రైతు సంఘాలకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం!

ABN , First Publish Date - 2020-12-26T04:55:03+05:30 IST

జిల్లాలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో..

రైతు సంఘాలకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం!
రైతు భరోసా కేంద్రం

చెప్పిందొకటి.. చేసేదొకటి!

ట్రాక్టర్‌ లేకుండా పరికరాలకే సాయం

వాటిలో 40 శాతమే రాయితీ

ఖాతాలు తెరిచాక అధికారుల మెలిక

అన్నదాతల నిరాసక్తత


సంగం(నెల్లూరు): రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటైన రైతు సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న వింత నిర్ణయంతో అన్నదాతకు అందాల్సిన ప్రయోజనాలు దూరమయ్యే దుస్థితి నెలకొంది. ట్రాక్టర్‌ లేకుండా కేవలం యాంత్రీకరణ పరికరాలకే సాయమిస్తామని సెలవివ్వడంతో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు వద్దంటూ వ్యవసాయాధికారులకు తేల్చి చెప్పేస్తున్నారు.


జిల్లాలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో పది అంతకంటే ఎక్కువ మంది రైతులు సంఘాలగా ఏర్పడితే కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల పేరుతో రూ.12 లక్షల నుంచి 15 లక్షల విలువ చేసే ట్రాక్టర్‌, యాంత్రీకరణ పరికరాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని ఆ సంఘం రైతులతోపాటు మిగిలిన కొంతమంది రైతులకు అద్దెకు వినియోగించుకుని ప్రయోజనం పొందాలన్నది దాని ఉద్దేశం. ఇందులో 40 శాతం రాయితీ, 10 శాతం సంఘం వాటా, మిగిలిన 50 శాతం బ్యాంకు అప్పు. అద్దె రూపంలో వచ్చే ఆదాయంతో అప్పు చెల్లించే విధంగా పథకం రూపొందించారు. ఇలా జిల్లావ్యాప్తంగా 660 రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పడిన 660 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు మంజూరుకు సిద్ధం చేశారు. 


ట్రాక్టర్‌ లేదని ఆదేశాలు..

యూనిట్‌ గ్రౌండింగ్‌ చేసే సమయంలో తాజాగా ట్రాక్టర్‌ లేదని కేవలం యాంత్రీకరణ పరికరాలేనని అధికారులు సెలవిచ్చారు. దీంతో కొన్ని రైతు సంఘాలు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నాయి. ఒక రైతు భరోసా కేంద్రంలో ఒక సంఘానికే మంజూరయ్యే అవకాశం ఉండడం, అందులో 40 శాతం రాయితీ ఉండడంతో అధికార పార్టీ నాయకులకు అనుచరులుగా ఉన్నవారే సంఘాలుగా ఏర్పడ్డారు. వారిలోనూ రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. ఒక సంఘానికే అవకాశం ఉండడంతో అధికారులు ఎవరు ఎమ్మెల్యే లెటర్‌ తెస్తారో ఆ సంఘానికి మంజూ రు చేస్తామని చెప్పారు. అలాంటి చోట్ల ఇంకా ఎటువంటి మంజూరు ఇవ్వలేదు. ప్రభుత్వ షరతులతో బ్యాంక్‌లో ఖాతాలను తెరిచాక ట్రాక్టర్‌ లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో రైతు పథకానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లు తయారైంది. అయితే ఇప్పటికే మంజూరు ఇచ్చిన ఆయా రైతు సంఘాలు తీసుకునే యాంత్రీకరణ పరికరాలను స్థానిక రైతులకు అద్దెకు ఇచ్చేలా ఒప్పందం రాయించుకున్నారు. తీరా యాంత్రీకరణ పరికరాలు ఎంపిక చేసుకునే సమయంలో ట్రాక్టర్‌ ఇవ్వడం లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.


రైతుల్లో అసంతృప్తి

ట్రాక్టర్‌ లేకుండా ఇతర యాంత్రీకరణ పరికరాలు తీసుకొని ఏం చేసుకోవాలంటూ కొన్ని సంఘాల్లోని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్‌ ఇవ్వకుండా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు వద్దంటూ ఎక్కువ గ్రూపులు వ్యవసాయ అధికారులకు తేల్చి చెపుతున్నారు. ఎంతో కష్టపడి రైతులంతా సంఘాలుగా ఏర్పడి, బ్యాంక్‌లో అకౌం ట్‌ ఓపెన్‌ చేసుకున్న తర్వాత ట్రాక్టర్‌ లేదని చెప్పడం ఏమిటని  రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-12-26T04:55:03+05:30 IST