దగ్గరుండి విత్‌డ్రా... ప్రత్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు

ABN , First Publish Date - 2020-03-15T11:27:11+05:30 IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం మధ్యాహ్నం 3

దగ్గరుండి విత్‌డ్రా... ప్రత్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు

కర్నూలు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఆ తరువాత అధికారులు తుది జాబితా ప్రకటించాలి. కానీ వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగి, సాయంత్రం వరకూ ఉపసంహరణలకు అనుమతించారు. అనంతరం రాత్రి వరకు గడువు పెంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇలా వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు అధికార ముద్ర పడింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల కుటుంబీకులను నిర్బంధించి నామినేషన్లు ఉపసంహచుకోవాలని బలవంత పెట్టారు.


వైసీపీ జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి కుమారుడు వైరి పార్టీల అభ్యర్థులను దగ్గరుండి జడ్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. వారి చేత నామినేషన్లను ఉపసంహరింపజేశారు. హోళగుంద, చిప్పగిరి, ఆలూరు తదితర మండలాల్లో పరిశీలన పూర్తి చేసి జాబితా ప్రకటించారు. ఆ తరువాత అధికారులు వెళ్లిపోయినా, వెనక్కు పిలిపించి మరీ ఉపసంహరణలు చేయించారు. గడువు ముగిశాక కూడా వైసీపీ నాయకులు బెదిరించి, ప్రత్యర్థులను లొంగదీసుకున్నారు. జిల్లాలో ఏకంగా 16 జడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ సంఖ్యను 25కు పెంచేదాకా ప్రయత్నాలు సాగాయి. 

కొనసాగిన ఆగడాలు

ఉపసంహరణల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. రిటర్నింగ్‌ అధికారులు శనివారం మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది. అందుకనుగుణంగా హోళగుంద, ఆలూరు తదితర మండలాలు, జడ్పీ కార్యాలయంలో అధికారులు ఉపసంహరణలను పూర్తి చేశారు. కొన్ని మండలాల్లో తుది జాబితా కూడా ప్రకటించారు.


ఇంతలో ఏమైందో ఏమో.. వైసీపీ కార్యాకర్తలు ఆర్వో కార్యాలయాలకు నామినేషన్లు వేసిన ప్రత్యర్థులను వెంటబెట్టుకుని వచ్చారు. సమయం అయిపోయిందన్నా వినకుండా అధికారులతో వాగ్వివాదాలకు దిగి విత్‌ డ్రా చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇంతలో ఆర్వోకి జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో అభ్యంతరాలు పక్కన పెట్టిన ఆయన గుట్టుచప్పుడు కాకుండా ఉపసంహరణ దరఖాస్తులను పూర్తి చేయించారు. అనంతరం జిల్లాకు చెందిన మరో మహిళా ఎమ్మెల్యే కూడా ఆ అధికారికి ఫోన్‌ చేసి, మరికొందరు ఉపసంహరణలకు వస్తున్నారని, పత్రాలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇలా వరుస బెదిరింపుల కారణంగా 4 గంటల తరువాత కూడా ఉపసంహరణలను కొనసాగించారు.


5.30 గంటల తర్వాత ఉపసంహరణల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా గడువు పెంచుతున్నట్లు ఆదేశాలు వచ్చాయి. అవసరమైతే రాత్రి 7 గంటల దాకా ఈ ప్రక్రియ కొనసాగించాలని, ఆ తర్వాతే తుది జాబితా ప్రకటించాలని రహస్య ఆదేశాలు అంతకుముందే అధికారులకు అందాయని సమాచారం. ఈ క్రమంలో తమను భయపెట్టి మరీ ఉపసంహరణలకు తీసుకొచ్చారని కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులు  జడ్పీ కార్యాలయంలో వాపోయారు. వారి ఆవేదనను పట్టించుకునే నాథులే కరువయ్యారు. 


జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి కుమారుడే..

వైసీపీ తరపున జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారుడు ఉదయ భాస్కరరెడ్డి కొందరు టీడీపీ అభ్యర్థుల్ని దగ్గరుండి జడ్పీ కార్యాలయానికి తన వాహనంలో తీసుకొచ్చారు. కొలిమిగుండ్ల నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సుగుణమ్మ శుక్రవారం నుంచి స్థానిక టీడీపీ నాయకులకు అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులు, నాయకులు ఆందోళన చెందారు. ఇంతలో ఆమెను ఉదయ భాస్కర్‌ రెడ్డి జడ్పీ కార్యాలయానికి శనివారం తీసుకొచ్చారు. ఆర్వో కార్యాలయంలోకి వెళ్లి ఆమె చేత ఉపసంహరణ చేయించారు. అంత వరకు ఆయన సుగుణమ్మ పక్కనే ఉన్నారు. సమయం అయిపోయిందని ఆర్వో చెప్పినా వినలేదు.


ఆమెతో నామినేషన్‌ విత్‌ డ్రా చేయించే వరకు ఊరుకోలేదు. అనంతరం వైసీపీ నాయకులు, టీడీపీ అభ్యర్థి వేర్వేరుగా వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలు కర్నూలు జిల్లాలో శనివారం అనేక చోట్ల కనిపించాయి. కాంగ్రెస్‌ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థులుగా ప్యాపిలి మండలానికి చెందిన కేశవులు, బేతెంచర్లకు చెందిన కవిత నామినేషన్లు వేశారు. కవిత ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఓటరు జాబితా కోసం వచ్చామని పరిచయం చేసుకుని, పలు పత్రాలపై శుక్రవారం సంతకాలు చేయించుకున్నారు.


ఆ మర్నాడే ఆ పత్రాలు జడ్పీ కార్యాలయంలోని ఆర్వో వద్దకు ఉపసంహరణ దరఖాస్తు రూపంలో వచ్చి చేరాయి. దీంతో ఆమె లేకపోయినా నామినేషన్‌ రద్దయింది. ఇలా శుక్రవారం సాయంత్రానికి ఏకంగా 16 జడ్పీటీసీలను వైసీపీ నాయకులు ఏకగ్రీవం చేసుకున్నారు. గడువు పెంచి మరీ ఆ సంఖ్యను 25కు పెంచాలని వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

16 ఏకగ్రీవాలు

జిల్లాలో 16 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవన్నీ వైసీపీ ఖాతాలో చేరాయి. ప్యాపిలి, బేతెంచర్ల, హోళగుంద, కొలిమిగుండ్ల, చిప్పగిరి, రుద్రవరం ఇలా పలు మండలాల నుంచి జడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన 14 మందికి పైగా అభ్యర్థుల్ని ఉపసంహరించుకునేలా చేయడంలో వైసీపీ నాయకులు విజయం సాధించారు. చిప్పగిరి మండలంతో బోణీ కొట్టి.. జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రత్యర్థులచేత బలవంతంగా విత్‌ డ్రా చేయించారు.


జిల్లాలో ఎమ్మెల్యేలు ఉంటున్న నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే ఎన్నికలు జరిగేలా వైసీపీ నాయకులు జాగ్రత్తపడ్డారు. ప్రాబల్యముండే ప్రాంతాలు కాబట్టి ఎన్నికలు పెట్టలేదన్న అపవాదు రాకుండా పోటీలకు అవకాశమిచ్చారు. అందులో ఆలూరు, డోన్‌, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పత్తికొండ, పాణ్యం తదితర జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 


హోళగుందలో భయాందోళనలు

ఆలూరు నియోజకవర్గంలో ఏకగ్రీవాల కోసం వైసీపీ పాకులాడుతోంది. అడ్డున్న వారిని బెదిరిస్తూ.. ప్రత్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకునే వరకూ వదలడంలేదు. ఒక్క హోళగుంద మండంలోనే 14 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఇప్పటివరకు 11 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారంటేనే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకే ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసిన రిటర్నింగ్‌ అధికారులు, అభ్యర్థుల తుది జాబితాను నోటీసు బోర్డులో పెట్టారు. ఆర్వో కూడా ఇంటికి వెళ్లిపోయారు. అయినా, ఆయన్ను వెనక్కు పిలిపించారు. మరికొందరు అభ్యర్థులు నామినేషన్లను విత్‌ డ్రా చేసుకోవడానికి వస్తున్నారని, అవి పూర్తి చేయాల్సిందేనని జిల్లాకు చెందిన ఓ మంత్రి  అధికారులకు ఫోన్‌ చేసి బెదిరించారు. దీంతో అతికించిన నోటీసులను తొలగించిన అధికారులు ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల వరకు విత్‌ డ్రా గడువు పొడిగిస్తూ కలెక్టర్‌ ఆదేశాలిచ్చారని అధికారులు చెబుతున్నారు. కానీ రాత్రి 7.45 గంటలకు కూడా అధికారులు ఈ విత్‌ డ్రాలు కొనసాగించారు. తుది జాబితా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియని అయోమయ పరిస్థితిని అధికారులు, వైసీసీ నాయకులు కలిగించారు. ఎంపీడీవో కార్యాలయంలోకి మీడియాను కూడా అనుమతించలేదు. కొందరు వైసీపీ కార్యకర్తలు మీడియాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడకు చేరుకున్న విలేకరులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాకి సమాచారం అందింది. అధికార పార్టీకి అనుకూలమైన పత్రిక విలేకరులు మినహా ఇతరులెవరూ ఆర్వో కార్యాలయం పరిసరాలకు కూడా వెళ్లలేకపోయారు. 



Updated Date - 2020-03-15T11:27:11+05:30 IST