ఆర్‌యూలో గందరగోళ పరిస్థితులు.. బీఈడీ పరీక్షలు ఎప్పుడో తెలియక..

ABN , First Publish Date - 2020-12-10T05:58:26+05:30 IST

బీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలపై స్పష్టత లేకపోవడంతో విదార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్‌యూలో గందరగోళ పరిస్థితులు.. బీఈడీ పరీక్షలు ఎప్పుడో తెలియక..

అడ్మిషన్లలో అక్రమాలతో ఇబ్బందులు

సీడీసీ, పరీక్షల విభాగాల్లో నిర్లక్ష్యం

కొత్త వీసీ నిర్ణయం కోసం విద్యార్థుల ఎదురుచూపు


కర్నూలు: బీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలపై స్పష్టత లేకపోవడంతో విదార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పరీక్షలు పూర్తయ్యాయి. కానీ రాయలసీమ యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. 2019-21 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీ పరిధిలో 53 బీఈడీ అనుబంధ కళాశాలల్లో దాదాపు 5,600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పరీక్షల గురించి యూనివర్సిటీ అధికారులను కాలేజీల యాజమాన్యాలు కూడా ధైర్యంగా ప్రశ్నించలేకున్నాయి. ఒడిసా, బెంగాల్‌ తదితర రాష్ట్రాల విద్యార్థులకు కొన్ని కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు ఇచ్చాయి. ఈడబ్ల్యూఎస్‌ కోటాలోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా వారు మౌనం వహిస్తున్నారని సమాచారం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియలో యూనివర్సిటీ అధికారులు  నిర్లక్ష్యం వహించారు. టీసీలు లేకుండానే సుమారు 500 మంది విద్యార్థుల నుంచి పరీక్షల ఫీజు కట్టించుకున్నారు. కానీ సీడీసీ విభాగం వీరి డేటా ఆన్‌లైన్‌ స్వీకరించలేదు. దీంతో యూనివర్సిటీ అఽధికారులు ఇరకాటంలో పడ్డారు. 


గత వీసి వద్దకు ఈ ఫైలు వెళ్లింది. ఒరిజనల్‌ టీసీలు లేకుండానే ప్రక్రియ నడిపించారని తెలిసి ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారని అధికారులపై మండిపడ్డారు. సీడీసీ, పరీక్షల విభాగం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైలును పరిశీలించాలని రెక్టార్‌కు సిఫారసు చేశారు. ఆయన ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలతో తన చాంబరులో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఇది అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. యూనివర్సిటీకి కొత్త వీసీ రావడంతో సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. కొత్త వీసీ నిర్ణయం కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.


విద్యార్థి సంఘాల ఆగ్రహం

పరీక్ష కేంద్రాల ఎంపికలో అడ్డగోలుగా వ్యవహరించారని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పత్తికొండ, ఎమ్మినూరు బీఈడీ కాలేజీల యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులతో కుమ్మక్కయ్యాయని, కర్నూలులో సెంటర్లను కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిసా విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకే ఇలా చేశారని, భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాలు సామాజిక మాధ్యమాల్లో ఆరోపించాయి. 


ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌కు తూట్లు..

అగ్రవర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద పది శాతం సీట్లను కేటాయించింది. వీటి కేటాయింపులో కొన్ని ప్రైవేట్‌ బీఈడీ కాలేజీలు అక్రమాలకు పాల్పడ్డాయని విద్యార్థి సంఘాలు అరోపిస్తున్నాయి. దీనిపై వీసి ఫిర్యాదు చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు


విషయం తెలుసుకుంటా..

బీఈడీ పరీక్షల అంశంపై నాకు పెద్దగా అవగాహన లేదు. కొత్తగా వచ్చి బాధ్యతలు తీసుకున్నాను. సమస్య తెలు సుకుని పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటాను. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాను. - ఆనందరావు, వీసీ


వీసీతో చర్చిస్తాం..

విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ డేటా సీడీసీ విభాగం నుంచి మా వద్దకు రాలేదు. పరీక్షల ఫీజు కట్టించుకున్న మాట వాస్తవమే.  విషయం వీసితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - డాక్టర్‌ వెంకటేశ్వర్లు, పరీక్షల నిర్వహణ అధికారి


ఇంత నిర్లక్ష్యమా..

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయకుండా ఫీజు ఎలా కట్టించుకుం టారు..? పరీక్ష సెంటర్ల కేటాయింపుల్లో ప్రైవేట్‌ కళాశాలకు అను కూలంగా వ్యవహరించారు. ప్రతి ఏడాదీ అక్రమాలు జరుతున్నా యి. మొదటి సెమిస్టర్‌ పరీక్ష నిర్వహించలేదు. విద్యార్థులు నష్ట పొతున్నారు. పరీక్షల విభాగం, సీడీసీ విభాగం అధికారులపై చర్య లు తీసుకోవాలి. - శ్రీరాములు, కన్వీనర్‌, విద్యార్థి సంఘాల జేఏసీ 

Updated Date - 2020-12-10T05:58:26+05:30 IST