ఆర్‌యూలో వార్..!
ABN , First Publish Date - 2020-12-17T05:45:17+05:30 IST
బీఈడీ పరీక్షల నిర్వహణ అంశం రాయలసీమ యూనివర్సిటీలో రెండు విభాగాల మధ్య విభేదాలను బహిర్గతం చేసింది.

- పరీక్షల విభాగంపై వీసీకి సీడీసీ ఫిర్యాదు
- బీఈడీ కాలేజీలకు నోటీసులపై ఆగ్రహం
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై కీచులాటలు
- ఈడబ్ల్యూఎస్ అడ్మిషన్లపైనా వివాదం
కర్నూలు(అర్బన్), డిసెంబరు 16: బీఈడీ పరీక్షల నిర్వహణ అంశం రాయలసీమ యూనివర్సిటీలో రెండు విభాగాల మధ్య విభేదాలను బహిర్గతం చేసింది. ‘బీఈడీ పరీక్షలు ఎప్పుడో..’ అనే శీర్షికన ఈ నెల 10వ తేదీన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీనికి వర్సిటీ పరీక్షల విభాగం స్పందించింది. టీసీలు వెరిఫికేషన్ చేయించుకో వాలని పరీక్షల విభాగం అధికారులు బీఈడీ కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. అయితే తమ అనుమతి లేకుండా నోటీసులు ఏలా జారీ చేస్తారని సీడీసీ విభాగం అధికారులు ప్రశ్నిస్తున్నారు. సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయకముందే500 మంది విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేశారని, ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేశారని వారు అంటున్నారు. నింద తమపై మోపేడమే కాక తమ విభాగపు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని బీఈడీ కాలేజీలకు నోటీసులు జారీ చేశారని సీడీసీ అధికారులు మండి పడుతున్నారు. దీనిపై ఉప కులపతికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలు యూనివర్సిటీలో దుమారం రేపుతున్నాయి.
సీడీసీపైనా ఫిర్యాదులు
కొన్ని కాలేజీల యాజమాన్యాలు సీడీసీ విభాగంపై వీసీకి మంగళవారం ఫిర్యాదు చేశాయి. గతంలో సర్ట్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కాలేజీలకు ఇచ్చిన తేదీలలో కాకుండా, గుట్టుగా ఇతర తేదీలలో వెరిఫికేషన్ చేయించుకున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడితే నకిలీల వ్యవహారం బయట పడుతుందంటున్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు లేకపోయినా, ఆ కోటా కింద అడ్మిషన్లు ఇచ్చారని కొందరు ఆరోపించారు.
నోటీసులతో వివాదం
బీఈడీ విద్యార్థులకు బ్లాక్ బోర్డు టిచింగ్ తప్పని సరి. 2019 ఫిబ్రవరి, మార్చి నెలల్లో బ్లాక్ బోర్డు టీచింగ్ చేయించినట్లు పాఠశాలల జారీ చేసిన సర్టిఫికెట్లతో హాజరు అయితేనే 4వ సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని పరీక్షల విభాగం అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన ఇచ్చిన ఈ నోటీసులతో కళాశాలల యాజమాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పెండింగ్ ఉంటే వెంటనే సీడీసీ విభాగంలో వెరిఫికేషన్ చేయించుకోవాలని పరీక్షల విభాగం ఈ నెల 14న మరో నోటీసు జారీ చేసింది. ఈ రెండు అంశాలు తమ విభాగం పరిధిలోనివి అనీ, వీటిపై తమకు తెలియకుండా నోటీసులు ఎలా ఇస్తారని సీడీసీ విభాగం ప్రశ్నిస్తోంది.
అక్రమాలపై ఫిర్యాదులు
ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం విద్యార్థులను చేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీని ఆధారంగా, ప్రతి వంద సీట్లకు అదనంగా 8 మందికి అడ్మిషన్ ఇవ్వవచ్చని అనుమతించారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు లేకపోయినా అడ్మిషన్లు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై యూనివర్సిటీ అధికారులు నోరుమెదపడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
కొన్ని కాలేజీల యాజమాన్యాలు కోరిన చోట వర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రాలను కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అక్రమాలు జరిగాయని ఓ కళాశాల అధినేత వీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వీసీ అనుమతితోనే నోటీసులు
ఉప కులపతి అనుమతిలోనే బీఈడీ కళాశాలకు నోటీసులు జారీ చేశాం. అన్ని కాలేజీల వారూ విద్యార్థుతల టీసీలను వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందే. లేదంటే పరీక్షలకు అనుమతించేందుకు వీలు ఉండదు. కళాశాలల యాజమాన్యాలు నిబంధనలను పాటించాలి. - వెంకటేశ్వర్లు, పరీక్షల నిర్వహణ అధికారి
వారు కుమ్మకయ్యారు..
సీడీసీ, పరీక్షల విభాగం అధికారులు కుమ్మకయ్యారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో కలిసి స్థానిక విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిసా, సిక్కిం, మణిపాల్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. సీడీసీ, పరీక్షల విభాగం అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. - శ్రీరాములు, జేఏసీ కన్వీనరు