పకడ్బందీగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-07T10:44:48+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. గడిచిన రెండు రోజులుగా పోలీసులు ఆంక్షలను మరింత

పకడ్బందీగా లాక్‌డౌన్‌

24 మందిపై కేసులు

22 వాహనాల సీజ్‌


నెల్లూరు (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 6 :  జిల్లాలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. గడిచిన రెండు రోజులుగా పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అలానే నిత్యావసర కొనుగోలు సమయాన్ని కూడా ఉదయం పది గంటల వరకే పరిమితం చేశారు. దీంతో ఎవరూ రోడ్లపైకి రావడం లేదు. ఎక్కడికక్కడ పోలీసులు చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మిగిలిన వారిని తిప్పి పంపుతు న్నారు. కొన్ని సందర్భాల్లో కేసులు నమోదుచేయడంతోపాటు జరిమానా కూడా విధిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగానే స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. ముఖ్యంగా రెడ్‌జోన్లు ప్రకటించిన ప్రాంతాల్లో పోలీసు పహారా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోకి ఇతరులను ఎవరిని రానీయడం లేదు.


వివరాల సేకరణ

రెడ్‌జోన్‌ ఏరియాల్లో ఎవరిని బయటకు వెళ్లనీయడం లేదు. నిత్యావసరాలను కూడా ఇళ్ల వద్దకే చేరుస్తున్నారు. ప్రత్యేక టీమ్‌లు ఇంటింటికి తిరుగుతూ ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయా వంటి వివరాలను సేకరిస్తున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అలానే 22 వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు మరో 39 వాహనాలకు రూ. 20,865లు జరిమానా విధించారు. కాగా 144 సెక్షన్‌ అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు జిల్లాలో 2,641 మందిపై 1760 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 1451 వాహనాలు సీజ్‌ చేయడంతోపాటు 17,175 వాహనాలకు రూ. 93.36 లక్షలు జరిమానా విధించారు. 


Updated Date - 2020-04-07T10:44:48+05:30 IST