రైతులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం: మాజీ మంత్రి

ABN , First Publish Date - 2020-05-18T09:44:57+05:30 IST

తమకు రైతు పక్షపాతం ఉందని చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని మాజీ మంత్రి అఖిలప్రియ

రైతులను మోసం చేస్తున్న  వైసీపీ ప్రభుత్వం: మాజీ మంత్రి

ఆళ్లగడ్డ, మే 17: తమకు రైతు పక్షపాతం ఉందని చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. ఆది వారం ఆమె ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో రైతే రాజు అని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా వారిని విస్మరించిం దన్నారు. కరోనా లాక్‌డౌన్‌లో రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ నష్టపోయింది రైతులే అన్నారు. కర్నూలు జిల్లాలో ఈ క్రాప్‌ కింద నమోదు చేసుకున్న పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. జిల్లాలో శనగ పంట 2.62 వేల టన్నులు దిగుబడి సాధించగా కేవలం 55 వేల టన్నులు కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ ద్వారా కొనుగొలు చేసిందని, మిగిలిన శనగలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. కందులు 54 వేల టన్నులు పండగా 21 వేల టన్నులు, పసుపు 22 వేల టన్నులు పండగా 8 వేల టన్నులు మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేశారని తెలిపారు.


ఉల్లిగడ్డలు 22 వేల టన్నులు పండగా 5 వేల టన్నులు కొనుగోలు చేసి కేంద్రాలను మూసి వేశారన్నారు. కడప జిల్లా పులివవెందుల అరటి రైతులను ఆదుకున్నట్లే కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. మొక్కజొన్న పంట జిల్లాలో 75 వేల టన్నులు దిగుబడి సాధించగా 18 వేల టన్నులు, జొన్న పంట 1.45 వేల టన్నులు దిగుబడి సాధించగా 30 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని చెప్పారు, బొప్పాయి రైతులు లాక్‌డౌన్‌తో నష్టపోయారని, రైతుల వద్ద ఉన్న పంట దిగుబడులను నాణ్యత ప్రమాణాలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం రూ. 3వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిందని, ఆ మేరకు ప్రభుత్వం ఈ క్రాప్‌ చేసుకున్న ప్రతి పంటను కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి అఖిలప్రియ డిమాండు చేశారు.


రాక్షస పాలన: సోమిశెట్టి 

కర్నూలు: రాష్ట్రంలో రాక్షస పాలన, గుండాయిజం పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో సామాన్య ప్రజలు, రైతులు  మనశ్శాంతితో బతికే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తిరుమల వెంకటేశ్వర స్వామి విసుగు చెంది దర్శనమివ్వడం మానుకున్నారని అన్నారు. జిల్లాలోలాగే కరోనా వైరస్‌ రాష్ట్రంలో ఉధృతంగా కొనసాగుతోందని అన్నారు. కొద్దిరోజుల్లో దేశంలోనే కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగి రాష్ట్రం ముందువరుసలో ఉండే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఈ పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి కరోనా వైరస్‌ నిర్మూలనకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే కారణమని ధ్వజమెత్తారు. దాదాపు రెండు నెలల లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అన్ని రంగాలు దెబ్బతిన్నాయని అన్నారు. వలస కూలీలు, పేదలు, రైతులు కష్టాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా వీరిని ఆదుకోడానికి కేంద్రం చేసిన సాయం తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా  చర్యలు తీసుకుందని ఆరోపిం చారు.


పాలన అస్తవ్యస్తంగా మారిందని, అభి వృద్ధి గణనీయంగా కుంటుపడిందని తెలిపా రు. రైతులు పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.  అధికారులు రోజుకో నిబంధన అమలు చేస్తున్నారని, కొన్ని రోజులు పెద్దపాడు వద్ద, ప్రస్తుతం జగన్నాథగట్టు, అలాగే గుత్తిపెట్రోల్‌ బంకు తదితర ప్రాంతాల్లో పంట ఉత్పత్తులను తీసుకునివెళ్లి అమ్ముకోవాలని జారీ చేస్తుండటంతో  రైతులు అవస్థ పడుతున్నట్లు ఆరోపించారు. కర్నూలులో, ఇంకా వివిధ పట్టణాల్లో అమలవుతున్న రెడ్‌జోన్‌ కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాల రోగులకు  మెడికల్‌ షాపులు అందుబాటులో లేవని, ఈ విషయంలో  ప్రభుత్వం వెంటనే పునరాలోచించి కనీస సదుపాయాలు కల్పించాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-05-18T09:44:57+05:30 IST