మొరాయిస్తున్న సర్వర్..! బదిలీల కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్‌కు అవస్థ
ABN , First Publish Date - 2020-12-16T03:54:24+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్‌లో నమోదు చేసుకోవడానికి సర్వర్ సక్రమంగా పనిచేయక మొరాయిస్తోంది.
గంటల తరబడి ఉపాధ్యాయుల నిరీక్షణ
బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 15: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్‌లో నమోదు చేసుకోవడానికి సర్వర్ సక్రమంగా పనిచేయక మొరాయిస్తోంది. దీంతో గంటల తరబడి ఉపాధ్యాయులు నిరీక్షిస్తున్నారు. అసలే ఆలస్యంగా మొదలైన వెబ్ ఆప్షన్, మొరాయింపుతో పేరు నమోదు చేసుకోలేకపోయిన ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 11 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని నిర్ణయించింది. అయితే 12వ తేదీ రాత్రి వెబ్ అప్‌లోడ్ చేయడంతో రెండు రోజులు ఆలస్యంగా ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనికితోడు సర్వర్లు సరిగా పనిచేయడం లేదు. ఇదిలావుండగా నెట్ సెంటర్లలో ఆన్‌లైన్‌లో 100 ఆప్షన్లు నమోదు చేసిన తర్వాత సర్వరు మొరాయిస్తే మొత్తం డెలీట్ అయిపోతున్నాయి. మళ్లీ మొదటి నుంచి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఉపాధ్యాయులు ఆప్షన్ నమోదుకు సోమవారం నుంచి నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,684 మంది ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉండగా బుచ్చి మండలంలో 150 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా మంగళవారానికి ముగియనున్న గడువును బుధవారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారన్న సమాచారంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బుధవారం కూడా సర్వర్లు ఇలానే ఉంటే పరిస్థితి ఏమిటన్నది ఉపాధ్యాయులను వేధిస్తున్న ప్రశ్న.
2017 మ్యాన్యువల్ పద్ధతిలోనే బదిలీలు నిర్వహించాలి
సర్వరు పనిచేయక ఉపాధ్యాయులు తంటాలు పడుతున్న నేపధ్యంలో ఆన్‌లైన్‌లో ఆప్షన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు గడువు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి, వీవీ శేషులు, రాష్ట్ర కౌన్సిలర్ కే.వీ శ్రావణకుమార్ బుచ్చి, దగదర్తి, సంగం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరారు. లేకపోతే 2017లో నిర్వహించిన మాన్యువల్ పద్ధతిలోనే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు.