-
-
Home » Andhra Pradesh » Kurnool » we will callout modi
-
మోదీని గద్దె దించుతాం
ABN , First Publish Date - 2020-11-27T06:04:06+05:30 IST
నరేంద్ర మోదీ తన విధానాలను మార్చుకోకపోతే గద్దె దించుతా మని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.

- ఉద్యోగ, కార్మిక సంఘాల నేతల హెచ్చరిక
- ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్
- నగరంలో భారీ ర్యాలీ.. జడ్పీలో బహిరంగ సభ
కర్నూలు(న్యూసిటీ), నవంబరు 26: నరేంద్ర మోదీ తన విధానాలను మార్చుకోకపోతే గద్దె దించుతా మని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ నగరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్‌లు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో నగరంలో నిరసన ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. హమాలీ, మార్కెట్‌యార్డు, రైస్‌మిల్, లారీ, ఆటో, మున్సిపల్, పంచాయతీ కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్నభోజనం, భవన నిర్మాణ కార్మికులు, ఎల్‌ఐసీ, బ్యాంక్, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పూలబజార్, కొత్తబస్టాండు నుంచి రెండు భారీ ర్యాలీలు జడ్పీకి చేరుకున్నాయి. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
జడ్పీలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. దేశవ్యాప్త సమ్మె చూసైనా మోదీ కళ్లు తెరిచి పరిపాలన చేయాలని సూచించారు. బీజేపీ అఽధికారంలోకి వచ్చాక గుజరాత్‌కు చెందిన ఆదాని, అంబానీ మాత్రమే సుఖంగా ఉన్నారని అన్నారు. రైల్వే, బొగ్గు, బ్యాంకింగ్, బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్ చివరికి రక్షణ రంగాన్ని కూడా మార్కెట్‌లో పెట్టి అమ్ముతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా బిల్లును తెచ్చారని అన్నారు. రాష్ట్రల హక్కులను హరించే 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. నరేంద్ర మోదీ విధానాలను రాష్ట్రలోని అఽధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సమర్థించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఉద్యోగులు, కార్మికులు చేసే సమ్మెకు రైతులు, వ్యవసాయ కూలీలు మద్దతు తెలిపారని, దేశంలో కార్మిక కర్షక ఐక్యత వల్లనే నరేంద్ర మోదీ విధానాలను తిప్పికొట్టవచ్చని అన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప, ఎస్‌యూసీఐ నాయకులు నాగన్న, ఐఎఫ్‌టీయూ నాయకులు తిరుపాలు, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నాగరాజు, జగన్, బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ నాయకులు వెంకట్రామిరెడ్డి, మెడికల్ రెప్స్ నాయకులు రవీందర్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు కె జగన్నాథం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమన్న, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి.నిర్మల ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ఆందోళనలో కార్మిక సంఘాల నాయకులు రామక్రిష్ణారెడ్డి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
సమ్మెలో భాగంగా నగరంలో ఆటోలను బంద్ చేశారు. దీంతో అనేకచోట్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచే ప్రధాన కూడళ్లలో ఆటో యూనియన్ నాయకులు ఆటోలను తిరగకుండా చర్యలు తీసుకున్నారు.