బొక్కిందెవరు!?

ABN , First Publish Date - 2020-06-23T10:38:27+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వ ఆసుపత్రిలో అరకోటి నిధులు గోల్‌మాల్‌ జరిగి 10 రోజులైనా నేటికీ వాస్తవాలు వెలుగులోకి రాలేదు.

బొక్కిందెవరు!?

బుచ్చి ఆసుపత్రిలో నిగ్గు తేలని నిధుల గోల్‌మాల్‌

అర కోటి మాయమైనా అంతుచిక్కని వాస్తవాలు

రికార్డురూంకు తాళం వేశారన్న సాకు..


బుచ్చిరెడ్డిపాళెం, జూన్‌ 21 : బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వ ఆసుపత్రిలో అరకోటి నిధులు గోల్‌మాల్‌ జరిగి 10 రోజులైనా నేటికీ వాస్తవాలు వెలుగులోకి రాలేదు. పైగా విచారణను నీరుగారుస్తున్నారని ఆ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలోనే విమర్శలు వస్తున్నాయి. 50 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో ఐదుగురు డాక్టర్లతోపాటు నర్సులు, సిబ్బంది మొత్తం 20 మంది ఉన్నా విధులు నిర్వహించేది కొద్దిమందే. నిధులు గోల్‌మాల్‌ విషయం వెలుగు చూడడానికి ముందు అభివృద్ధి కమిటీ విధులు, నిధులు సమస్యలపై వైద్యులు, సిబ్బందితో సమావేశమై అవి సక్రమంగా అమలు చేసి సరిగా రోగులకు వైద్య సేవలందించకపోతే చర్యలు తీవ్రంగా వుంటాయని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత వారంలోపు ఈ నిధుల బాగోతం వెలుగుచూసింది. గోల్‌మాల్‌ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసిన పక్క రోజు రాత్రి జూనియర్‌ అసిస్టెంట్‌ బంధువులతో మంతనాలు చేసిన విషయం తెలుసుకుని మరో సభ్యుడు వైద్యులను ఆరా తీశారు.


ఈ విషయమై విజిలెన్స్‌ అధికారులతో విచారించేందుకు సిద్ధమవుతుండగానే వైద్యాధికారులు తమ పలుకుబడి ఉపయోగించి ప్రాథమిక విచారణకే పరిమితం చేశారనే విమర్శలు ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంటే రికార్డు గదికి తాళం వేసుకుని వెళ్లిందని వైద్యాధికారులు చెప్పడం, ఇంతలో ఆ ఉద్యోగిని సస్పెండ్‌ చేయడం, విచారణ ముందుకు సాగకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆస్పత్రిలో సుమారు అరకోటి నిధులు ఎవరి ప్రమేయం లేకుండా ఒక్క జూనియర్‌ అసిస్టెంటే ఇద్దరు వైద్యాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కాజేయడం సాధ్యమా!? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.


ఇదిలావుండగా ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులు రూ.5లక్షలకుపైగా ఆ ఖాతా నుంచి వాడుకున్నట్లు, మళ్లీ ఆ ఖాతాలో కొంత జమ చేసిందని ఓ వైద్యాధికారి చెప్పారు. కేవలం డ్రా చేసుకునే అవకాశమే ఉన్న ఈ ఖాతాలో జమ చేసే అవకాశం లేదని ఆ శాఖ ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వమే నేరుగా నిధులు జమ చేసే ఈ ఖాతాలో ఇతరులు జమ చేసే అవకాశమే లేదని, ఇలా చెప్పుకుంటూ పోతే నిఽధులు గోల్‌మాల్‌పై ఎన్నో అనుమానాలు  ఆ శాఖ ఉద్యోగుల్లోనే వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా గోల్‌మాల్‌పై తాము చింతిస్తున్నట్లు చెబుతూ వివరాలు వెల్లడించడంపై గోప్యత పాటించారు.


విజిలెన్స్‌ విచారించాలి.. తిరువాయిపాటి నందకుమార్‌, హెచ్‌డీసీ సభ్యుడు 

నిధులు  గోల్‌మాల్‌పై విజిలెన్స్‌ విచారణకు ఎమ్మెల్యేను కోరుతాము. తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం ఒప్పుకోదు. సీఎం జగన్మోహన్‌రెడ్డి 500 రకాల మందులు సరఫరా చేస్తుంటే ఇక్కడ కనీసం ఐదు రకాల మందులు కానీ, వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. ఎమ్మెల్యే ద్వారా ప్రత్యేక కమిటీతో విచారించి రోగులకు అన్ని వసతులతో వైద్య సేవలందించేందుకు కృషి చేస్తాం.


Updated Date - 2020-06-23T10:38:27+05:30 IST