రబీ సీజన్లో వరి మారింది!

ABN , First Publish Date - 2020-12-12T04:58:00+05:30 IST

నెల్లూరు రూరల్‌ మండలంలో ఈ సారి నివర్‌ తుఫాన్‌ కారణంగా వరి సాగు రకాలు మారాయి. రబీ వ్యవసాయ సీజన్‌ మొదట్లో రైతులు వేసుకున్న లెక్కలు తారుమారయ్యాయి.

రబీ సీజన్లో వరి మారింది!
భారీ వర్షాలకు దెబ్బతిన్న బీపీటీ రకం నారుమడి

నెల్లూరు జిలకర సాగుకే రైతుల మొగ్గు 

బీపీటీ పైరుకు దాటిన అదును 

పెరిగిన ఆర్‌ఎన్‌ఆర్‌ విస్తీర్ణం 


నెల్లూరు రూరల్‌, డిసెంబరు 11 : 

నెల్లూరు రూరల్‌ మండలంలో ఈ సారి నివర్‌ తుఫాన్‌ కారణంగా వరి సాగు రకాలు మారాయి. రబీ వ్యవసాయ సీజన్‌ మొదట్లో రైతులు వేసుకున్న లెక్కలు తారుమారయ్యాయి. తొలుత బీపీటీ 5204 రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని యోచించిన రైతులు రెండు, మూడవ ప్రాధాన్యత క్రమంలో ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకాలను సాగులోకి తేవాలని నిర్ణయించారు. ఆ దిశగా నారుమళ్లను సిద్ధం చేశారు. ఇంతలో నివర్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించడంతో నారుమళ్లు కొట్టుకుపోయాయి. దీంతో బీపీటీ కన్నా తక్కువ రోజుల్లో చేతికొచ్చే నెల్లూరు జిలకరనే సాగుచేయాలన్న నిర్ణయానికి రైతాంగం వచ్చింది. 


నెల్లూరు నగరానికి తూర్పు, పడమరన ఉండే పల్లెల్లో కనుపూరు, జాఫర్‌సాహెబ్‌, కృష్ణపట్నం, సర్వేపల్లి కాలువల కింద ఈ సారి 25 వేల నుంచి 30 వేల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. బీపీటీతోపాటు ఎన్‌ఎల్‌ఆర్‌, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాల విత్తనాలు చల్లి నారుమళ్ల సిద్ధం చేశారు. అయితే భారీ వర్షాలకు సుమారు 4 వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఆ నారుమళ్లు ఇక పనికి రావని  వ్యవసాయ శాఖ తేల్చింది. ప్రత్యామ్నాయంగా ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకాలకు చెందిన విత్తనాలను 80 శాతం రాయితీపై అందించేందుకు ఆ శాఖ సిద్ధమైంది. దెబ్బతిన్న 4 వేల ఎకరాల నారుమళ్లలో ముప్పాతిక శాతం వరకు బీపీటీ రకమే ఉండటంతో రైతులు దాని స్థానంలో ఎన్‌ఎల్‌ఆర్‌ రకాన్ని సాగు చేయాలని నిర్ణయించారు. బీపీటీ రకం వరి సాగుకు 150 రోజులు పడుతుండటంతో ఈ సారి పంట కాలం సరిపోదని భావిస్తున్న రైతాంగం 120 రోజుల పంట కాలమైన ఎన్‌ఎల్‌ఆర్‌, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలను సాగు చేయనున్నారు. 


ఆర్‌ఎన్‌ఆర్‌కు పెరిగిన విస్తీర్ణం 

ఈ వ్యవసాయ సీజన్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం వంగడం సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మొదట్లో 10-20 శాతం వరకు మాత్రమే రైతాంగం ఈ రకాన్ని సాగు చేయాలన్న లెక్కతో విత్తనాలు చల్లారు. నివర్‌ తుఫాన్‌ కారణంగా భారీ వర్షాల తాకిడికి బీపీటీ రకం ఎక్కువగా దెబ్బతినడంతో రైతులు ఎన్‌ఎల్‌ఆర్‌, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాల వైపు మళ్లారు. 30-40 శాతం విస్తీర్ణంలో ఆర్‌ఎన్‌ఆర్‌ రకాన్ని సాగు చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లలో ఉన్నారు. 

Updated Date - 2020-12-12T04:58:00+05:30 IST