కూరగాయలకు కృత్రిమ కొరత

ABN , First Publish Date - 2020-03-24T07:15:14+05:30 IST

వ్యాపారులు కూరగాయలకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడిని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన

కూరగాయలకు కృత్రిమ కొరత

అధిక రేట్లకు విక్రయం

ప్రజలను దోచుకుంటున్న వ్యాపారులు

మార్కెట్‌ ధర ఒకటేతే అమ్మేదొకటి..

ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతరు


నెల్లూరు(వ్యవసాయం), మార్చి23: వ్యాపారులు కూరగాయలకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడిని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని ఆసరా చేసుకున్న వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తూ  ప్రజలను దోచుకుంటున్నారు. మార్కెట్‌ కమిటీ నిర్ణయించిన ధర కంటే అదనంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యావసరాలతోపాటు కూరగాయల ధరలు పెంచవద్దని ప్రభుత్వం హెచ్చరించినా వ్యాపారులు ఏమాత్రం లెక్కచేయలేదు. 

 

నెల్లూరులోని ఏసీ కూరగాయల మార్కెట్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టమోటా, పచ్చిమిర్చి, చేమగడ్డ, బెండకాయలు, దోస, అరటి, ఆకుకూరలు, కాకరకాయలు, బీరకాయలు, వంకాయలను జిల్లా, చుట్టుపక్కల జిల్లాల నుంచి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాప్సికం, ముల్లంగిలను కోలార్‌ నుంచి పులివెందుల, అనంతపురం, కల్యాణదుర్గం, మదనపల్లి నుంచి టమెటా దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం కూరగాయల కొరత లేదు. మార్కెట్‌ కమిటీ సూచించిన రేట్లకు విక్రయించాల్సిందిపోయి వ్యాపారాలు కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు అమ్ముతున్నారు. ఇళ్ల వద్ద అమ్మకాలు సాగించే దుకాణాల్లో కూరగాయల ధరలు మరింత ప్రియమయ్యాయి. మార్కెట్‌లో అమ్మే ధరలతో పోలిస్తే రెండింతలు అదనంగా విక్రయిస్తున్నారు.


మచ్చుకు కొన్ని..

 కిలో టమోటా రూ.20లకు అమ్మాలని మార్కెట్‌ కమిటీ చెబుతుంటే వ్యాపారులు రూ.25లకు విక్రయిస్తున్నారు. రూ.40ల క్యారెట్‌ను రూ,60లకు, రూ.20 క్యాబేజీని రూ.30లకు, రూ.80ల అల్లంను రూ.120లకు రూ.20ల బెండకాయలను రూ.40లకు, రూ.30ల బీరకాయ రూ.60, రూ.20ల దోసకాయ రూ.30, రూ.4ల అరటికాయ రూ.10లకు విక్రయిస్తున్నారు.


అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం

మార్కెట్‌ కమిటీ రేటు ప్రకారం విక్రయాలు సాగించకపోయినా, మాకు ఫిర్యాదులు అందినా విచారించి ఆయా దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం. ప్రస్తుతం కూరగాయాల కొరత లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయాలు మార్గమఽధ్యంలో ఉన్నాయి. జిల్లాలో పండించే కూరగాయలను ఇతర రాష్ట్రాలకు పంపకుండా ఇక్కడే వ్యాపారాలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే ప్రత్యేక అనుమతులు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి కూరగాయాలు తెప్పించి వినియోగదారులు అందుబాటులో ఉంచుతాం.

ఎంబేటి ఏసయ్య, నెల్లూరు ఎంఎంసీ చైర్మన్‌


కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

రైతుబజార్లలో నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. కృత్రిమ కొరత సృష్టించకూడదు. ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అధిక ధరలకు విక్రయించి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేయొద్దు.

రామమ్మ, మార్కెటింగ్‌ ఏడీ

Updated Date - 2020-03-24T07:15:14+05:30 IST