కరోనా, నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో.. ఆక్వాకు రూ.కోట్లలో నష్టం

ABN , First Publish Date - 2020-12-16T03:47:55+05:30 IST

కరోనా, నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో చేపలు, రొయ్యల సాగు చేసిన రైతులు రూ.కోట్లలో నష్టపోయారు.

కరోనా, నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో.. ఆక్వాకు రూ.కోట్లలో నష్టం
వరదతో తెగిపోయిన చేపల చెరువు కట్టలు (ఫైల్‌)

సంగం, డిసెంబరు 15 : కరోనా, నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో చేపలు, రొయ్యల సాగు చేసిన రైతులు రూ.కోట్లలో నష్టపోయారు. జిల్లాలో వరి తరువాత ఎక్కువగా సాగు చేస్తున్న ఆక్వాకు ఈ ఏడాది దెబ్బ మీద దెబ్బ తగిలింది. మొన్నటివరకు కరోనా కారణంగా ఎగుమతులు లేక ధరలు పతనమయ్యాయి. ఖర్చులు కూడా రాలేదు. కరోనా తగ్గడంతో ఈసారైనా ఆదాయాలు గడించవచ్చునని ఆశతో ఉన్న రైతులకు నివర్‌ తుఫాన్‌ నిండా ముంచేసింది. భారీ వర్షాలతో చెరువులన్నీ ముంపునకు గురై వేల ఎకరాల్లో చేపలు కొట్టుకుపోయాయి. ఒక్క సంగం మండలంలోనే సుమారు 400 ఎకరాల చేపల చెరువుల దెబ్బతిన్నాయి. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు ఐదు వేల ఎకరాలకుపైగా దెబ్బతింది. ఒక్కో సాగుదారు రూ.లక్షల్లో నష్టపోయారు. 


నష్ట పరిహారంపైనే ఆశలు

దెబ్బ మీద దెబ్బ తగిలి తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అధికారులతో సర్వే  చేయిస్తోంది. రెండు రోజుల్లో రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు అందనున్నాయి. నెలాఖరులోనే పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరిహారంపైనే జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన చిన్న చిన్న రైతులు ఎదురుచూస్తున్నారు.  

Read more