హమ్మయ్య! టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల రద్దు

ABN , First Publish Date - 2020-06-21T10:43:37+05:30 IST

పదో తరగతితోపాటు, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

హమ్మయ్య! టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల రద్దు

విద్యార్థులందరూ పాస్‌

ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు 


నెల్లూరు (విద్య) జూన్‌ 20 : పదో తరగతితోపాటు, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలను  రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించడంతో జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. జూలై 10 నుంచి 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు  చేస్తోంది. జిల్లాలోని 848 ఉన్నత పాఠశాలల నుంచి 38,179 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంది. గతంలోనే వీరందరికీ హాల్‌టికెట్లు పంపించడంతో పాటు, 190 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. కరోనా కారణంగా అప్పట్లో వాయిదా పడిన పరీక్షలను  జూలైలో నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా 17 ప్రైవేట్‌ కేంద్రాలతో కలిపి జిల్లాలో 281 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 50 సెంటర్లను కూడా సిద్ధం చేసుకున్నారు. శనివారం నుంచి  హాల్‌టికెట్ల జారీకి విద్యాశాఖ సిద్ధమైంది. ఈ తరుణంలో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తం అవుతోంది .


ఇంటర్‌ సప్లిమెంటరీ..

ఇటీవల విడుదలైన ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాఽధించని విద్యార్థులకు జూలై 11 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఈ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది.  జిల్లాలో  జూనియర్‌ ఇంటర్‌లో 6,382 మంది బాలురు, 4,999 మంది బాలికలు,  సీనియర్‌ ఇంటర్‌లో 4,600 మంది బాలురు, 3,427 మంది బాలికలు ఫెయిల్‌ అయ్యారు. వారందరినీ పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-06-21T10:43:37+05:30 IST