-
-
Home » Andhra Pradesh » Nellore » alaret
-
భారీ వర్షాలతో విద్యుత్‌శాఖ అప్రమత్తం
ABN , First Publish Date - 2020-11-26T03:59:03+05:30 IST
భారీ వర్షాల కారణంగా సంభవించే అవాంతరాలను ఎదుర్కొనేందుకు విద్యుత్‌శాఖాధికారులు అప్రమత్తమయ్యారు.

అవాంతరాలు ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు
ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, పరికరాలు సిద్ధం
సిబ్బందికి సెలవులు రద్దు
అన్ని డివిజన్‌లలో కాల్ సెంటర్లు
నెల్లూరు(జడ్పీ), నవంబరు 25 : భారీ వర్షాల కారణంగా సంభవించే అవాంతరాలను ఎదుర్కొనేందుకు విద్యుత్‌శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. నివార్ తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉంటుందన్న సమాచారంతో జిల్లా వ్యాప్తంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ప్రతి డివిజన్ కేంద్రంలో అధికారులు 24 గంటలు పనిచేసేలా చర్యలు చేపట్టారు. విద్యుత్ భవన్‌తోపాటు అన్ని డివిజన్ కేంద్రాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి సబ్‌స్టేషన్‌లో 5 మంది సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన చోట విద్యుత్ పనులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా 150 మందితో 15 బృందాలను ఏర్పాటు చేశారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి 8 బృందాలను జిల్లాకు రప్పించారు. ఈదురు గాలులు పెరిగి నష్టాలు సంభవిస్తే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వీలైనంత త్వరగా విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు 500 స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు, ఇతర పరికరాలను సిద్ధం చేసినట్లు ఎస్‌ఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అలాగే తుఫాన్ ప్రభావం ఎక్కువగా గూడూరు, నాయుడుపేట, డివిజన్లపైన ఉండే అవకాశం ఉన్నందున ఆ డివిజన్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని ఆయన తెలిపారు.