పూర్తిగా కోలుకున్న ఇటలీ యువకుడు

ABN , First Publish Date - 2020-03-24T07:26:51+05:30 IST

కరోనా వైరస్‌ పాజిటివ్‌ యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. రాష్ట్రంలోనే తొలి పాజిటివ్‌ కేసుగా నమోదైన

పూర్తిగా కోలుకున్న ఇటలీ యువకుడు

నెగిటివ్‌ రావటంతో డిశ్చార్జి

మరో ముగ్గురికి ఇల్లే క్వారంటైన్‌ 


నెల్లూరు (వైద్యం), మార్చి 23 : కరోనా వైరస్‌ పాజిటివ్‌ యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. రాష్ట్రంలోనే తొలి పాజిటివ్‌ కేసుగా నమోదైన నెల్లూరుకు చెందిన, ఇటలీ నుంచి వచ్చిన యువకుడు కోలుకోవటంతో వైద్యధికారులు సోమవారం అతడిని ఇంటికి పంపించారు. కలెక్టర్‌ శేషగిరిబాబు రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీన ఇటలీ నుంచి వచ్చిన ఈ యువకుడు 9వ తేదీన కరోనా లక్షణాలతో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రావడంతో ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. స్వాబ్‌ తీసి తిరుపతి స్విమ్స్‌కు పంపించగా పాజిటివ్‌ వచ్చింది. మరింత నిర్ధారణకోసం పూనే వైరాలజీ ల్యాబ్‌కు పంపించగా అక్కడ కూడా పాజిటివ్‌ రావటంతో అతన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందించారు.


ఈ నేపథ్యంలో 14 రోజులు పూర్తి కావటంతో ఈ నెల 21వ తేదీన మళ్లీ స్వాబ్‌ తీసి తిరుపతికి పంపించారు. ఈ ఫలితాల్లో  పూర్తిగా నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో వైద్యాధికారులు సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని యువకుడి ఇంటికి పంపించారు. ఇంటి క్వారంటైన్‌లోను 14 రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని అధికారులు అతడికి సూచించారు.  మరో ముగ్గురిని కూడా వైద్యాధికారులు ఇంటికి పంపించారు. 9వ తేదీన ఇటలీ పాజిటివ్‌ యువకునితో పాటు ఇంకో యువకుడు కూడా ఇటలీ నుంచే వచ్చాడు. అయితే రిపోర్టులో అతనికి నెగిటివ్‌ వచ్చింది.


అతను ఇప్పటి వరకు ఐసోలేషషన్‌లోనే ఉన్నాడు. వారం రోజులు కిందట ఇటలీ పాజిటివ్‌ యువకుడికి షేవింగ్‌ చేసిన బార్బకు నెగిటివ్‌  రిపోర్డు వచ్చింది. ఇతనితో పాటు కొడవలూరు గమేషా కంపెనీకి చెందిన వ్యక్తికి కూడా నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన నేపఽథ్యంలో వీరినికూడా ఇంటికి పంపించారు. 14 రోజుల పాటు ఇంటిలోనే వైద్యులు పర్యవేక్షణలో ఉండాలని అధికారులు వారిని ఆదేశించారు.  ప్రస్తుతం జీజీహెచ్‌ ఐసోలేషన్‌లో ఐదుగురు మిగిలారు. వీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 

Read more