ఇప్పుడు జగన్‌.. నాలుగేళ్ల తర్వాత మరొకరు...!

ABN , First Publish Date - 2020-02-08T07:10:34+05:30 IST

అమరావతి రాజధానిని మూడు ముక్కలుగా చేస్తుండటంతో..

ఇప్పుడు జగన్‌.. నాలుగేళ్ల తర్వాత మరొకరు...!

రాజధాని అందరి సమస్య..‘మూడు ముక్కల’ను వ్యతిరేకించండి

ఇలా మార్చుకుంటూపోతే రాష్ట్రం అథోగతే!

సూళ్లూరుపేటలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


సూళ్లూరుపేట(నెల్లూరు): అమరావతి రాజధానిని మూడు ముక్కలుగా చేస్తుండటంతో నష్టపోయేది ఆ ప్రాంత 29 గ్రామాల ప్రజలేకాదని రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం సూళ్లూరుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తుండటంతో ప్రజల్లో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. నేడు జగన్‌ రాజధానిని మూడు ముక్కలు చేస్తే మరో నాలుగేళ్ల తరువాత వచ్చే ముఖ్యమంత్రి మరోచోట రాజధాని అంటే పరిస్థితి ఏమిటన్నారు. ఇలా ఎవరికివారు రాజధానులను మార్చుకుంటూ పోతే ఇక ఈ రాష్ట్ర పరిస్థితి అథోగతి అన్నారు. అందుకే 13 జిల్లాల ప్రజలు అమరావతిని మూడు ముక్కలు చేయడాన్ని వ్యతిరేకించాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. 


మోదీ వల్ల దేశంలో సివిల్‌ వార్‌

ప్రధాని నరేంద్ర మోదీ తీరువల్ల దేశంలో సివిల్‌ వార్‌ తప్పేలా లేదని నారాయణ అన్నారు. దేశాన్ని ప్రైవేట్‌ కార్పొరేట్‌కు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న దేశవ్యాప్తంగా  ఆందోళనలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల సీపీఐ కార్యదర్శులు ప్రభాకర్‌,  రామానాయుడు, చిత్తూరు నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు హరినాథరెడ్డి, స్థానిక నేతలు ఓగూరు కృష్ణయ్య, ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T07:10:34+05:30 IST