జిల్లాలో ఎన్నికల అధికారులపై వైసీపీ ఒత్తిడి

ABN , First Publish Date - 2020-03-13T11:42:39+05:30 IST

పత్తికొండ మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి 100 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. వీటిని గురువారం పరిశీలించారు.

జిల్లాలో ఎన్నికల అధికారులపై వైసీపీ ఒత్తిడి

పలువురు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

ఆర్వో కార్యాలయంలో వైసీపీ నాయకుల తిష్ట

పత్తికొండ, కోవెలకుంట్ల, హొళగుందలో ఉద్రిక్తత

కొనసాగుతున్న వైసీపీ ప్రలోభాలు.. బెదిరింపులుపత్తికొండ, మార్చి 12: పత్తికొండ మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి 100 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. వీటిని గురువారం పరిశీలించారు. పత్తికొండ 3,4,6 ఎంపీటీసీ స్థానాల టీడీపీ అభ్యర్థులు నామినేషన్ల పత్రాలతోపాటు కుల ధ్రువీకరణ, మరికొన్ని పత్రాలు జత చేయలేదని అధికారులు తిరస్కరించారు. కానీ తాము అన్ని పత్రాలు సమర్పించామని, అయినా ఎలా తిరస్కరిస్తారని అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి విక్టర్‌ను ప్రశ్నించారు. తాము నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నామని ఆర్వో వారికి సమాధానమిచ్చారు. దీంతో కొందరు మంత్రుల ఆదేశాల మేరకు ఉద్దేశపూర్వకంగా తమ నామినేషన్లను తిరస్కరిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారిని కలిశారు. నామినేషన్ల తిరస్కరణపై వివరణ కోరారు. ఏయే స్థానాలను తిరస్కరించారో చెప్పాలని కోరారు. ఈ వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని ఆర్వో, నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు సమర్పించని వారి నామినేషన్లను తిరస్కరించి ఉంటామని అన్నారు. దీంతో తమకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే అప్పీల్‌కు వెళతామని ఆర్వోతో శ్యాంబాబు కోరారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి తన అనుచరవర్గంతో ఆర్వో కార్యాలయం వద్దకు దూసుకువచ్చారు.


శ్యాంబాబును లోపలికి ఎలా అనుమతించారని, వారిని బయటకు పంపాలని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని, బయటకు వెళ్లమని ఎలా అంటారని కేఈ శ్యాంబాబు అధికారులను ప్రశ్నించారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో డీఎస్పీ వెంకటరామయ్య, సీఐలు రంగప్రవేశం చేశారు. కేఈ శ్యాంబాబుతో పాటు అనుచరవర్గాన్ని ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు పంపారు. అధికారపార్టీ వారిని లోపల ఉంచి తమను మాత్రమే బయటకు ఎలా పంపుతారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీవారు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే వైసీపీ వారిని కూడా బయటకు పంపుతామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని డీఎస్పీ కోరడంతో శ్యాంబాబు తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


అధికారులను బెదిరించిన ఎమ్మెల్యే తనయుడు 

టీడీపీ శ్రేణులు వెళ్లిపోయినా ఎమ్మెల్యే తనయుడు రామ్మోహన్‌రెడ్డి, మరో నాయకుడు మురళీధర్‌రెడ్డి ఎంపీడీవో కార్యాలయంలోనే ఉండి అదికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం లోపలికి వస్తే అధికార పార్టీ వారైన తాము రావాలే తప్ప ప్రతిపక్షం వారిని ఎలా అనుమతించారని ఆర్వోతో పాటు ఎంపీడీవోపై చిందులు వేశారు. ధ్రువీకరణ పత్రాలు లేని నామినేషన్లను తిరస్కరించినట్లు ప్రకటించాలే తప్ప వారితో మంతనాలు జరపడం ఏమిటని మండిపడ్డారు. 


వైసీపీ నాయకుల హల్‌చల్‌ 

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల మండల పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆర్వో కేంద్రం వద్ద వైసీపీ నాయకులు గురువారం గుంపులు గుంపులుగా చేరి లోపలికి, బయటికి తిరిగారు. టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనపై అభ్యంతరాలు వ్యక్తం చేసే పనిలో పడ్డారు. ఆర్వోపై ఒత్తిడి తేవడాన్ని గుర్తించిన టీడీపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాతారణం ఒక్కసారిగా వేడెక్కింది. మండలంలోని పలువురు వైసీపీ నాయకులతో లాయర్‌ మధుసూదన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకుని టీడీపీ నామినేషన్లు తిరస్కరించాలని ఆర్వో కొండారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.


పోలీసులు జోక్యం చేసుకొని వైసీపీ నాయకులను బయటికి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వైసీపీ నాయకుల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులకు ఆర్‌వో తొత్తుగా వ్యవహరిస్తున్నారని, చిన్న, చిన్న కారణాలు చూపి టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని బీసీ ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. 


ఉపసంహరించుకోండి

ఆలూరు: ఆలూరు మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు 80 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వైసీపీ 36, టీడీపీ 27, జనసేన 4, బీజేపీ 1, సీపీఐ 1, సీపీఎం 3, ఇండిపెండెంట్లు 8 మంది ఉన్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు శుక్రవారం అవకాశం ఉంది. ఇప్పటికే అధికార పార్టీ నాయకులు టీడీపీ, స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థులకు ఫోన్లు చేసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది. నీవు మా వాడివే. మా దగ్గరకు రా.. పనులు చేసుకో..’ అని ఆఫర్‌ ఇస్తున్నారు. మరో వైపు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎలాగైనా ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను కైవసం చేసుకునేందుకు వైసీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చిప్పగిరి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి విరుపాక్షి ఏకగ్రీవం ఖరారైంది. ఎంపీపీ కూడా ఏకగ్రీవం కానుంది. ఆలూరు మండలంలో టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులను నయానో భయానో ఉపసంహరించుకునేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు. 


హొళగుంద మండలంలో..

హొళగుంద: మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 79 మంది నామినేషన్‌ వేశారు. వీటి పరిశీలన వివాదాస్పదం అయింది. వైసీపీ నాయకులను మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి అనుమతించారు. టీడీపీ సహా అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను లోనికి అనుమతించకుండా నామినేషన్లను పరిశీలించారు. చిన్నచిన్న కారణాలతో 11 మంది టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు కూడా నామినేషన్‌ వేసే క్రమంలో కొన్ని పత్రాలను ఇవ్వలేదు. అధికారుల అండదండలతో దొడ్డిదారిన (కిటికీల ద్వారా) ఈ పత్రాలను తెప్పించుకుని ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి గురువారం రాత్రి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. తమ పార్టీ అభ్యర్థులను ఆర్వో కార్యాలయంలోకి ఎందుకు అనుమతించలేదని అధికారులను ప్రశ్నించారు.


నామినేషన్లను ఎందుకు తిరస్కరించారో చెప్పాలని ఆర్వోను ప్రశ్నించారు. కోట్ల సుజాతమ్మ వచ్చిన విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. కోడ్‌ అమలులో ఉన్నా పట్టించుకోకుండా ఈలలు, కేకలు వేస్తూ గోల చేశారు. ఆర్వోను ప్రశ్నించడానికి ఏం అధికారం ఉందని కోట్ల సుజాతమ్మను వైసీపీ నాయకులు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 


టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌..?

మంత్రాలయం: మంత్రాలయం మండలం వగరూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఏసన్నను వైసీపీ నాయకులు కిడ్నాప్‌ చేసినట్లు టీడీపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వగరూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా సీహెచ్‌. బాస్కర్‌ నామినేషన్‌ వేశారు. మాజీ సర్పంచ్‌ ఏసన్న డమ్మీ అభ్యర్థిగా వేశారు. సీహెచ్‌ బాస్కర్‌కు అధిక సంతానం ఉండడంతో అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో ఏసన్నను టీడీపీ అభ్యర్థిగా గుర్తించారు. వైసీపీ నాయకులు గురువారం రాత్రి ఏసన్నను కిడ్నాప్‌ చేసినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సీఐ కృష్ణయ్య వివరణ కోరగా వగరూరుకు వెళ్లి ఏసన్న భార్యతో మాట్లాడామన్నారు. ఏసన్నతో ఫోన్లో మాట్లాడగా తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లినట్లు చెప్పారన్నారు. ఏసన్న కిడ్నాప్‌ కాలేదన్నారు.  

Updated Date - 2020-03-13T11:42:39+05:30 IST