ఉన్నవే కొన్ని.. అందులోనూ కుదింపు!

ABN , First Publish Date - 2020-12-31T05:14:42+05:30 IST

ఏ పని కావాలన్నా ఆధార్‌ కార్డు తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందాలన్నా ఆధార్‌ అప్‌డేట్‌ చేయాల్సి వస్తోంది.

ఉన్నవే కొన్ని..  అందులోనూ కుదింపు!
నెల్లూరు : ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్‌ నమోదు, సవరణల కేంద్రం

జిల్లాలో ప్రైవేటు ఆధార్‌ కేంద్రాలకు మంగళం

ప్రభుత్వ ఆదేశాలతో సేవల నిలిపివేత

పోస్టాఫీసులు, బ్యాంకుల్లో మాత్రమే కార్డుల్లో మార్పులు

ప్రజలకు మరిన్ని కష్టాలు


నెల్లూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఏ పని కావాలన్నా ఆధార్‌ కార్డు తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందాలన్నా ఆధార్‌ అప్‌డేట్‌ చేయాల్సి వస్తోంది. దీంతో ఆధార్‌లో మార్పులు, చేర్పులకు ప్రాధాన్యం పెరిగింది. వీటిని అప్‌డేట్‌ చేసే కేంద్రాలను రద్దు చేయడంతో ప్రజలకు తిప్పలు తప్పేలా లేదు. జిల్లా జనాభా 30 లక్షలు ఉంటే ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఇటీవల వరకు కేవలం 70 వరకు మాత్రమే ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మీసేవల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాలు 15 వరకు ఉండగా, మిగిలినవి పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ కేంద్రాలే జిల్లాలోని ప్రజల అవసరాలకు సరిపడక నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు మీసేవల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధార్‌ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో పోస్టాఫీసులు, బ్యాంకులే ప్రజలకు దిక్కయ్యాయి. అవి కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయా.. అంటే అదీ లేదు. ముఖ్యంగా గ్రామీణులకు ఆధార్‌ అప్‌డేషన్‌ అంటేనే ప్రహసనంగా మారింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో టోకెన్ల పద్ధతిని అనుసరిస్తున్నారు. చాలా వరకు రోజుకు 30 మందికి మించి టోకెన్లు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు రోజులు తరబడి టోకెన్లు దొరకడం లేదు. ఇక చేసేది లేక ముందు రోజు రాత్రి నుంచే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో క్యూ కడుతున్నారు. ఒకవేళ టోకెన్‌ దొరికినా ఆ రోజంతా ఆధార్‌ కోసం సరిపోతోంది. గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి వస్తోంది. చిన్న పిల్లలకు కొత్తగా ఆధార్‌ తీసుకునే వారి అవస్థలు మరింత ఘోరంగా ఉంటున్నాయి. ఇక చాలాచోట్ల బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కొందరు వ్యక్తులు ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. టోకెన్లను కూడా అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ సమయంలో మీసేవల్లో నడుస్తున్న ఆధార్‌ కేంద్రాలు కొంత వరకు ప్రజలకు ఊరటనిస్తుండేవి. ఇక్కడ టోకెన్ల పద్ధతి, సమయ పాలన వంటివి లేవు కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఆధార్‌ సేవలు అందుతుండేవి. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రోజుకు 30 మందికి మించి ఆధార్‌ మార్పులు చేయని సమయంలో మీసేవ కేంద్రాల్లో సుమారు వంద మందికి వరకు సేవలందించేవారు. ఒక రోజు ఆలస్యమైనా మరుసటి రోజు పనైపోతుండేది. ఇప్పుడు ఆ కేంద్రాలను కూడా తొలగించడంతో ప్రజలకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అన్నింటికీ ఆధార్‌ లింక్‌ పెట్టిన ప్రభుత్వం అందుకు తగిన విధంగా  ఆధార్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీసేవల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధార్‌ కేంద్రాలను ఎత్తివేసిన ప్రభుత్వం వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఆధార్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. 

Updated Date - 2020-12-31T05:14:42+05:30 IST