అధికారులకే నీళ్ల బాటిళ్లు
ABN , First Publish Date - 2020-12-01T06:26:10+05:30 IST
పుష్కరాల్లో అక్రమాలు కొనసాగుతున్నాయి. భక్తుల కోసం కొనుగోలు చేసిన వాటర్ బాటిళ్లను కేఎంసీ అధికారులే దగ్గరుండి అధికారులకు పంచి పెడుతున్నారు.

- భక్తులకు ప్యాకెట్లే ఇవ్వాలని సిబ్బందికి ఆదేశాలు
- కమిషనరే చెప్పాడని అంటున్న స్టాల్ ఇన్‌చార్జ్‌లు
- ఒక్కో ఘాట్‌కు నిత్యం 5 కేసుల బాటిళ్లు సరఫరా
కర్నూలు, ఆంధ్రజ్యోతి: పుష్కరాల్లో అక్రమాలు కొనసాగుతున్నాయి. భక్తుల కోసం కొనుగోలు చేసిన వాటర్ బాటిళ్లను కేఎంసీ అధికారులే దగ్గరుండి అధికారులకు పంచి పెడుతున్నారు. మంచినీళ్ల అక్రమాలు అధికారులకే పట్టనపుడు తామెందుకు వదలాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులకు బాటిళ్లు ఇచ్చి, భక్తులకు మాత్రం వాటర్ ప్యాకెట్లతో సరిపెడుతున్నారు. ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వమని అడిగినా కసురుకుంటున్నారు. ‘తాగితే తాగండి.. లేకుంటే పోండి’ అంటూ ముఖంమీదే చెప్పేస్తున్నారు. అదేమని అడిగితే ఏకంగా కేఎంసీ కమిషనరే అలా ఇవ్వమని చెప్పారని షిరిడీ సాయు ఘాట్ వద్ద ఇన్చార్జ్గా పనిచేస్తోన్న జాఫర్ అన్నాడు. స్టాల్స్ వద్ద విధుల్లో ఉండాల్సిన సిబ్బంది కర్నూలు పరిధిలోని శాఖాపరమైన సమస్యలకూ హాజరవుతున్నారు. ఘాట్ల స్టాల్స్ వద్ద ఎలక్ర్టీషియన్లు, పారిశుధ్య కార్మికులను కాపలాగా పెడుతున్నారు. సంకల్బాగ్, షిరిడి, నాగ సాయి, నగరేశ్వర స్వామి ఘాట్లలో పని చేసే సిబ్బందికి, భక్తులకు నిత్యం వందలాది బస్తాల వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు సరఫరా చేస్తున్నారు. కానీ, భక్తులకు వాటర్ బాటిళ్లు అందడంలేదు. ఇటీవలే ఈ సమస్యను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీంతో కమిషనర్ డీకే బాలాజీ స్పందించారు. అయినా ఘాట్ల వద్ద సిబ్బందిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పోలీసులు, మెడికల్ క్యాంపు సిబ్బంది, కేఎంసీ సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులకు మాత్రమే వాటర్ బాటిళ్లు ఇస్తామని, మిగిలినవారికి ప్యాకెట్లు మాత్రమే ఇవ్వాలని కమిషనర్ సూచించారని కేఎంసీ ఉద్యోగులే చెబుతున్నారు. ప్రజాధనాన్ని ప్రజలకు కాకుండా కావాల్సిన వారికి ఖర్చు చేస్తున్నారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఘాట్ ఇన్‌చార్జ్‌లు లెక్కచేయడంలేదు. ఎవరైనా గట్టిగా నిలదీస్తేనే వాటర్ బాటిళ్లు ఇస్తున్నారని, తమకు ప్యాకెట్లే విసిరేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా నిత్యం వచ్చే వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు ఎటు పోతున్నాయనేది ఎవరికీ అంతు చిక్కడంలేదు.
విధులకు దూరంగా..
ఘాట్లలో స్టాళ్లకు ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న ఉద్యోగులు స్టాళ్లను గాలికొదిలేస్తున్నారు. ఎవరైనా వస్తే ఇబ్బంది లేకుండా ఎలక్ర్టిషియన్లు, పారిశుధ్య కార్మికులతో నడిపిస్తున్నారు. పారిశుధ్య సమస్యలు తలెత్తితే వెళ్తున్నామని సాకు చెబుతున్నారు. వాటర్ ప్యాకెట్లను, బాటిళ్లను కావాల్సిన వారికే పంపిణీ చేస్తూ.. రూ.44 లక్షల విలువైన వాటర్ బాటిళ్లను పక్క దారి పట్టిస్తున్నారు. పుష్కరాలు మొదలై 12 రోజులు గడుస్తుండగా నేటికీ తయారీ తేదీ లేని వాటర్ ప్యాకెట్లనే పంపిణీ చేస్తున్నారు. ఎవరైనా అడిగితే ఆ రోజే తయారయ్యాయని చెప్పాలని ఉన్నతాధికారులు సూచించారని స్టాల్ ఇన్చార్జులు చెబుతున్నారు. ఎవరి స్థాయిలో వారు దోచుకోవడానికే పుష్కరాలు నిర్వహిస్తున్నట్లుగా ఉందని భక్తులు విమర్శిస్తున్నారు.