కేంద్ర పథకాలకు విస్తృత ప్రచారం అవసరం

ABN , First Publish Date - 2020-12-12T04:50:18+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై విస్తృత ప్రచారం అవసరమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు.

కేంద్ర పథకాలకు విస్తృత ప్రచారం అవసరం
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు


ముత్తుకూరు, డిసెంబరు 11: కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న అభివృద్ధి   పథకాలపై విస్తృత ప్రచారం అవసరమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. ముత్తుకూరులో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. రాబోయే తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో పార్టీని పటిష్టపరిచే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం తిరుపతిలో జరిగే పదాధికారుల సమావేశానికి ముత్తుకూరు మండలానికి చెందిన పదాధికారులు హాజరు కావాలని కోరారు.   కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా, మండల అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, నాయకులు వంశీధర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, శ్రీధర్‌, ప్రసాద్‌, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. 

 

వైసీపీ ప్రభుత్వం అన్నివిధాల వైఫల్యం

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ

టీపీగూడూరు : ప్రజా సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. నరుకూరులోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది నెలల కాలంలో సంక్షేమం పేరిట లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు. పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్న అవినీతితో పరిశ్రమలు మన రాష్ట్రానికి రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయన్నారు. టీటీడీ నిధులను ఆలయాల అభివద్ధికి, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వం, పథకాల అమలుకు వినియోగించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ, టీడీపీల వైఖరితో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాబోయే తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాసులు, జనార్ధన్‌, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  

 

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయండి

 బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్‌

వెంకటాచలం  : రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లో క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. వెంకటాచలంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తల విసృత్త స్థాయి సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని బిల్లులకు వైసీపీ ఎంపీలు మద్దతు ప్రకటించి, రాష్ట్రంలో   వ్యతిరేకించడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రజలను మోసగించడం కాదా అని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలేనని, ఆ పథకాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే వాటికి పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని తీవ్రస్థాయిలో ఆయన విమర్శించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్‌,  బీజేపీ జిల్లా సీనియర్‌ నాయకుడు అల్లూరు ప్రసాద్‌నాయుడు, మండల ఇన్‌చార్జ్‌ సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి ఆరుముళ్ల మురళీ తదితరులున్నారు.   Updated Date - 2020-12-12T04:50:18+05:30 IST