అందరిలో ఆందోళన!

ABN , First Publish Date - 2020-03-13T09:46:08+05:30 IST

సాధారణంగా ఒక్కో వర్గానికి ఒక్కో సీజన్‌ ‘పరీక్ష’ కాలంగా ఉంటుంది. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో రైతులకు ధాన్యం అమ్ముకోవడం పెద్ద

అందరిలో ఆందోళన!

విద్యార్థులు, రైతులు, నేతలు, సామాన్యులకు ‘పరీక్ష’

ఎన్నికల్లో గెలుస్తామో.. లేదోనని నేతల్లో టెన్షన్‌

విద్యార్థులకు ఫైనల్‌ పరీక్షల భయం

రైతులకు ధాన్యం అమ్మకాల యాతన

కరోనా దెబ్బకు ప్రజల్లో కంగారు


నెల్లూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : 

సాధారణంగా ఒక్కో వర్గానికి ఒక్కో సీజన్‌ ‘పరీక్ష’ కాలంగా ఉంటుంది.  ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో రైతులకు ధాన్యం అమ్ముకోవడం పెద్ద సవాల్‌గా మారుతోంది. మార్చి నుంచి మే వరకు రకరకాల పరీక్షలతో విద్యార్థులు కుస్తీ పడుతుంటారు. ఇక ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు టెన్షన్‌ టెన్షన్‌గా ఉంటారు. అయితే ఇవన్నీ ఒకే సీజన్‌లో వస్తే పరిస్థితేమిటి..?, వీటికి తోడు మానవ జాతిని వణికించే వైరస్‌ వ్యాప్తి జరుగుతుంటే..! ఇంకేముంది.. అన్ని వర్గాల్లో ఆందోళనే!. ప్రస్తుతం జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఓ వైపు, ఇంటర్‌ పరీక్షలు మరోవైపు అవి పూర్తవగానే పదో తరగతి పరీక్షలు, ధాన్యం కోతలు జోరుగా సాగుతుండటంతో ఆ ధాన్యాన్ని అమ్ముకోవడం ఎలా అని రైతులు ఇంకోవైపు, కరోనా భయంతో సామాన్యులు.... ఇలా ప్రతి ఒక్కరిలో టెన్షన్‌ కనిపిస్తోంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవడం జిల్లా యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. 


స్థానిక సంస్థల ఎన్నికల జోరు

ఆరేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు ఈ నెల 29తో పూర్తి కానున్నాయి. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా శుక్రవారంతో మున్సిపల్‌ ఎన్నికలకు కూడా నామినేషన్‌ గడువు ముగుస్తుంది. దీంతో రాజకీయ నాయకులంతా ఎన్నికల హడావిడిలో నిమగ్నమయ్యారు. గెలుపు కోసం వ్యూహాలు రచించుకుంటూ ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. విజయంపై వీరిలో టెన్షన్‌ నెలకొంది. 


విద్యార్థులకు పరీక్ష కాలం

ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 31 నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌లో మిగిలిన అన్ని తరగతుల పరీక్షలు జరుగుతాయి. ఆ వెంటనే ఎంసెట్‌, నీట్‌, ఈసెట్‌, పీజీసెట్‌ వంటి పోటీ పరీక్షలు ప్రారంభమవుతాయి. దీంతో ప్రస్తుతం విద్యార్థులంతా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఎంతబాగా చదివే వారైనా పరీక్ష అంటేనే  తెలియని ఆందోళన ఉంటుంది. 


రైతులకు సవాల్‌

ఈ రబీ సీజన్‌లో భారీగా వరి దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కూడా పుట్టికి మద్దతు ధర రూ.15597గా నిర్ణయించింది. ఆ ధర దక్కితే చాలని రైతులు ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ వరి బాగా పండటంతో ఇతర రాష్ట్రాలకు జిల్లా నుంచి ధాన్యం ఎగుమతులు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో దళారులు ధాన్యం ధరలను మరింత తగ్గించారు. పుట్టి రూ.12వేల నుంచి 13 వేలకు మించి కొనడం లేదు. ఇక ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామంటే అక్కడ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.


కరోనా... కరోనా

కరోనా... ఈ పేరు వింటేనే ప్రపంచం వణుకుతోంది. భయంకరమైన ఆ వైరస్‌ ఇప్పుడు నెల్లూరుకు చేరింది. రాష్ట్రంలోనే మొదటి పాజిటివ్‌ కేసు ఇక్కడ నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన ఓ విద్యార్థి కరోనా బారినపడటం, మరొకొంత మంది అనుమానితులు ఉండటంతో జిల్లా ఉలిక్కిపడింది. ఆ మహమ్మారి వైరస్‌ విషయంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


అధికార యంత్రాంగానికి కష్టకాలం

వీరందరి పరిస్థితి ఒకలా ఉంటే ప్రభుత్వ అధికార యంత్రాంగం పరిస్థితి మరోలా ఉంది. నాయకులు, విద్యార్థులు, రైతులు, ప్రజలు... ఇలా అందరి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత యంత్రాగంపై ఉంది. దీంతో వారు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2020-03-13T09:46:08+05:30 IST