ఘరానా దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2020-12-02T04:26:53+05:30 IST
జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను మంగళవారం ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో ఎస్పీ భాస్కర్ భూషణ్ విలేకరులకు వివరించారు.
రూ.37.16 లక్షల సొత్తు స్వాధీనం
నెల్లూరు(క్రైం), డిసెంబరు 1: జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను మంగళవారం ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో ఎస్పీ భాస్కర్ భూషణ్ విలేకరులకు వివరించారు.
అల్లూరు మండలం నార్త్ మోపూరు చిన్న హరిజనవాడకు చెందిన నెల్లూరు షఫీ అలియాస్ అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు, చెడు వ్యసనాలకు బానిసైన అతను దొంగతనాలు ప్రారంభించాడు. 2018 నుంచి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇళ్లకు కన్నాలు వేసి నగలు, నగదు అపహరించాడు. కావలి టౌన్, బిట్రగుంట, కొండాపురం, అల్లూరు, కోవూరు, కొడవలూరు, బుచ్చి, దగదర్తి, విడవలూరు పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డాడు. ఈ నెల 23వ తేదీ బోగోలు మండలం ఏనుగులబావి గ్రామంలో దొంగతనం చేసేందుకు సిద్ధపడ్డాడు. అల్లూరుకు చెందిన స్నేహితుడు గౌస్‌బాషాను తోడు తెచ్చుకున్నాడు. వారిద్దరు రెండు ద్విచక్ర వాహనాలపై గ్రామానికి చేరుకున్నారు. గౌస్‌బాషా దూరంగా నిలబడగా అశోక్ స్థానికంగా ఉండే పంది కొండయ్య ఇంట్లోకి ప్రవేశించి రూ.60 వేల నగదు చోరీ చేసి తిరిగి వస్తుండగా స్థానికులు గుర్తించి కేకలు వేశారు. దీంతో అశోక్ బైక్‌ను అక్కడే వదిలేసి గౌస్‌బాషా బైక్‌పై ఇద్దరూ పరారయ్యారు. ఈ నేరంపై బిట్రగుంట ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో వదిలి వెళ్లిన బైక్ ఆధారంగా నిందితుడిని అశోక్‌గా గుర్తించారు. అనంతరం కావలి గ్రామీణ వలయం ఇన్‌స్పెక్టర్ అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో అల్లూరులోని నార్త్‌మోపూరు గ్రామంలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారంచగా ఇప్పటి వరకు 28 నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.5.36 లక్షల నగదు, రూ.30.80 లక్షల విలువ చేసే 77 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. లక్ష విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 37.16 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని, ఇంకా రూ.25.40 లక్షల విలువ చేసే 63.5 సవర్ల బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన కావలి పోలీసులను అభినందించి రివార్డులు అందించారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వరరెడ్డి, కావలి డీఎస్పీ డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.