బిట్రగుంట ఎస్‌ఐ నుంచి రక్షణ కల్పించండి
ABN , First Publish Date - 2020-12-18T02:53:51+05:30 IST
బిట్రగుంట ఎస్‌ఐ సుమన్ వేధింపుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బోగోలు మండలం కడనూతలకు చెందిన లింగంగుంట అంకమ్మ, రమణయ్యలు కోరారు.

కావలి, డిసెంబరు 17: బిట్రగుంట ఎస్‌ఐ సుమన్ వేధింపుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బోగోలు మండలం కడనూతలకు చెందిన లింగంగుంట అంకమ్మ, రమణయ్యలు కోరారు. కావలి జర్నలి్‌స్ట క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏ నేరం చేయని తమ కుమారుడు వేణుగోపాల్‌ను ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం పోలీసులు మా ఇంటికి వచ్చి ఎస్‌ఐ రమ్మంటున్నారని తీసుకునివెళ్లి దారుణంగా హింసించి కాళ్లూ, చేతులు పనిచేయకుండా కొట్టారన్నారు. తీవ్రంగా గాయపడిన తమ కుమారుడిని చికిత్స నిమిత్తం అదేరోజు రాత్రి బిట్రగుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పోలీసులే చేర్పించారన్నారు. ఆ విషయం తెలుసుకుని తాము అక్కడి నుంచి కావలి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నామని చెప్పారు. తమ కుమారుడిని ఎందుకు కొట్టి వేధిస్తున్నారని తాము ఎస్‌ఐ సుమన్‌ను ప్రశ్నించగా మీకు దిక్కున్నచోట చెప్పుకోండని, అవసరమైతే తామే రైలు పట్టాలపై విసిరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తామని బెదిరించారని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారే భక్షిస్తుంటే ఏమి చేయాలో తెలియక నెల్లూరుకు వెళ్లి ఈ విషయంపై అడిషనల్ ఎస్పీ వెంకటరత్నంకు ఫిర్యాదు చేసి న్యాయం చేయమని కోరామన్నారు. అయినప్పటికీ ఎస్‌ఐ సుమన్ వేధింపులు ఎక్కువయ్యాయని, ఆయన నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.