అప్పుల భారంతో పేదలు

ABN , First Publish Date - 2020-08-01T10:39:32+05:30 IST

పేదలకు కరోనా మిగిల్చిన కష్టం అంతా ఇంతా కాదు..! గడిచిన నాలుగు నెలలుగా అనుభవించిన గడ్డు పరిస్థితుల ..

అప్పుల భారంతో పేదలు

సామాన్యులపై కరోనా కాటు

నాలుగు నెలలుగా అరకొర సంపాదన

చితికిపోయిన కూలీలు, చిరు వ్యాపారులు

విధిలేక అధిక వడ్డీలకు రుణాలు

అవసరాన్ని ఆసరాగా తీసుకున్న వడ్డీ మాఫియా


నెల్లూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : పేదలకు కరోనా మిగిల్చిన కష్టం అంతా ఇంతా కాదు..! గడిచిన నాలుగు నెలలుగా అనుభవించిన గడ్డు పరిస్థితుల నుంచి బయటపడడానికి వారికి కొన్నేళ్ల కాలం పడుతుంది. పనుల్లేక పూట గడవక విధిలేని పరిస్థితుల్లో అప్పుల బాట పట్టిన వారి దుస్థితి దయనీయంగా మారింది. కరోనా సమయాన్ని వడ్డీ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. పేదల అవసరం వడ్డీ వ్యాపారులకు అవకాశంగా మారింది. గతంలో కన్నా ఇప్పుడు రెట్టింపు వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పు తీసుకుంటున్న మొత్తాన్ని బట్టి రూ.10కుపైనే వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు తిరిగి చెల్లిస్తున్న మొత్తం వడ్డీకి కూడా సరిపోకపోతుండడం బాధాకరం. ఈ జాబితాలో ఎక్కు వుగా రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు ఉంటున్నారు. 


పని చేస్తేనే నాలుగువేళ్లు నోట్లోకి..

జిల్లాలో సుమారు ఇరవైశాతం మందికి ఆ రోజు పని దొరక్కపోతే పూట గడవదని సామాజిక నిపుణుల అంచనా. పట్టణాలు, పల్లెల్లో ఉంటున్న వీరి పరిస్థితి దారుణంగా ఉంది. అలాంటి వారి బతుకులను కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. మార్చి 22న జనతా ఖర్ఫ్యూ మొదలైన తర్వాత రెండు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు కదల్లేని పరిస్థితి. అప్పటి వరకు దాచిపెట్టుకున్న డబ్బులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన రేషన్‌ వీరి కడుపును పూర్తిగా నింపలేకపోయా యి. ఇక రెండు నెలల తర్వాత దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ వస్తున్నప్పటికీ అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీంతో కూలీలకు పనులు దొరకడం కష్టంగా మారింది.


గ్రామాల్లో కొంత వరకు ఉపాధి హామీ పనులు ఆదుకుంటున్నా, పట్టణాల్లోని నిరుపేదల బతుకులు మరీ దారుణంగా మారాయి. ఇక వీధి వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిత్యావసరాలు మినహా మిగిలిన వస్తువులు, తినుబండారాలను కొనేవారు లేకుండా పోయారు. దీంతో రోజూ వీధులు తిరుగుతూ, రోడ్లపై బండ్లు, బుట్టలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న పేదలకు పూట గడవడం కూడా కష్టంగా మారిపోయింది. ఇక విధిలేని పరిస్థితుల్లో అప్పులు తెచ్చుకొని బతుకు బండి లాగించాల్సిన దుస్థితి నెలకొనింది. 


 అవసరాన్ని ఆసరాగా తీసుకుని..

ఓ వైపు నిరుపేదల దుస్థితి ఇలా ఉంటే వడ్డీ మాఫియా మాత్రం దీన్ని అవకాశంగా మలుచుకుంటోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.2కు మించి వడ్డీకు ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధన ఉన్నప్పటికీ సాధారణ రోజుల్లోనూ రూ.5 వరకు వడ్డీ వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు కష్టకాలంలో తగ్గించాల్సింది పోయి రెట్టింపు చేశారు. వడ్డీ మాఫియా మానవత్వం మరిచి ప్రవర్తిస్తుండడంతో పేదలపై కరోనా భారం కన్నా వడ్డీ భారం ఎక్కువగా కనిపిస్తోంది. కూలీలు, వీధి వ్యాపారులు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వడ్డీకి తీసుకుంటున్నారు. రోజూ వారీ, వారం వారీ పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంది. వీధి వ్యాపారులు పెట్టుబడి కోసం ఉదయం తీసుకుంటే సాయంత్రానికి తిరిగి చెల్లించాలి.


ఇప్పుడు రోజంతా వ్యాపారం చేసినా తిరిగి చెల్లించడానికి మొత్తం సరిపోతోంది తప్ప ఏమీ మిగలడం లేదని పలువురు రోడ్డు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి నుంచి ప్రామిసరీ నోట్లు, వస్తువులు, వాహనాలు, ఇళ్ల పట్టాలు తీసుకుంటూ వడ్డీకి డబ్బులిస్తున్నారు. పనులు దొరక్క ఒకటి, రెండు రోజులు తిరిగి చెల్లించడంలో ఆలస్యమైతే బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కాల్‌ మనీ వ్యవహారం సాగిన తీరులోనే ప్రస్తుతం కూడా పరిస్థితులు మారుతున్నా యి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే నిరుపేదల జీవితాలు వడ్డీ మాఫియాల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముంది. 

Updated Date - 2020-08-01T10:39:32+05:30 IST