ఆయన అటు.. వీరంతా ఇటు!

ABN , First Publish Date - 2020-11-06T17:37:19+05:30 IST

అంతర్గత కుమ్ములాటలు.. వీధి పోరాటాలు.. తిరుగుబాట్లతో..

ఆయన అటు.. వీరంతా ఇటు!

గూడూరులో వైసీపీ నేతల మధ్య విభేదాలు

ఎమ్మెల్యే తీరుపై కేడర్‌లో ఆగ్రహం

ముఖ్యనేతలతోనూ సత్సంబంధాలు కట్‌!

బీసీ డైరెక్టర్‌ పదవులతో కొత్త చిచ్చు

జీర్ణించుకోలేకపోతున్న ఇతర నాయకులు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): అంతర్గత కుమ్ములాటలు.. వీధి పోరాటాలు.. తిరుగుబాట్లతో గూడూరు వైసీపీ కుతకుతలాడిపోతోంది. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని సీఎంను చేయాలని విపరీతంగా శ్రమించిన కార్యకర్తలు పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి తలలు పట్టుకొంటున్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌కు పార్టీలోని ముఖ్య నాయకులకు మధ్య సత్సంబంధాలు కొరవడ్డాయి. ముఖ్య నాయకులంతా ఒకటిగా ఉన్నారా!? అంటే అదీ లేదు. వీరి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. మొన్నటి బీసీ డైరెక్టర్‌ పోస్టులతో ముఖ్యనేతల మధ్య అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. 


రాజకీయాల్లో ఉద్దండుల నెలవైన గూడూరులో అధికార వైసీపీ నేతల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే వరప్రసాద్‌ ఒకవైపు.. నాయకులంతా మరోవైపు  అన్నట్టుగా ఉంటున్నారు. పాతవారిని పట్టించుకోకుండా కొత్తవారికి పీటం వేస్తున్నారన్న ఆవేదనతో ఈ నెల 3వ తేదీన గూడూరు మండల వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. వైసీపీ మండల కన్వీనర్‌ మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కార్యకర్తలు ఎమ్మెల్యేని గట్టిగా నిలదీశారు. తమ పనులు కావడం లేదని, డబ్బులిచ్చినవారి పనులే చేస్తున్నారనీ గగ్గోలు పెట్టారు. ఇందుకేనా మిమ్మిల్ని గెలిపించిందం టూ నిలదీశారు. ఓ ఎమ్మెల్యేని, సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నిలదీసి విమర్శించే స్థాయికి చేరుకున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించవచ్చు. అంగన్‌వాడీ పోస్టుల మొదలు, సబ్‌స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్ల వరకు ప్రతి పనికి ఎమ్మెల్యే మనుషులు డబ్బులు తీసుకొంటున్నారన్నది ప్రధాన ఆరోపణ. తూర్పు కనుపూరు ఆలయ ట్రస్ట్‌ బోర్డు నియామకం సందర్భంగా వైసీపీ వర్గాలు రెండుగా విడిపోయి బహిరంగంగా విమర్శించుకున్నా యి. ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నాడని  ఓ వర్గం ఆరోపిస్తే.. అది అవాస్తమని మరో వర్గం ఖండించింది.


ఎక్కడ పొసగలేదో.. ఎవరివైపు తప్పు జరిగిందో తెలియదు కానీ తొలి నుంచి ఎమ్మెల్యేకి, నాయకుల మధ్య సఖ్యత కుదరలే దు. ఇక నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుల విషయానికి వస్తే నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డికి ఎమ్మెల్యేకి మధ్య సత్సంబంధాలు లేవు. ఎల్లసిరి గోపాల్‌రెడ్డికి ఎమ్మెల్యేకి సంబంధాలు అంతంత మాత్రమే. పేర్నాటి శ్యాం ప్ర సాద్‌రెడ్డి ఎమ్మెల్యేకి దూరంగా ఉంటూనే పార్టీలో అగ్రనేతల సహకారంతో ఎమ్మెల్యేకి సమాంతర పాలన సాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక నల్లపరెడ్డి కుటుంబంతో కూడా ఎమ్మెల్యేకి మునుపటి సంబంధాలు లేవని ప్రచారం. 


బీసీ డైరెక్టర్ల పదవులతో..

ఎమ్మెల్యే మినహా నియోజకవర్గంలో నాయకులంతా ఒకటిగా ఉన్నారా అంటే అదీ లేదు. బీసీ డైరెక్టర్‌ పదవులు  కొత్త చిచ్చు పెట్టాయి. గూడూరు నియోజకవర్గానికి నాలుగు డైరెక్టర్‌ పోస్టులు వచ్చాయి. వాటిలో మూడు పేర్నాటి శ్యాంప్రసాద్‌ రెడ్డి తన వర్గీయులకు ఇప్పించుకున్నారు. ఇది ఇతర నాయకుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి స్వస్థలమైన వాకాడు మండలంలో ఆయన ప్రమేయం లేకుండా పేర్నాటి సిఫారసు చేసిన వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించారని, దీనిని నేదురుమల్లి వర్గం జీర్ణించుకోలేకపోతోందని అంటున్నారు. నేదురుమల్లి రాంకుమార్‌ ఇద్దరి పేర్లను, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఒక పేరును డైరెక్టర్‌ పోస్టులకు సిఫారసు చేసినట్లు సమాచారం. కానీ పేర్నాటి సిఫారసు చేసిన వారికే మూడు పదవులు దక్కినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని పేర్నాటి వర్గం మినహా మిగిలిన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు ప్రచారం. బీసీ డైరెక్టర్‌ పోస్టులకు ఎమ్మెల్యే లెటర్‌ తప్పనిసరి అని నిబంధన పెట్టారని, అయితే ఎమ్మెల్యే సిఫారసు లెటర్‌ లేని పేర్నాటి వర్గానికి మూడు పదవులు ఎలా ఇచ్చారని మిగిలిన నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.  పేర్నాటికి సజ్జల ఆశీస్సులు ఉండటంతోనే ఇతర నాయకులను, ఎమ్మెల్యేని పక్కన పెట్టి మూడు డైరెక్టర్‌ పోస్టులు ఆయన చెప్పినవారికి కట్టబెట్టారని అంటున్నారు. మొత్తంపై బీసీ డైరెక్టర్‌ నియామకాలతో నియోజకవర్గ వైసీపీలో మరో కొత్త వివాదం రాజుకుంది. అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో గూడూరు వైసీపీ అట్టుడికిపోతోంది. 




Updated Date - 2020-11-06T17:37:19+05:30 IST