సరే చూసుకుందాం..!

ABN , First Publish Date - 2020-06-04T17:20:07+05:30 IST

జిల్లాలో వైసీపీ, బీజేపీ రాజకీయ వివాదాలు..

సరే చూసుకుందాం..!

వైసీపీ దాడులపై బీజేపీ కౌంటర్‌ ఎటాక్‌ 

ప్రశ్నించే నాయకులపై కేసులా? 

జెండాలు ఎగరకుండా అడ్డగిస్తారా? 

కమలదళం ఎదురు దాడి 

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాపై బైరెడ్డి నిప్పులు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైసీపీ, బీజేపీ రాజకీయ వివాదాలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ దాడులు, కేసులతో కింది స్థాయి నాయకులు ఇబ్బంది పడుతున్న సమయంలో బీజేపీ సీనియర్లు రంగంలోకి దిగి ఎదురు దాడికి దిగుతున్నారు. అవినీతికి పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమేగాక ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు వస్తే తప్పు సరిదిద్దుకోవాలని, నిజాయితీని నిరూపించుకోవాలని అంటున్నారు. అలాకాకుండా దాడులు, కేసులతో ఇబ్బంది పెట్టడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్రకార్యదర్శి హరీష్‌బాబుపై వైసీపీ నాయకులు కేసులు పెట్టించారు. తాజాగా బైరెడ్డిపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆ ఎమ్మెల్యే అండతో అన్యమతస్థులు శ్రీశైలంలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని బైరెడ్డి ఆరోపించారు. ఓ ఏజెన్సీని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టులు చేస్తున్నారన్నారు. వైసీపీ అక్రమాలను వెలికితీసేందుకు మహానంది నుంచి శ్రీశైలం వరకు రథయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇది వైసీపీ శిబిరంలో కలవరం రేపుతోంది.


వ్యక్తిగత విమర్శలు

ఆరోపణలు వస్తే గతంలో వాటిపై ప్రజాప్రతినిధులు నేరుగా స్పందించేవారు. నిజాయితీని నిరూపించుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్‌ మార్చారు. తమపై ఆరోపణలు చేసిన వారిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అనుచరుల ద్వారా కాంట్రాక్టులు, ఇసుక దందాలు నిర్వహిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వడం లేదు. పైగా ప్రశ్నించిన నాయకులపై కేసులు బనాయించి నోళ్లు మూయిస్తున్నారు. ఇదే తరహాలో శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవకతవకలపై పలువురు బీజేపీ నాయకులు ప్రశ్నించారు. స్థానిక నాయకుల అండతో కొందరు ఉద్యోగులు, ప్రైవేట్‌ వ్యక్తులు రూ.కోట్ల  కుంభకోణాలకు తెరతీశారని విమర్శించారు.


దీనిపై స్పందించిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా.. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై ప్రతి విమర్శలకు దిగారు. దీంతో ఆ కుంభకోణంలో ఎమ్మెల్యే పాత్రను వెలికి తీసి నిరూపిస్తానని బైరెడ్డి ప్రకటించారు. ఇటీవల నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. బీజేపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది కొనసాగితే తాను బహిరంగ దాడులకు దిగుతానని నియోజకవర్గ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రకటించి కలకలం రేపారు. కరోనా వ్యాప్తి వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి హరీష్‌ బాబుపై కర్నూలు ఎమ్మెల్యే సీఐడీ కేసు పెట్టించారు. ఇటీవలే హరీష్‌ బాబు విచారణకు హాజరై తన వాదన వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే తీరుపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్‌రెడ్డికి హరీష్‌ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తీరుపై విచారణ చేయించాలని కోరారు.


వందల కోట్ల కుంభకోణాలు..

జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయి. శ్రీశైలం, మహానంది పరిధిలో వందల కోట్ల కుంభకోణాలు జరిగాయి. శ్రీశైలంలో రఫీ, రజాక్‌ ఎవరు? హిందువుల దేవాలయంలో వారికేంపని? వైసీపీ అధికారంలోకి వచ్చాక శ్రీశైలంలో వెలిసిన కొన్ని ఏజెన్సీలను అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల కాంట్రాక్టులు దోచుకుంటున్నారు. ఏకంగా 1300 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్ని చేర్చుకున్నారు. వైసీపీ అవినీతిని బట్టబయలు చేస్తాం. 

- బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు


ప్రశ్నిస్తున్నామనే కేసులు..

ప్రశ్నిస్తే కేసులు పెడతారు. జెండా ఆవిష్కరణలకు అడ్డుపడతారు. ఇదేం రాజకీయం? నియంత పాలనలా తయారైంది. దీన్ని వ్యతిరేకిస్తాం. కేసులు పెట్టినంత మాత్రాన వెనకడుగు వేయం. అధికార పార్టీ నాయకులే ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యంపై  ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి అనుచరులే దుకాణాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కాంట్రాక్టులను చేజిక్కించుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడుతున్నారు.

- హరీష్‌ బాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి


జెండా పీకెయ్‌.. 

రాష్ట్రంలో ప్రతిపక్షాల జెండా ఎగరనివ్వడం లేదు. ఆవిష్కరణకు వెళితే వివాదాలు సృష్టిస్తున్నారు. ఇతర పార్టీల కార్యకర్తలపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. జిల్లాలో వైసీపీ జెండా తప్ప మరో పార్టీ జెండా కనిపించకూడదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు వెల్దుర్తి, పత్తికొండ, బనగానపల్లె, మంత్రాలయం.. పలు ప్రాంతాల్లో జెండా గొడవలు జరిగాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండాలు ఎగురనీయకుండా అడ్డుకుంటున్నారు. కాదని జెండా ఎగురవేస్తే కేసులు పెట్టించి భయాందోళనలకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా బీజేపీ జెండాలనూ అడ్డుకుంటున్నారు.


ఆదోని మండలం ఇస్వి, నాగనాథహల్లిలో బీజేపీ జెండా ఆవిష్కరణ సందర్భంగా రెండు సార్లు వైసీపీ నాయకులు గొడవకు దిగారు. కౌతాళం మండలంలో ఉరుకుందలో బీజేపీ జెండా దిమ్మెను కొందరు ధ్వంసం చేశారు. ఆ మరుసటి రోజు మరోసారి బీజేపీ నాయకులు జెండా ఆవిష్కరణకు ప్రయత్నించగా, స్థానిక వైసీపీ నాయకులు దాడులకు దిగారు. కోసిగి మండలం, కామనదొడ్డిలోనూ ఇదే తరహాలోనూ జెండా ఆవిష్కరణను వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల భద్రత నడుమ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుషోత్తం రెడ్డి జెండా ఆవిష్కరించారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఈ తరహా వివాదాలకు వైసీపీ తెరతీస్తోంది. ఇటీవల కౌతాళం మండలంలోని నాలుగు ప్రాంతాల్లో జెండా వివాదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తీరుపై బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నా వైసీపీ నుంచి ఎవరూ స్పందించడం లేదు. స్థానికంగా జరిగినవి కాబట్టి పోలీసులు, నాయకులే చూసుకుంటారని మాట దాటవేస్తున్నారు. 


ఆలయాల్లో అక్రమార్కులు: బైరెడ్డి

కర్నూలు: శ్రీశైలం, మహానంది ఆలయాల్లో హైందవ సంప్రదాయానికి గండి కొడుతున్నారని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరెడ్డి మండిపడ్డారు. నగరంలోని బైరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల కారణంగా పవిత్ర ఆలయాల్లో అక్రమార్కులు చొరబడ్డారని, రూ.కోట్ల విలువైన సొమ్ము దోచుకుని వెళ్లిపోతున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు కాపాడుతున్నారని ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నించిన తనను శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకుంటున్న శిల్పాను రాజకీయాల్లో తీసుకువచ్చానని, స్థాయి మరిచి మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు.


తన ఆరోపణలపై సీఎం జగన్‌ స్పందించాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో మహానంది నుంచి శ్రీశైలానికి రథయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. అక్కడ జరుగుతున్న ఆక్రమాలను ప్రపంచానికి తెలిసేలా చేస్తామని అన్నారు. 2017 వరకు  మహానంది ఆలయానికి ఏటా రూ.20 కోట్ల ఆదాయం ఉంటే, ఆ తర్వాత ఏడాది నుంచి రూ.7 కోట్లకు ఎందుకు పడి పొయిందో చెప్పాలని ప్రశ్నించారు. దేవస్థానం భూముల్లో 126 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, 116 ఎకరాలను నాయకులే తమ అనుచరులకు కట్టబెట్టి అరటి తోటలు సాగు చేయిస్తున్నారని విమర్శించారు. అక్రమాలను వెలుగులోకి తెచ్చి కాపాడుకుంటామని తెలిపారు. 

Updated Date - 2020-06-04T17:20:07+05:30 IST