రేపు భారత్‌ హర్తాళ్‌

ABN , First Publish Date - 2020-12-07T04:51:38+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం దేశవ్యాప్తంగా హర్తాళ్‌ జరుగుతుందని, దీనిని జిల్లాలో జయప్రదం చేయాలని జిల్లా రైతాంగ ఐక్యవేదిక నాయకులు చిరసాని కోటిరెడ్డి, వీ రామరాజు తదితరులు పిలుపునిచ్చారు.

రేపు భారత్‌ హర్తాళ్‌

నెల్లూరు(సాంస్కృతికం/స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 6 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం దేశవ్యాప్తంగా హర్తాళ్‌ జరుగుతుందని, దీనిని జిల్లాలో జయప్రదం చేయాలని జిల్లా రైతాంగ ఐక్యవేదిక నాయకులు చిరసాని కోటిరెడ్డి, వీ రామరాజు తదితరులు పిలుపునిచ్చారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ హర్తాళ్‌లో పాలు, కూరగాయలు, పండ్లు, పూలు, తదితర వ్యవసాయ ఉత్పత్తులను గ్రామాల నుంచి తరలించకుండా స్వచ్ఛందంగా నిలుపుదల చేయాలని కోరారు. అన్ని వ్యాపార సంస్థలు, హోటళ్లు, వివిధ రకాల మార్కెట్లు మూసి వేయాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు, యూనియన్లు, ఎన్జీవోలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టిన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ చేసిన నూతన వ్యవసాయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేవరకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆ చట్టానికి మద్దతిచ్చి వైసీపీ,  టీడీపీలు రైతులకు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. ఈ సమావేశంలో పీ శ్రీరాములు, జీ రమణయ్య, ఏవీఆర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా, కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ బిల్లులు విధ్వంసకరమైనవని, వాటికి వ్యతిరేకంగా మంగళవారం జరిగే ఆందోళన కార్యక్రమాల్లో విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పీడీఎస్‌వో నగర కార్యదర్శి వీ దీప్తి ఓ ప్రకటనలో కోరారు.  

Read more