స్వామి సొమ్ము ఏం చేశారంటే

ABN , First Publish Date - 2020-12-20T06:15:55+05:30 IST

ఆయన అధికార పార్టీ నాయకుడు. రెండు దేవాలయాల ఆదాయాన్ని సొంతానికి వాడుకుంటున్నాడు.

స్వామి సొమ్ము  ఏం చేశారంటే
లక్ష్మి గణపతి దేవాలయంలో ఏర్పాటు చేసిన హుండీ

  1. ఆయన గుప్పిట్లో రెండు ఆలయాలు 
  2. స్వామి కిరీటం ఇచ్చేందుకు ససేమిరా..!
  3. రూ.5 కోట్ల స్థలం కబ్జా.. భవనాల నిర్మాణం
  4. దేవదాయ శాఖ ఆలయాల్లో హల్‌చల్‌
  5. అధికార పార్టీ నాయకుడిని అడిగేదెవరు..?

 

నంద్యాల టౌన్‌, డిసెంబరు 19: ఆయన అధికార పార్టీ నాయకుడు. రెండు దేవాలయాల ఆదాయాన్ని సొంతానికి వాడుకుంటున్నాడు. ఈవోను కాదని, దేవాలయాలలో తిష్టవేసి అందినంత తన ఖాతాలో జమ చేసుకుంటున్నాడు. దేవాలయాల వద్ద వ్యాపారాలు చేసుకునే వారు ఇచ్చే సొమ్ము, ఆలయంలోని హుండీ ఆదాయం ఆయన ఖాతాలో జమ అవుతోంది. దాతలు స్వామివారికి సమర్పించిన కిరీటాన్ని దేవస్థానం పరిపాలన అధికారికి అప్పగించడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఆ నాయకుడి వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 

 నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద లక్ష్మీగణపతి, శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి దేవాలయాలు ఉన్నాయి. వీటినీ ఓ అధికారపార్టీ నాయకుడు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. పూర్వం నుంచి బ్రహ్మానందీశ్వర స్వామి అస్థాన విడిది మందిరంలో దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. దీన్ని కూడా తనకు ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. ఆలయానికి కానుకలు వచ్చినా ఆలయ అధికారులకు అప్పగించాలి. కానీ ఈయన స్వామివారికి వచ్చిన కిరీటాన్ని కూడా తనవద్దే ఉంచుకున్నాడు. 


కిరీటంపై కిరికిరి

రామసమేత సత్యనారాయణ స్వామి దేవాలయానికి రూ.8 లక్షల విలువ చేసే కిరీటాన్ని భక్తులు కానుగా ఇచ్చారు. ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి రాకమునుపు కమిటీ సభ్యులు బాధ్యతలు నిర్వహించేవారు. ఆ సమయంలో పలువురు భక్తులు బంగారం, వెండి తదితర కానుకలను అందజేశారు. మరో దాత రూ.8 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని కానుకగా అందజేశారు. దేవాలయం దేవదాయ శాఖ పరిధిలో వెళ్లిన తరువాత కమిటీ సభ్యులు కానుకలను కార్యనిర్వహణ అధికారికి అప్పగించారు. కానీ  ఆ నాయకుడు మాత్రం కిరీటాన్ని ఈవోకు అప్పగించలేదు. స్వామివారి కిరీటాన్ని అధికారులకు అప్పగించాలని చాలామంది ఆయనకు సూచిస్తున్నా స్పందించడం లేదని సమాచారం. 


లక్ష్మీగణపతి సొమ్ము ఏమైంది?

మహా శివరాత్రి సమయంలో మహానందీశ్వరుడి విగ్రహాలను బ్రహ్మనందీశ్వర అస్థాన విడిది మండపంలో ఒక రోజు విడిది చేయిస్తారు. అనంతరం అక్కడి నుంచి బ్రహ్మానందీశ్వరుడితో కలిసి మహానందీశ్వరుడు మహానందికి తిరిగివెళ్లడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ విడిది మండపం దేవదాయశాఖ పరిధిలో ఉంది. ఈ మండపంపై అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. వెంటనే పలువురితో కలిసి చందాలు వసూలు చేసి ఆ మండపంలో 2013లో లక్ష్మీగణపతి విగ్రహాలను ఏర్పాటు చేయించాడు. దేవదాయశాఖ అనుమతి మాత్రం తీసుకోలేదు. అది మొదలు స్వామివారికి వచ్చే కానుకలను సొంత ఆదాయంగా మార్చుకున్నాడు. ఇది చాలదు అన్నట్లు నాలుగు సంవత్సరాల క్రితం గుడిలో హుండీ ఏర్పాటు చేశాడు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా తానే తీసుకుంటున్నాడు. దేవాలయం చుట్టూ వ్యాపారాలు నిర్వహించేవారి నుంచి రోజుకు రూ.వెయ్యి వసూలు చేస్తున్నట్లు సమాచారం. హుండీ ఆదాయంతో పాటు ప్రతి నెలా రూ.30 వేలకు పైగా నాయకుడి ఖాతాలోకి వెళుతోందని సమాచారం. 


ఈవోను కాదని..

అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడు ఆలయం విషయంలో ఈవోను కాదని సొంతంగా నిర్ణయాలు చేస్తున్నారు. రాజకీయ అండ ఉండటంతో రెండు దేవాలయాలలో ఆదాయాన్ని మళ్లిస్తున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. 


సత్యనారాయణ స్వామి స్థలం కబ్జా

నంద్యాల నడిబొడ్డున ఉన్న శ్రీరామ, సత్యనారాయణ స్వామి ఆలయానికి చెందిన రూ.5 కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జాచేసి భవనాలు నిర్మించారు. దీని వెనుక ఆ నాయకుడే ఉన్నట్లు సమాచారం. ఈ ఆలయ స్థలాన్ని పూర్వం గండికోట లక్షమ్మ దంపతులు దానం ఇచ్చారు. మొత్తం 60 సెంట్ల స్థలంలో సత్రం ఏర్పాటు చేశారు. శ్రీశైలం, మహానందికి కాలినడకన వెళ్లే భక్తులకు  సత్రంలో భోజనం, వసతి కల్పించే వారు. శ్రీరాముడు, సీత, సత్యనారాయణ స్వామి, కాశీ అన్నపూర్ణేశ్వరి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటుచేసి పూజలు చేసేవారు. దాతలు మరణించిన తరువాత వారి రక్త సంబంధీకులు సేవలను కొనసాగించారు. ఈ దేవాలయానికి సుమారు 25 ఎకరాల మాన్యం ఉండటంతో 1993 దేవదాయశాఖ పరిధిలోకి చేరింది.  పూజలు, ధూప దీప నైవేద్యాలు దేవదాయశాఖ ఆధీనంలో నడుస్తున్నాయి. అప్పట్లో సత్రం నిర్వహించిన 60 సెంట్లు ఆక్రమణకు గురైంది. ఇందులో నిర్మాణాలు చేపట్టడంతో ప్రస్తుతం 10 సెంట్ల స్థలం మాత్రమే మిగిలింది.


ఈవో పట్టించుకోవడం లేదు..

స్వామివారికి ఓ భక్తుడు రూ.8 లక్షల విలువ చేసే కిరీటం సమర్పించారు. అయితే, దేవదాయశాఖకు కాకుండా, సేవా కమిటీకి కిరీటంపై హక్కు ఉండేలా భక్తుడు రాసిచ్చాడు. అయినా జాయింట్‌ లాకర్‌లో పెడదామని ఈవోకి ప్రతిపాదించాము. నాలుగుసార్లు అడిగినా ఈవో సరిగా స్పందించడం లేదు. - వెంకటసుబ్బయ్య, శ్రీరామ,  సత్యనారాయణ స్వామి సేవా కమిటీ సభ్యుడు


అప్పగించడం లేదు..

లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీరామ,  సత్యనారాయణ స్వామి ఆలయాలు దేవదాయశాఖ పరిధిలో నడుస్తున్నాయి. గణపతి ఆలయ హుండీ ఆదాయాన్ని మాకు ఇవ్వటంలేదు. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. సత్యనారాయణ స్వామి ఆలయానికి దాత బంగారు కిరీటం ఇచ్చారు. దాన్ని దేవదాయశాఖకు అప్పగించడంలేదు. త్వరలో కమిటీ మీటింగ్‌ ఏర్పాటు చేసి నోటీస్‌ ఇచ్చి స్వాధీనం చేసుకుంటాం. - వేణుగోపాల్‌ రెడ్డి, దేవాలయ పరిపాలన అధికారి

Updated Date - 2020-12-20T06:15:55+05:30 IST