కరోనా.. విజృంభణ

ABN , First Publish Date - 2020-06-25T10:38:48+05:30 IST

కరోనా మహమ్మారి జిల్లాను కుదిపేస్తోంది. బుధవారం 36 కేసులు నమోదై మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 623 కి చేరుకుంది.

కరోనా.. విజృంభణ

623కి చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య

బుధవారం 36 కేసుల నమోదు

వారం వ్యవధిలోనే 112

అమలుకాని ‘కంటైన్మెంట్‌’ నిబంధనలు

భారీగా వీధుల్లోకి వచ్చేస్తున్న జనం

 ఇలాగైతే కట్టడి కష్టమే!


నెల్లూరు (వైద్యం) జూన్‌ 24 : కరోనా మహమ్మారి జిల్లాను కుదిపేస్తోంది. బుధవారం 36 కేసులు నమోదై మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 623 కి చేరుకుంది. కేవలం 7 రోజుల వ్యవధిలోనే 112 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో తగిన జాగ్రత్తలు పాటించని ఎంతో మంది కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 42 మండలాల్లో వైరస్‌ ప్రభావం ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఢిల్లీ మర్కజ్‌ ప్రభావం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎక్కువగా ఉండగా మే నెల నుంచి చెన్నై కోయంబేడు మార్కెట్‌ ప్రభావం కనిపించింది.


మార్చి నెల 9వ తేదీన జిల్లాలో మొదటి పాజిటివ్‌ కేసు నమోదయింది. మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు 56 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మే నెల 9వ తేదీ నాటికి జిల్లాలో 100 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ నుంచి కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో 200 కేసులు దాటింది. మే 21వ తేదీ నాటికి 201, జూన్‌ 6వ తేదీ నాటికి 15 రోజుల వ్యవధిలో 300 కేసులు నమోదయ్యాయి. కేవలం 7 రోజుల్లోనే మరో 100 కేసులకుపైగా నమాదై 407కి చేరుకుంది.  ఇదే ఉధృతితో ఏకంగా 600 కేసులను దాటి వేయడం గమనార్హం. 


నిబంధనల ఉల్లంఘన

అధిక కేసులు నమోదవుతున్న కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలు పాటించకపోవడంతోనే కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ వాస్తవంగా ఈ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలు జరపకూడదు. దుకాణాలు మూసివేయాలి. అత్యవసరమైతే తప్ప స్థానికులు బయటకు రాకూడదు. ఇలాంటి వాటిని పాటించకపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది.  


తాజాగా 36 కేసుల నమోదు..

జిల్లాలో బుధవారం 36 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు నగరంలోనే అత్యధికంగా 14 కేసులు రికార్డుకెక్కాయి. మూలాపేటలో 9, నవాబుపేటలో 1, సంతపేటలో 3, కోటమిట్టలో 1, గూడూరులో 9, కోటలో 1, కావలిలో 1, టీపీ గూడూరు మండలం మండపంలో 2, కోవూరు మండలం లేగుంటపాడులో 2, ఆత్మకూరులో 1, సిద్ధన కండ్రిగలో 1, వాకాడులో 1, కొడవలూరులో 2, అనంతపురంలో 1, వెంకటగిరి మండలం జీకె పల్లిలో 1 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


18 మంది డిశ్చార్జి

కరోనాతో బాధపడుతూ జీజీహెచ్‌, నారాయణ ఆసుపత్రుల్లో కోలుకుని 18 మంది బుధవారం డిశ్చార్జి అయ్యారు. నారాయణ ఆసుపత్రి నుంచి వింజమూరు-2, ఏఎస్‌పేట-1, నెల్లూరు నగరం-4, సర్వేపల్లి-1, కోవూరు-1, ఆత్మకూరు-2, బంగోలు-1, గుంటూరు-3, తిరుపతి-1, బీహార్‌-1, పొదలకూరు 1   డిశ్చార్జి అయ్యారు.


వణికిపోతున్న గూడూరు

గూడూరు పట్టణంలో బుధవారం ఒక్కరోజే 9 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో అందరిలో ఆందోళన రేగుతోంది. ఈ నెల 17న బనిగీసాహెబ్‌పేటకు చెందిన ఓ యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అతనితో సంబంధాలున్న సుమారు 50 మందిని  క్వారంటైన్‌కు తరలించి, పరీక్షలు నిర్వహించారు. 20న జనార్దన్‌రెడ్డికాలనీలో ఒకరికి, బుధవారం అరుంధతీయపాళెంలో ఏడుగురి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 18న జానకిరాంపేటకు చెందిన ఓ వ్యక్తి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అతడి ప్రైమరీ కాంటాక్టు కింద బుధవారం మరో వ్యక్తికి, వీరారెడ్డిపల్లిలో ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో పట్టణంలో ఒకే రోజు 9 కేసులు నమోదయ్యాయి. క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటున్న మరికొంత మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సివుంది. ఇప్పటి వరకు గూడూరులో 16 కేసులు నమోదయ్యాయి.


కలువాయిలో కరోనా కలకలం

ముదిరాజ్‌పాళెంలోని ఓ కుటుంబంలోని తల్లీకొడుక్కి కరోనా సోకినట్లు డాక్టర్‌ సురేంద్రబాబు ప్రకటించారు. వీరిద్దరినీ నెల్లూరుకు తరలించి, కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. 


Updated Date - 2020-06-25T10:38:48+05:30 IST