అందరూ ఇళ్లలోనే!

ABN , First Publish Date - 2020-03-23T10:05:03+05:30 IST

జిల్లావాసులు మరోసారి ఉద్యమ స్ఫూర్తిని చూపారు. స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో

అందరూ ఇళ్లలోనే!

జనతా కర్ఫ్యూ విజయవంతం

నిర్మానుష్యంగా రద్దీ ప్రాంతాలు


నెల్లూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లావాసులు మరోసారి ఉద్యమ స్ఫూర్తిని చూపారు. స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. కరోనా వైరస్‌ నిర్మూలనే లక్ష్యంగా క్రమశిక్షణతో అందరూ కూడబలుక్కున్నట్లు ఉదయం 7 నుంచి రాత్రి 9గంటల వరకు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉదయం 3.30 నుంచి 6.30 గంటల వరకు నెల్లూరు నగరం, కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట ఉదయగిరి, తదితర ప్రాంతాల్లో రద్దీగా కనిపించిన మార్కెట్లు 7 గంటలయ్యే సరికి ఎవరో మాయ చేసినట్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. రకరకాల కొట్లు వాటంతట అవే మూతపడ్డాయి. నిరంతరం చక్రాల రాపిడితో అల్లాడిపోయే రహదారులు రాపిడికి దూరంగా 14 గంటలపాటు హాయిగా విశ్రాంతి తీసుకున్నాయి. పల్లెలు, పట్టణాల ప్రజలు పనికి దూరంగా కుటుంబ సభ్యులకు దగ్గరగా గడిపారు. తెల్లారకముందే బండెడు చాకిరీకి సిద్ధమయ్యే పశుగణం సైతం పాకలకే పరిమితమై హాయిగా నెమరువేసుకున్నాయి. 


నెల్లూరు నగరంలో మెడికల్‌షాపులతో సహా అన్నీ మూతపడ్డాయి. నిత్యం రద్దీగా ఉంటే ఆత్మకూరుబస్టాండు, కనకమహల్‌ సెంటర్‌, ట్రంకురోడ్డు, స్టోన్‌ హౌస్‌ పేట, ఏఆర్‌సీ సెంటర్‌, ఆర్టీసీ కూడలి, కేవీఆర్‌ పెట్రోల్‌ బంకు, కరెంట్‌ ఆఫీసు సెంటర్‌, వేదాయపాళ్యం, అయ్యప్పగుడి సెంటర్‌, బి.వి.నగర్‌, వనంతోపు, అన్నమయ్య సర్కిల్‌, బాలాజీ నగర్‌ తదితర ప్రాంతాలు సైతం నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు ఇళ్లు దాటి బయటకు రాలేదు. ప్రతి కూడలి వద్ద పోలీసులు పహారా ఉన్నారు. రైడ్డుపైకి వచ్చిన వారిని మర్యాదపూర్వకంగా వెనక్కు పంపారు. 


ఆత్మకూరులో ఆర్డీవో ఉమాదేవి, మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసు అధికారులు మీరు ఇళ్లలో ఉండండి.. మేము బయట ఉంటాం అని రాసిన ప్లేకార్డులు ధరించి రోడ్లపై తిరుగాడారు. 


గూడూరు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతిపల్లెలో జనతా కర్ఫ్యూ వంద శాతం విజయవంతం కావడం విశేషం. గూడూరు డివిజన్‌ పరిధిలో పశువులను కూడా పాకల్లోనే కట్టేసిపెట్టారు. సాయంత్రం ఐదు గంటలకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, అధికారులు వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-03-23T10:05:03+05:30 IST