ఐసోలేషన్‌కు మరో కరోనా అనుమానితుడు

ABN , First Publish Date - 2020-03-18T10:06:47+05:30 IST

జిల్లాను కరోనా వైరస్‌ వీడలేదు. తాజాగా మరో అనుమానితుడు ఐసోలేషన్‌ వార్డుకు వచ్చాడు. నెల్లూరుకు చెందిన బ్యాంకు ఉద్యోగి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో మేనేజర్‌గా

ఐసోలేషన్‌కు మరో కరోనా అనుమానితుడు

కొడవలూరు వ్యక్తి నెగిటివ్‌ రిపోర్టు 

ఐసోలేషన్‌ సిబ్బందిపై అధికారి అసంతృప్తి


నెల్లూరు (వైద్యం)మార్చి 17 : జిల్లాను కరోనా వైరస్‌ వీడలేదు. తాజాగా మరో అనుమానితుడు ఐసోలేషన్‌ వార్డుకు వచ్చాడు. నెల్లూరుకు చెందిన బ్యాంకు ఉద్యోగి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లే ఆ ఉద్యోగి రెండురోజులుగా ఒళ్లు నొప్పులు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. కరోనా లక్షణాలేమోనని నెల్లూరు జనరల్‌ ఆసుపత్రికి వచ్చాడు. అనుమానించిన వైద్యులు ఆ ఉద్యోగిని ఐసోలేషన్‌ వార్డుకు సోమవారం తరలించారు.


వ్యాధి నిర్థారణ కోసం నమూనాలను తిరుపతి స్విమ్స్‌కు పంపించారు. అయితే కొడవలూరుకు చెందిన వ్యక్తికి సంబంధించి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. .ప్రస్తుతం ఐదుగురు ఐసోలేషన్‌ వార్డులో ఉన్నారు. మంగళవారం జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డును ఆకస్మికంగా తలిఖీ చేసిన వైద్యశాఖ రాష్ట్ర పోగ్రాం అధికారి డాక్టర్‌ సుభాషిణి వైద్యులు, సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సకాలంలో వార్డులో లేక పోవటంపై ఆమె వారిని ప్రశ్నించారన్నది సమాచారం. సిబ్బంది సమయపాలన పాటించాలని హెచ్చరించారు. 


ప్రత్యేక పారిశుధ్య చర్యలు

జీజీహెచ్‌ ఐసోలేషన్‌ వార్డులో ప్రత్యేక పారిశధ్య చర్యలు చేపడుతున్నారు. బాడీ మాస్క్‌లు ధరించి ప్రతిరోజూ మూడుపూటలా వార్డును పరిశుభ్రం చేస్తున్నారు. పారిశుధ్య బృందం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేస్తోంది. పడకలు, ఇతర వైద్య పరికరాలు ఈ ద్రావకంతో శుద్ధి చేస్తున్నారు. వార్డు భవనం చుట్టూ కూడా పారిశుధ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన ఇటలీ యువకుడి తల్లిదండ్రులు ఇంటికి చేరటంతో కష్టాలు మొదలయ్యాయి. పాలు, కూరగాయల వారు ఆ ఇల్లున్న వీధికి వెళ్లెందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపఽథ్యంలో తమకు ఆహారం ఎలాగని వైద్యుల ఎదుట ఆ కుటుంబం విలపించింది. దీన్ని గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు యువకుడి తల్లిదండ్రులకు ఆహారాన్ని తీసుకువెళ్లి ఇస్తున్నారని తెలిసింది.


లండన్‌ ఉద్యోగి ఇంటికే పరిమితం

వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగి లండన్‌ నుంచి నెల్లూరువచ్చి వైద్యుల పర్య వేక్షణలో 14 రోజులు ఉండాల్సి ఉన్నా నేరుగా జిల్లా కార్యాలయానికి వచ్చాడు. ఈ విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలకు వైద్యాధికారులు స్పందించారు. ఆ ఉద్యోగిని ఇంటికే పరిమితం చేసి వైద్యుల పర్య వేక్షణలో 14 రోజులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడకు వెళ్ల వద్దని ఆదేశించారు. 

Updated Date - 2020-03-18T10:06:47+05:30 IST