అల్లోపతిలో ఆయుష్‌ వైద్యులకు అనుమతి వద్దు

ABN , First Publish Date - 2020-12-28T05:02:05+05:30 IST

అల్లోపతి వైద్యంలో ఆయుష్‌ వైద్యులకు కేంద్రం అనుమతి ఇవ్వటం సరికాదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌తోపాటు పలుసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.

అల్లోపతిలో ఆయుష్‌ వైద్యులకు అనుమతి వద్దు
సమావేశంలో వివిధ సంఘాల నేతలు

ఐఎంఏ నాయకులు


నెల్లూరు (వైద్యం)డిసెంబర్‌ 27 : అల్లోపతి వైద్యంలో ఆయుష్‌ వైద్యులకు కేంద్రం అనుమతి ఇవ్వటం సరికాదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌తోపాటు పలుసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.  కేంద్రం విధానాలను నిరసిస్తూ నెల్లూరులోని ఐఎంఏ హాలులో ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ ఎంపీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ ఎంబీబీఎస్‌, పీజీ, స్పెషలైజేషన్‌ చేసి అన్నిరకాలుగా శిక్షణ పొందిన వైద్యులు మాత్రమే అల్లోపతి వైద్యం, శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు భిన్నంగా ఆయుర్వేదం, యునానీ, హోమియో, సిద్ధ వైద్యులు అల్లోపతి వైద్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వటం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. ఐఎంఏ రాష్ట్ర నేతలు డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ శ్రీనివాసతేజ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంలో శస్త్రచికిత్సలు, ఇంగ్లీషు మందులు ఉండవన్నారు. అలాంటి వారు అల్లోపతి వైద్యం చేయడానికి అనుమతివ్వటం తగదన్నారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎంవీ రమణయ్య, ప్రధానోపాధ్యాయుల సంఘం నేత చలపతి, జనవిజ్ఞాన వేదిక జిల్లా నేత డాక్టర్‌ శ్రీనివాస నాయక్‌ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తే రోగుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు.  

Updated Date - 2020-12-28T05:02:05+05:30 IST