు రహదారుల వెంట రాజకీయ నాయకుల ఫోటోలతో కూడిన గ్రామాల పేర్లు తెలిపే హోర్డింగులు కూడా దర్శనమిస్తున్నాయి. శివారు మండలం కావడంతో అడిగే వారు లేరులే అన్న ధీమాతోనే ఇలాంటి నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారే ఆరోపణలు సైతం గుప్పుమంటున్నాయి.


దీంతో అటువైపు చూసిన పలువురు నిబంధనలనే సమర్ధవంతంగా పాటించలేని అధికారులు ఇక ఎన్నికలను ఎంతమేర నిర్వహిస్తారోననే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధింత ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఉంచి ఎన్నికల నియమావళిలో భాగంగా కార్యాలయాలు, గ్రామాల్లో కోడ్‌ను ఎలాంటి తారతమ్యాలు లేకుండా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2020-03-15T09:39:07+05:30 IST