తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై సీఎం సమీక్ష

ABN , First Publish Date - 2020-11-20T04:31:07+05:30 IST

తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎవరన్నదానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆ పార్లమెంట్‌ పరిధిలోని నెల్లూరు, తిరుపతి నేతలతో గురువారం అమరావతిలో సమావేశమయ్యారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో  అభ్యర్థి ఎంపికపై సీఎం సమీక్ష
నేతలతో సమావేశం నిర్వహిస్తున్న సీఎం జగన్‌

పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు

రెండు రోజుల్లో తుది నిర్ణయం

నెల్లూరు (జడ్పీ), నవంబరు 15 : తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎవరన్నదానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆ పార్లమెంట్‌ పరిధిలోని నెల్లూరు, తిరుపతి నేతలతో గురువారం అమరావతిలో సమావేశమయ్యారు. జిల్లా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వరప్రసాద్‌ రావు, సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిపై వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి తీసుకున్నట్లు తెలిసింది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హైదరాబాదులో ఉండటంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించి ఉండటంతో వైసీపీ అభ్యర్థి ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ కుటుంబం నుంచే అభ్యర్థిని బరిలో నిలపాలా!? లేదా కొత్త వ్యక్తులను బరిలో దింపాలా అన్నదానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ జిల్లా అద్యక్షుడు మేరిగ మురళీతోపాటు గూడూరుకు చెందిన పలువురు నేతలు ఎంపీ సీటును ఆశిస్తున్నారు. బల్లి కుటుంబం నుంచి ఆయన కుమారుడు పోటీ చేయాలని ఇటీవల పలువురు ఎమ్మెల్యేలను, నేతలను కలిశారు. అయితే  బల్లి సతీమణికి టిక్కెట్లు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి అందరి అభిప్రాయాలను సేకరించి అభ్యర్థి ఖరారుపై ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-11-20T04:31:07+05:30 IST