చెన్నై-సూళ్లూరుపేట మధ్య ‘వర్క్‌ మెన్‌ స్పెషల్‌’ రైళ్లు

ABN , First Publish Date - 2020-11-20T04:28:44+05:30 IST

లాక్‌డౌన్‌లో 7 నెలల క్రితం నిలిపివేసిన చెన్నై-సూళ్లూరుపేట మధ్య సబర్బన్‌ రైళ్లను గురువారం దక్షిణ రైల్వే అధికారులు పునఃప్రారంభించారు.

చెన్నై-సూళ్లూరుపేట మధ్య  ‘వర్క్‌ మెన్‌ స్పెషల్‌’ రైళ్లు
తమిళనాడు చెంగల్‌పట్టు నుండి సూళ్లూరుపేటకు చేరిన సబర్బన్‌ రైళ్లు

తమిళ ఉద్యోగుల కోసం 8 సబర్బన్‌ రైళ్లు 

సాధారణ ప్రయాణికులకు నో ఎంట్రీ 

సూళ్లూరుపేట, నవంబరు 19 : లాక్‌డౌన్‌లో 7 నెలల క్రితం నిలిపివేసిన చెన్నై-సూళ్లూరుపేట మధ్య సబర్బన్‌ రైళ్లను గురువారం దక్షిణ రైల్వే అధికారులు పునఃప్రారంభించారు. సూళ్లూరుపేట నుంచి చెన్నై ఎంఎంసీ వరకు 5 రైళ్లు, సూళ్లూరుపేట నుంచి తమిళనాడులోని చెంగల్‌పట్టు వరకు 2, గుమ్మిడిపూడి వరకు ఒక రైలు నడుపుతున్నట్లు వెల్లడించారు. తమ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు రైళ్లు నడపాలంటూ తమిళ ప్రభుత్వం కోరడంతో దక్షిణ రైల్వే ఈ మేరకు చర్యలు తీసుకుంది. వర్క్‌మన్‌ స్పెషల్‌గా ఈ రైళ్లను నిర్వహిస్తుండటంతో సాధారణ ప్రయాణికులకు ఈ రైళ్లలో అనుమతి లేదు. రైల్వే ఉద్యోగులతోపాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ కంపెనీల సిబ్బంది మాత్రం ప్రయాణించే అవకాశం కల్పించారు. ఉద్యోగులు తమ కంపెనీల ధ్రువీకరణపత్రాలు చూపి సీజన్‌ టికెట్‌ కొనుక్కొని ప్రయాణించాలని రైల్వే అధికారులు వెల్లడించారు. 

ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు, సీజన్‌ బాయిలకు..

ప్రత్యేక రైళ్లలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఈ ప్రాంతంలోని కంపెనీల సిబ్బందికి అనుమతి ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ ప్రాంతాల నుంచి గతంలో నిత్యం పలువురు చెన్నైకు వెళ్లి సరుకులు తీసుకొచ్చి వ్యాపారులకు అందజేసేవారు. అలా సుమారు 1500 మందికిపైగా సీజన్‌బాయ్‌లు ఉన్నారు. కరోనా కారణంగా వీరందరూ ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సూళ్లూరుపేట వరకు సబర్బన్‌ రైళ్లు నడుపుతుండటంతో ఈ రైళ్లలో తమకూ ప్రయాణించే అవకాశం కల్పించాలని సీజన్‌బాయ్‌లు అభ్యర్థిస్తున్నారు. 


సూళ్లూరుపేట నుంచి..

ఫ ఉదయం 5.45 గంటలకు బీచ్‌ మీదుగా చెంగల్‌పట్టుకు..

ఫ 6..35 గంటలకు చెన్నై ఎంఎంసీకి..

9.15 గంటలకు చెన్నై ఎంఎంసీకి..

మధ్యాహ్నం 1 గంటకు చెన్నై ఎంఎంసీకి..

3.30 గంటలకు చెన్నై ఎంఎంసీకి..

సాయంత్రం 6 గంటలకు బీచ్‌ మీదుగా చెంగల్‌పట్టుకు..

6.45 గంటలకు చెన్నై ఎంఎంసీకి..

రాత్రి 9 గంటలకు గుమ్మిడిపూడికి.. 

Updated Date - 2020-11-20T04:28:44+05:30 IST