మాట నిలబెట్టుకున్నాం
ABN , First Publish Date - 2020-09-16T09:46:05+05:30 IST
పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు

నాలుగు విడతల్లో రూ.27 వేల కోట్ల రుణమాఫీ
మొదటి విడత రూ.6,700 కోట్లు జమ చేశాం
ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
డోన్, సెప్టెంబరు 15: పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం డోన్ పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా మంత్రి పొదుపు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ పొదుపు మహిళలకు నాలుగు విడతల్లో రూ.27 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని, మొదటి విడతగా రూ.6,700 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
డోన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి, మున్సిపల్ నూతన కార్యాలయం పనులు ఇప్పటికే ప్రారంభించామన్నారు. డోన్‌లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. గుండాల చెన్నకేశవస్వామి ఆలయాన్ని రూ.3 కోట్లతో పునర్నిస్తున్నామని, డబుల్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. డోన్ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కోసం 8 పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
డోన్ రైల్వే గేట్ల మధ్య అండర్ పాస్ నిర్మాణాన్ని చేపడుతామన్నారు. కొత్తబురుజు, జలదుర్గం, చిన్నమల్కాపురం పీహెచ్‌సీల స్థాయిని పెంచుతామని హామీ ఇచ్చారు. ప్యాపిలి మండలం జలదుర్గంలో రూ.50 లక్షలతో షాదీఖానా నిర్మిస్తామన్నారు. సమావేశంలో అదనపు జేసీ ఖాజా మొహిద్దీన్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ శ్రీరాములు, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లెంపల్లి రామచంద్రుడు, మున్సిపల్‌కమిషనర్ కేఎల్‌ఎన్ రెడ్డి, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు గజేంద్రరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కోట్రికే హరికిషన్, పద్మనాభరెడ్డి, ఆర్‌ఈ రాజావర్ధన్, జీవి కృష్ణారెడ్డి, పోస్టు ప్రసాద్, టీఈ దినేష్‌గౌడు, బద్దల నాగరాజు, ఓబులాపురం సుదాకర్‌యాదవ్, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.