మరోసారి చార్జీల మోత..?

ABN , First Publish Date - 2020-03-02T17:14:36+05:30 IST

అసలే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రోడ్డు రవాణా సంస్థకు పెరిగిన డీజిల్‌..

మరోసారి చార్జీల మోత..?

ఆర్టీసీకి ఆయిల్‌ దెబ్బ

రీజియన్‌పై నెలకు రూ.18 లక్షల అదనపు భారం

పెరిగిన డీజిల్‌ ధరతో మరింత నష్టం

ఇప్పటికే నష్టాల ఊబిలో సంస్థ

నిర్వీర్యం దిశగా అధికారుల అడుగులు

ఆందోళనలో ప్రయాణికులు


నెల్లూరు (ఆంధ్రజ్యోతి): అసలే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రోడ్డు రవాణా సంస్థకు పెరిగిన డీజిల్‌ ధర మరింత భారంగా మారింది. డీజిల్‌ లీటర్‌పై రూ.1.07 పైసలు పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్టీసీకి ఆశనిపాతంగా మారింది. దీని వల్ల నెల్లూరు రీజియన్‌పై ప్రతినెలా సుమారు రూ.18లక్షల మేర అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో మరోసారి చార్జీల మోత మోగిస్తారేమోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.


మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది ఆర్టీసీ సంస్థ పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేసి, సంస్థను వదిలేయడం, ఆర్టీసీ ఎండీ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు పరిశీలిస్తున్న ఆర్టీసీ కార్మికులు, సామాన్య ప్రజలు ఆర్టీసీని నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో డీజల్‌ ధరను పెంచడంతో  ఆర్టీసీని దేవుడే కాపాడాలని వారు భావిస్తున్నారు.


రీజియన్‌పై నెలకు రూ.18లక్షల భారం

డీజల్‌పై ఆర్టీసీకి రాయతీ ఇవ్వాలని పలుమార్లు  కార్మిక సంఘాలు పలు ప్రభుత్వాలను వేడుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం డీజల్‌ ధర పెంచడంతో ఆర్టీసీపై అధిక భారం పడనుంది. ఇప్పటికే ఉన్న నష్టాలు ఎలా పూడ్చుకోవాలని ఆలోచిస్తున్న యాజమాన్యం పెరిగిన డీజల్‌ ధరతో మరింతగా నష్టపోనుంది. నెల్లూరు ఆర్టీసీ రీజియన్‌లో పది ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో 750కు పైగా బస్సులు రోజూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. ప్రతి రోజు పది డిపోల పరిధిలో 56వేల లీటర్ల డీజల్‌ వినియోగిస్తారు. అంటే నెలకు 16,80,000ల లీటర్ల డీజల్‌ ఖర్చవుతోంది. ప్రస్తుతం లీటర్‌ డీజల్‌పై రూ.1.07లు ధర పెరగడంతో నెల్లూరు రీజియన్‌పై నెలకు రూ.18లక్షలకు పైగా అదనపు భారం పడనుంది. అంటే ఏడాదికి రూ.2.2 కోట్లకు పైగా రీజియన్‌పై భారం పడనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. డీజల్‌ ధరలు పెరగడంతో సంస్థకు భారీగా నష్టం వస్తుందన్న భావనతో మరో మారు ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై ఆ భారం ప్రభుత్వం మోపుతుందేమోనని సర్వత్రా చర్చించుకుటున్నారు.

Updated Date - 2020-03-02T17:14:36+05:30 IST