మరో గొలుసు కట్టు కథ!
ABN , First Publish Date - 2020-10-08T09:24:37+05:30 IST
మనీ స్కీం.. గుర్తుందిగా! ఈ గొలుసుకట్టు వ్యాపారం ఎంత ఆదరణ పొందిందో.. అదేస్థాయిలో ఎందరినో నిలువునా ముంచేసింది. ‘‘

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ స్కెచ్
‘వెల్ పే’ పేరుతో మార్కెట్లోకి..
రూ.10 వేలు డిపాజిట్‌కు 20వేలు ఇస్తామని హామీ
ఏజెంట్లు, సబ్ ఏజెంట్ల ద్వారా ప్రజలకు వల
ఏడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.85 కోట్ల వసూలు
అందిన ఫిర్యాదుతో కూపీ లాగిన పోలీసులు
ముగ్గురు కంపెనీ నిర్వాహకుల అరెస్టు
రూ.1.29 కోట్ల నగదు, రెండు కార్ల స్వాధీనం
నెల్లూరు (క్రైం) అక్టోబరు 7 : మనీ స్కీం.. గుర్తుందిగా! ఈ గొలుసుకట్టు వ్యాపారం ఎంత ఆదరణ పొందిందో.. అదేస్థాయిలో ఎందరినో నిలువునా ముంచేసింది. ‘‘మాకు నగదు చెల్లించండి. వాయిదాల పద్ధతిలో మీరు చెల్లించిన నగదుకు రెట్టింపు ఇస్తాం’’ ఈ నినాదమే అప్పట్లో మనీస్కీంకు పెట్టుబడి. ఈ మాయలో పడి ఎంతోమంది పేద, మధ్య తరగతి ప్రజలు మోసపోయారు. తాము కట్టిన నగదు తిరిగొస్తుందా!? అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. ఇదేతరహాలో మరో ముఠా స్కాంకు తెరలేపింది.
ఓ పక్క కరోనా విజృంభిస్తున్నా ఇదేమీ లెక్కచేయని ముఠా సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయలు వసూలు చేసి, చివరకు పోలీసులకు చిక్కారు. బుధవారం నెల్లూరులోని ఉమే్‌షచంద్ర సమావేశ మందిరంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఈ ముఠా గురించి విలేకరులకు వివరించారు.
వాకాడు ప్రాంతానికి చెందిన యర్రగొల్ల మైఖెల్ సుమన్ ప్రస్తుతం నెల్లూరులోని వేదాయపాలెంలోని ఓ అపార్ట్‌మెంటులో ఉంటున్నాడు. కర్నూలు జిల్లా నంద్యాల లోని వైఎస్సార్ నగర్‌కు చెందిన ఎటూరి రవికుమార్, కర్నూలులోని చంద్రశేఖర్ నగర్‌కు చెందిన దండగల యల్లా శ్రీనులు మార్కెటింగ్ ఏజెంట్లు కావడంతో సుమన్ వారిని కలుపుకొని ఈ ఏడాది ఫిబ్రవరిలో నెల్లూరులోని రిత్విక్ ఎన్‌క్లేవ్‌లో వెల్‌పే ట్రేడర్స్ కంపెనీ స్థాపించారు.
దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను నెల్లూరు జిల్లాకు చెందిన ఐ3 సొల్యూషన్స్ వద్ద కొనుగోలు చేశారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నామని, అతి తక్కువ కాలంలో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఇస్తామంటూ కొంతమంది మార్కెటింగ్ ఏజెంట్లను చేర్చుకొని వ్యాపారాన్ని ప్రారంభించారు.
రూ.పది వేలకు 20 వేలు ఇస్తాం
ఈ వ్యాపారం మొత్తం మాటలపైనే సాగుతుంది. వెల్‌పే ట్రేడింగ్ కంపెనీలో రూ.10వేలు డిపాజిట్ చేసిన ఖాతాదారుడికి ఓ గుర్తింపు కార్డు ఇస్తారు. డిపాజిట్ చేసిన మరుసటి రోజు నుంచి ఆ ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్‌కు రూ.200 జమ చేస్తారు. ఇలా 100 పని దినాల్లో పెట్టుబడి కంటే రెండు రెట్లు అంటే రూ.20వేలు చెల్లిస్తామని నమ్మబలుకుతారు.
ఖాతాదారులను చేర్పించిన ప్రధాన ఏజెంట్‌కు ఒక్కో డిపాజిట్‌కు 0.5 శాతం, సబ్ ఏజెంటుకు 0.25 శాతం కమీషన్ ఇస్తామని సంస్థ నిర్వాహకులు చెబుతారు. ఒక్కో ఖాతాదారుడిని చేర్పించిన ఏజెంట్లు, సబ్ ఏజెంట్లకు కమీషన్ రేపేణా రూ.7500 చెల్లిస్తారు. అంతేగాక వారానికి ఒకసారి మెయిన్ ఏజెంట్‌కు వారి బిజినెస్‌ను బట్టి స్పెషల్ కమీషన్ కింద 5 నుంచి 10 శాతం కమీషన్ ఇస్తామని ప్రకటించారు.
పోలీసుల వద్దకు చేరిన విషయం
వెల్‌పే ట్రేడింగ్ వ్యాపార విషయం ఆనోటా ఈనోటా నాని చివరకు పోలీసుల వద్దకు వెళ్లింది. ఈ కంపెనీలో పలువురు పోలీసు సిబ్బంది సైతం డిపాజిట్‌లు చెల్లించారని తెలుస్తోంది. అయితే ఈ నెల 2వ తేదీ కొందరు ఈ వ్యవహారంపై దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరమ్మ కేసు నమోదు చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరమ్మ, తన సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ కేసును దర్యాప్తు చేపట్టి ముద్దాయిలను బుజబుజనెల్లూరు ప్రాంతంలో బుధవారం సుమన్, శ్రీను, రవికుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.
వెల్‌పే ట్రేడింగ్ కంపెనీ యజమాని మైఖెల్ సుమన్ ట్రేడింగ్ వ్యాపారం చేయడానికి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టలేదని, అంతేగాక ఎస్‌ఈబీఐ నుంచి, ఆర్‌బీఐ నుంచి ఏ విధమైన అనుమతులు లేవని పోలీసులు విచారణలో తేల్చారు. ప్రజలకు ఆశ చూపి మనీ సర్క్యూలేషన్ స్కీమును ఆన్‌లైన్‌లో డిజైన్ చేసి ఇప్పటి వరకు దాదాపు 12,600 మంది కష్టమర్లు రూ.84 కోట్లకుపైగా డిపాజిట్ చేశారని ఎస్పీ భాస్కర్‌భూషన్ తెలిపారు. ప్రజలందరూ ఇటువంటి స్కీమ్‌ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, వెల్‌పే ట్రేడర్స్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ ఆన్‌లో జరిగాయి కనుక డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని తెలిపారు.
రూ.1.29 కోట్ల నగదు స్వాధీనం
వెల్‌పే కంపెనీ నిర్వాహకుల నుంచి పోలీసులు రూ.1.29 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 5 ల్యాప్‌టా్‌పలు, సుమన్‌బాబు పేరుపై ఉన్న రెండు కార్లు, 5 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరమ్మ, ఎస్‌ఐలు జగత్ సింగ్, డీఎస్ విజయ్‌కుమార్, ఏఎ్‌సఐ బుజ్జయ్య, హెడ్‌కానిస్టేబుళ్లు ఎస్ ప్రసాద్, పి పోలయ్య, కానిస్టేబుళ్లు యం మహేంద్రనాద్‌రెడ్డి, సైబర్ కానిస్టేబుల్ శ్రీరామ్, బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ తిరుపతి, ఏఆర్ డ్రైవర్లు ఎస్‌కె బాషా, శేఖర్‌లను ఎస్పీ అభినందించారు. కాగా, ఈ కేసు పూర్తి దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.