ఆగని అక్రమ రవాణా
ABN , First Publish Date - 2020-12-21T04:42:31+05:30 IST
పులికాట్ సరస్సులో మత్స్యసంపదకు జీవనాధారమైన వానపాములను పెద్ద ఎత్తున ఏరివేస్తున్నారు.

యథేచ్ఛగా వానపాముల తరలింపు
రోజుకు వందలాది కిలోల విక్రయం
మామూళ్ల మత్తులో అధికారులు
తడ, డిసెంబరు 20 : పులికాట్ సరస్సులో మత్స్యసంపదకు జీవనాధారమైన వానపాములను పెద్ద ఎత్తున ఏరివేస్తున్నారు. యథేచ్ఛగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో ఓ వైపు మత్స్యసంపద దొరకని పరిస్థితి ఏర్పడుతుండగా, మరో వైపు పులికాట్ పూడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
మత్స్య సంపద వృద్ధికి..
పులికాట్ సరస్సులో మత్స్యసంపద వృద్ధికి ప్రధానమైనవి వానపాములు, సాధారణ వానపాములకన్నా పులికాట్ సరస్సులో వానపాములు సుమారు అరమీటరు పొడవు వరకు ఉంటాయి. సరస్సులోని బురదమట్టిలో ఈ వానపాములు ఉంటూ చేపల గుడ్లకు ఆక్సిజన్ అందేందుకు ఉపయోగపడతాయి. వాటిపై అక్రమార్కుల కన్నుపడింది. దీంతో వీటిని ఏరివేసేందుకు వందలసంఖ్యలో కూలీలు వినియోగిస్తున్నారు.
హేచరీలకు సరఫరా..
రాష్ట్రంలోని తీరప్రాంతంలో చాలావరకు చేపలు, రొయ్యలను ఎక్కువుగా సాగుచేస్తుంటారు. అందులో రొయ్య ల గుంటలకు ఇక్కడ వానపాములను వినియోగిస్తుంటారు. దీంతో పులికాట్ సరస్సులోని వానపాములకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇరకం, వేనాడు, వాటంబేడు, తడ, తదితర గ్రామాల్లో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సులో వానపాములను ఏరివేసేందుకు పెద్ద ఎత్తున కూలీలను వినియోగిస్తున్నారు. వీరి నుంచి కేజీని రూ. 300 నుంచి రూ. 450లకు స్మగ్లర్లు కొనుగోలు చేస్తున్నారు. వీటిని సేకరిం చేందుకు కొన్ని గ్రామాల్లో ఈ స్మగ్లర్లు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. ముందుగానే సదరు కూలీలకు అడ్వాన్స్ రూపంలో సొమ్ము చెల్లించి వాటి ఏరివేతకు ప్రోత్సహి స్తున్నారు. ఇక్కడ సేకరించిన వానపాములను తడ, సూళ్లూ రుపేటలకు చెందిన స్మగ్లర్లు నెల్లూరు, ప్రకాశం, కృష్ణాజిల్లా వరకు కార్లల్లో, బస్సుల్లో ప్రత్యేకంగా భద్రపరచి తరలిస్తుంటారు. అక్కడ వాటిని కేజీ రూ.4వేల నుంచి రూ. 5వేలకు అమ్మి లక్షలు గడిస్తున్నారు. ఇలా వానపాములను ఏరివేసేందుకు ఒక్క తడ మండలంలోని గ్రామాల్లో సుమారు 300 మంది వరకు కూలీలు పనిచేస్తున్నారు. వేనాడులో అయితే ఏకంగా ఇందుకోసం ప్రత్యేకంగా రెండు పడవలను సైతం కొనుగోలు చేయడం విశేషం. స్మగ్లర్లకు అధికార, ప్రతిపక్ష నేతల అండదండలతో పాటు కొంతమం ది నేతలు అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా పాలుపంచుకుం టున్నారు.
మామూళ్ల మత్తులో అధికారులు
పులికాట్ సరస్సు వన్యప్రాణి విభాగం అధికారుల సంరక్షణలో ఉంది. వానపాముల ఏరివేతలో సదరు అధికా రుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల మామూళ్లతోపాటు వీరికి ఒక రోజుకు ఒక పడవ నుంచి రూ.1500ల వరకు మామూళ్ల రూపం లో అందుతున్నట్లుగా సమాచారం. దీంతో వారు పట్టీపట్టన ట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మత్స్యకార నాయకులు గత శుక్రవారం ప్రత్యేక పడవల్లో వేనాడు దీవి సమీపంలో వానపాములను ఏరివేస్తున్న కూలీలను ఇద్దరిని పట్టుకొని వన్యప్రాణి విభాగం అధికారులకు అప్పగించిన విషయం విధితమే. ఇలా అధికారులు అడ్డుకోవాల్సింది పోయి మత్స్యకార నాయకులే అడ్డుకోవడం చూస్తుంటే అధికారుల మామూళ్లు ఏ తరహాలో ఉన్నాయో అర్థం అవుతుంది.