మూడుతో ముగింపు!

ABN , First Publish Date - 2020-12-31T05:11:57+05:30 IST

‘‘2020లో 12 నుండి 15 రాకెట్లను ప్రయోగిస్తాం.. ప్రతిష్ఠాత్మకమైన గగనయాన్‌ ప్రయోగానికి రిహార్సల్స్‌గా మానవ రహిత ప్రయోగాలు నిర్వహిస్తాం..’’ గత ఏడాది చివరిలో ఇస్రో సారథి కె.శివన్‌ ప్రకటించారు.

మూడుతో ముగింపు!
ఈ నెల 17న షార్‌ నుంచి రోదసిలోకి దూసుకువెళుతున్న పీఎ్‌సఎల్వీ-సీ50

రాకెట్‌ ప్రయోగాలకూ కొవిడ్‌ బ్రేక్‌ 


శ్రీహరికోట, (సూళ్లూరుపేట) డిసెంబరు 30 : ‘‘2020లో 12 నుండి 15 రాకెట్లను ప్రయోగిస్తాం.. ప్రతిష్ఠాత్మకమైన గగనయాన్‌ ప్రయోగానికి రిహార్సల్స్‌గా మానవ రహిత ప్రయోగాలు నిర్వహిస్తాం..’’ గత ఏడాది చివరిలో ఇస్రో  సారథి కె.శివన్‌ ప్రకటించారు. కానీ, ఇస్రో సంకల్పాన్ని కొవిడ్‌-19 నీరుగార్చేసింది.  కేవలం 3 ప్రయోగాలతో ఇస్రో 2020 ముగిసిపోయేలా చేసింది. వీటిలో ఒకటి దేశంలో కరోనాకు ముందు జనవరి 17న ప్రెంచ్‌ గయానా నుంచి జరగడం గమనార్హం. ఆ దేశపు ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా మనదేశ ఇంటర్నెట్‌ బలోపేతం కోసం ఇస్రో జీశాట్‌-30ని కక్ష్యలోకి ప్రవేశపెట్టించుకుంది .

అనంతరం మార్చి 5వ తేదీ శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌10 రాకెట్‌ ద్వారా గీశాట్‌-1 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైనా కౌంట్‌డౌన్‌ ప్రారంభించాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆ ప్రయోగం నిలిచిపోయింది. 

 

2 నెలల్లో రెండు...

తదుపరి కరోనాతో ఇస్రో కార్యకలాపాలన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. చివరికి తేరుకొని నవంబరు 7వ తేదీ షార్‌ నుంచి పీఎ్‌సఎల్వీ-సీ49 రాకెట్‌ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్‌-01ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీంతోపాటు మరో 9 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేశారు. తదుపరి డిసెంబరు 17వ తేదీ పీఎ్‌సఎల్వీ-సీ50 రాకెట్‌ ద్వారా దేశ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం సీఎంఎస్‌ -01ను రోదసిలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఇలా కేవలం మూడు ప్రయోగాలతో 12 ఉపగ్రహాలు (3 స్వదేశీ, 9 విదేశీ)లను ఇస్రో ప్రయోగించి 2020కి వీడ్కోలు పలికింది.   

Updated Date - 2020-12-31T05:11:57+05:30 IST