కాలువల్లో నీటి పారుదలకు చర్యలు చేపట్టండి

ABN , First Publish Date - 2020-11-26T03:49:25+05:30 IST

నగరంలోని లోతట్టు ప్రాంతాలైన మన్సూర్‌నగర్‌, వాహబ్‌పేట, బర్మాషెల్‌గుంట ప్రాంతాల్లో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బుధవారం పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.

కాలువల్లో నీటి పారుదలకు చర్యలు చేపట్టండి
నగరంలో పర్యటిస్తున్న మంత్రి అనిల్‌

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అనిల్‌

నెల్లూరు(జడ్పీ), నవంబరు 25 : నగరంలోని లోతట్టు ప్రాంతాలైన మన్సూర్‌నగర్‌, వాహబ్‌పేట, బర్మాషెల్‌గుంట ప్రాంతాల్లో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బుధవారం పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. గత సంఘటనలు దృష్టిలో ఉంచుకుని భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండేందుకు వర్షపు నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా కాలువల్లో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పూడిక తీయడంతోపాటు కచ్చాకాలువలు తీసి నీటి తరలింపునకు చర్యలు చేపట్టాలన్నారు. అధికార యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావం నెల్లూరుపై మరో రెండురోజులపాటు ఉండే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. నీటి తరలింపు పనులకు అవసరమైన ఎక్స్‌కవేటర్లు, ఇతర వాహనాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే రూరల్‌ నియోజకవర్గంలోని నగర ప్రాంతంలో రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, కమిషనర్‌ దినే్‌షకుమార్‌ పర్యటించారు. రూరల్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని శానిటేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. అవసరమైన అన్ని చోట్ల కాలువలు కచ్చాకాలవల్లో పూడికలు తీయించి నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు.

అధికారులు సిద్ధంగా ఉండాలి

నివర్‌ తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కోడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి పీ.అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. డీఈవోసీ నుంచి కలెక్టర్‌ చక్రధర్‌బాబుతో కలిసి ఆయన అధికారులతో నివర్‌పై బుధవారం సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ సహాయక చర్యలు బాగా తీసుకొంటున్న కలెక్టర్‌, ఉన్నతాధికారులను అభినందించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు 70 శాతం నిండి ఉన్నాయని, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా చెరువు కట్టలు దెబ్బతిని ఉంటే వాటికి తక్షణం మరమ్మతులు చేయించాలన్నారు. 2015 వరదల సమయంలో ప్రభావితం అయిన గూడూరు, నాయుడుపేట, నెల్లూరు డివిజన్‌లలోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 100 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది జిల్లాకు చేరుకున్నారని తెలిపారు. వారిని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నియమించామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు మంత్రికి తెలిపారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని సూచించామని, 3,650 చేపల బోట్లు తీరానికి చేరుకున్నాయని తెలిపారు. ప్రతి మండలం, డివిజన్‌ ప్రధాన కేంద్రాలలో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పాలప్యాకెట్లు సరఫరా చేయిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.Read more