మేం.. ఏసీబీ నుంచి!
ABN , First Publish Date - 2020-09-03T11:11:14+05:30 IST
కొన్ని రోజుల క్రితం కర్నూలు ఆర్‌అండ్‌బీ ఈఈ జయరామి రెడ్డికి ‘ఏసీబీ హెడ్ ఆఫీస్’ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఇది...

ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు
‘కేసు’ పెట్టకుండా డబ్బులు వసూలు
నిందితులు రెడ్డిపల్లి జైలు పాత ఖైదీలు
అరెస్టు చేసిన కర్నూలు త్రీటౌన్ పోలీసులు
దొరికింది ఆరుగురు.. పరారీలో మరో ఇద్దరు
కర్నూలు, సెప్టెంబరు 2:
‘జయరాం రెడ్డీ..! ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం..’
‘సర్, నమస్తే.. చెప్పండి సార్..’
‘ఏం లేదండీ.. మీ మీద చాలా కంప్లైంట్లు వచ్చాయి. గవర్నమెంటు ఎంక్వయిరీ చెయ్యమనింది. మా వాళ్లు ఇప్పటికే కొంత డేటా సేకరించారు. మీరేమో మంచి మనిషి అని తెలిసింది. కేసు పెడదామా వద్దా అని ఆలోచిస్తాండాను..’
‘అయ్యో.. నీను అట్లాటోన్ని కాదు సర్..’
‘కానీ ఎంక్వరీ రిపోర్టు అట్ల లేదు కదా.. మనం ఏదైనా ఒక మాట అనుకుంటే కేసు వరకూ పోకుండా చూడగలను.. ఏమంటారు..?’
కొన్ని రోజుల క్రితం కర్నూలు ఆర్‌అండ్‌బీ ఈఈ జయరామి రెడ్డికి ‘ఏసీబీ హెడ్ ఆఫీస్’ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఇది. మొదట ఆయన హడలిపోయారు. ఆ తరువాత అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం ఎస్పీ ఫక్కీరప్ప దృష్టికి వెళ్లింది. ఫోన్‌కాల్ వచ్చింది ఏసీబీ అధికారుల నుంచి కాదని ప్రాథమికంగా తేలింది. ఎస్పీ ఆదేశాలతో కర్నూలు టూ టౌన్ సీఐ మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఎస్‌ఐ సునీల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు అయింది. డీఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ప్రశాంత్ కిషోర్, కర్నూలు డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐ మహేశ్వరరెడ్డి బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు.
కేసు దర్యాప్తు ఇలా
ఈఈ జయరామిరెడ్డికి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు మొదలైంది. ఆ ఫోన్ నెంబర్ కాల్‌డేటా సేకరించారు. సీఏపీ ఆధారంగా ఫోన్ కాల్ విశ్లేషణ చేశారు. అదే ఫోన్ నెంబరు నుంచి పలువురు ప్రభుత్వ అధికారులకు కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. వారికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఏసీబీ అధికారులమని కొందరు తమకు ఫోన్ చేసి బెదిరించారని వారు సమాచారం ఇచ్చారు. దీంతో విస్తుపోయిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. సీఏపీ ఆధారంగా ఒకరి ఫోన్ నెంబర్ లబించింది. ఆ నెంబరు హేమంత్ కుమార్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తే గోవిందరాజులు అనే మరో వ్యక్తి గురించి సమాచారం ఇచ్చాడు. ఇలా ఒకరి తరువాత ఒకరు ఆరుగురు పోలీసులకు దొరికారు. ప్రధాన నిందితుడు, ఈ గ్యాంగ్ లీడర్ జయకృష్ణ, మరో నిందితుడు ఉదయ్ కుమార్ పరారీలో ఉన్నారు.
నేర చరిత్ర ఉన్నోళ్లే..
ఏ 1: ఎన్.జయకృష్ణ(అనంతపురం జిల్లా)
అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ ఆఫీసర్‌ను అని చెప్పుకుని ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించాడు. ఈ కేసులో అనంతపురం త్రీటౌన్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. రెడ్డిపల్లి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఏ 2 : తమిటిగొల్ల గంగయ్య అలియాస్ గంగాధర్ (23)
ఇతను తెలంగాణకు చెందిన వ్యక్తి. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మెలడుప్పలపల్లి గ్రామం. ప్రస్తుతం కడప జిల్లా టి.సుండుపల్లిలో ఉంటున్నాడు. అనంతపురం జిల్లా కదిరి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు.
ఫ ఏ 3: జోలదరాసి సోల్మాన్‌రాజు (36)
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్ కాలనీలో ఉంటాడు. ఇతనిపై అనంతపురం జిల్లా కణేకల్లు పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదు అయింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టు అయ్యాడు
ఏ4 నిందితుడు : బొడ్డు సాయి కుమార్ (21)
ఇతనిది అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామం. బత్తలపల్లి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఓ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు.
ఏ5: నారాయణ స్వామి (29)
సొంతూరు అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం ఈదులబల్లాపురం గ్రామం. చిలమత్తూరు మండల పరిధిలోని కొడికొండలో ఉంటున్నాడు. హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ రేప్ కేసు నమోదైంది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు.
ఏ6: హోసూరు నారాయణప్ప అలియాస్ గోవిందరాజులు (36)
ఇతను కర్ణాటక వాసి. చిక్బల్లాపుర్ జిల్లా గౌరీ బిదనూరు తాలుకాలోని హోసూరు గ్రామం. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 354 కింద నమోదైన ఓ కేసులో అరెస్టు అయ్యాడు.
ఏ7: ఆర్.హేమంత్‌కుమార్ (25),
ఇతను కర్ణాటక వాసి. చిక్బల్లాపుర్ జిల్లా గౌరీ బిదనూరు తాలుకాలోని హోసూరు గ్రామం.
ఏ 8: ఉదయ్ కుమార్
అనంతపురం జిల్లా వాసి. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. మిగిలిన నిందితులకు నేరాల్లో సహాయం చేస్తుంటాడు.
రెడ్డిపల్లి జైలు పక్షులు
ఈ కేసులో పలువురు నిందితులు అనంతపురం జిల్లా రెడ్డిపల్లి జైలులో ఖైదీలుగా ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడు సులభంగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాల గురించి చర్చించుకునేవారు. ప్రధాన నిందితుడు జయకృష్ణ సలహాతో ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో పని చేస్తున్న ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేశారు. గనులు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, ఫ్యాక్టరీలు, మున్సిపాలిటీలు, కమర్షియల్ ట్యాక్స్, పంచాయితీరాజ్.. ఇలా పలు శాఖల అధికారుల ఫోన్ నెంబర్లు సేకరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా..
నిందితులు గత ఐదు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి బెదిరించారు. వైజాగ్, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు ప్రభుత్వ అధికారులు వీరిపై ఫిర్యాదు చేశారు. కర్నూలు మినహా ఎక్కడా నిందితులు దొరకలేదు. కర్నూలు ఆర్‌అండ్‌బీ ఈఈ జయరామిరడ్డికి ఫోన్ చేసి బెదిరించిన కేసులో కూపీ లాగడంతో దొరికిపోయారు.
అంతా నడిపేది జయ కృష్ణ
ఏసీబీ అధికారుల పేరిట బెదిరించే వ్యవహారాల్లో జయకృష్ణది కీలక పాత్ర. గతంతో ఏసీబీ అధికారినని బెదిరించే అనుభవం ఉండటంతో అదే మార్గాన్ని ఎంచుకున్నారు. గోవిందరాజులు వీరికి సిమ్ కార్డులు తెచ్చిస్తుంటాడు. కర్ణాటక నుంచి ఆరు సిమ్ కార్డులు తెప్పించి ఇచ్చాడు. ఇందులో మూడు సిమ్ కార్డులను మాత్రమే వాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను బెదిరించారు.
ఇలా నడిపిస్తారు..
టార్గెట్ చేసుకున్న ప్రభుత్వ అధికారికి మొదట జయకృష్ణ ఫోన్ చేస్తాడు. ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి అని మొదలు పెడతాడు. ఆ తర్వాత సార్‌తో మాట్లాడమని ‘ఏసీబీ డీఎస్పీ గంగయ్య’ చేతికి ఫోన్ ఇస్తాడు. గంగయ్య అనియాస్ గంగాధర్ బేరం మొదలు పెట్టి ఎంత ఇవ్వాలో ఫిక్స్ చేస్తాడు. ఈ సంభాషణ జరిగే ప్రాంతానికి ఎవరూ రాకుండా సాల్మన్ రాజ్, సాయికుమార్ కాపలాగా ఉంటారు. నిందితులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ రూ.14.34 లక్షలు వసూలు చేశారు. వారి నుంచి రూ.21 వేలు మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన మొత్తం పరారీలో ఉన్న జయకృష్ణ వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులకు అభినందనలు
కేసు ఛేదించిన డీఎస్పీ వెంకట్రామయ్య, టూటౌన్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ సునీల్ కుమార్, కానిస్టేబుళ్లు మహేంద్ర, రవి, ప్రియకుమార్‌ను ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు.