ఓ ఊరి వ్యథ.. వకులా నది ఒడ్డున..!

ABN , First Publish Date - 2020-09-18T11:31:49+05:30 IST

వక్కిలేరుకు సుమారు అర కిలోమీటరు దూరంలో..

ఓ ఊరి వ్యథ.. వకులా నది ఒడ్డున..!

వరద వస్తే జల దిగ్బంధం

అత్యవసరమైతే ఈదాల్సిందే

నేల వంతెన దాటే వీలు లేక..!

వ్యాధులు సోకితే మరణాలు

చిలకలూరు కష్టం పట్టేదెవరికి..?


రుద్రవరం(కర్నూలు): చిలకలూరుకు చెందిన మురళీ మోహన్‌ ఉదయాన్నే వకులా నది ఒడ్డుకు వచ్చాడు. జేబులో ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్‌, ఇతర కాగితాలను ఓ టవల్‌లో చుట్టుకుని.. తలకు బిర్రుగా చుట్టుకున్నాడు. నెమ్మదిగా నదిలోకి దిగి ఈదడం ప్రారంభించాడు. అవతలి ఒడుకు చేరుకుని.. తడిసిన బట్టలతో దొర్నిపాడు మండలం డబ్ల్యూ.గోవిందిన్నె, కొత్తపల్లె వైపు వెళ్లిపోయాడు. ఆ గ్రామాల వీఆర్వో ఆయన. సరదాగా ఈత కొట్టడం లేదు. విధులకు వెళ్లాలంటే రోజూ ఇలా గజ ఈతగాడిలా మారాల్సిందే. ప్రాణాలకు తెగించి నది దాటాల్సిందే. 


వక్కిలేరుకు సుమారు అర కిలోమీటరు దూరంలో ఉంటుంది చిలుకలూరు గ్రామం. 230 కుటుంబాలకు చెందిన దాదాపు 800 మంది ఆ ఊళ్లో ఉంటున్నారు. వకులానది (వక్కిలేరు) ఒడ్డున మూడు శతాబ్దాల క్రితం ఈ ఊరు ఏర్పడిందని చెబుతారు. నది ఉప్పొంగితే ఈ ఊరికి నరకం కనిపిస్తుంది. ఒక్కసారి నదికి నీరొస్తే కనీసం పది రోజులు రాకపోకలు ఆగిపోతాయి. ఆ సమయంలో అనారోగ్యానికి గురైన వారిలో వైద్యం అందక  చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలోని కొన్ని ఇళ్లు నీట మునుగుతాయి. దీంతో ఆహారం కూడా ఉండదు. ఆకలితో అలమటించిన రోజులు చాలానే ఉన్నాయని గ్రామస్థులు అంటున్నారు.


ప్రాణాలు పోయాయి..

వక్కిలేరు ఉప్పొంగిన సమయంలో ఆ ఊరికి ఏ సాయమూ అందదు. ఇక వైద్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. వైద్యం అందక ప్రాణాలు పోయిన ఘటనలు కోకొల్లలు అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులు, పసివారు, వృద్ధులు వాగు ఉప్పొంగే సమయంలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఇంట్లో ఉన్న సరుకులతోనే రోజులు గడపాల్సి వస్తుందని, చాలా మంది పేదలు కావడంతో ఆకలితో అలమటిస్తుంటారని అంటున్నారు. 


పన్నెండేళ్ల క్రితం నది ఉప్పొంగిన సమయంలో మునయ్య అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి తరించే వీలులేక కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉంచారు. వరద తగ్గేలోగా మునయ్య ప్రాణాలు విడిచాడు. ఏడేళ్ల క్రితం ఎల్లమ్మ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించే వీలు లేకుండాపోయింది. ఆమె ప్రాణాలు విడిచింది. గ్రామానికి చెందిన వన్నూర్‌ బాషా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉండేవాడు. అనారోగ్యంతో బాధపడుతున్నానని ఊరిలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వాగు ఉధృతి కారణంగా వారు కొడుకు వద్దకు వెళ్లలేకపోయారు. బాషాను పట్టించుకునేవారు లేక మృతి చెందాడు. 


ఆకలి బాధలు

వకులా నది 2002, 2006, 2007, 2009లో ఉధృతంగా ప్రవహించింది. గ్రామంలో చాలా ఇళ్లలోకి నీరు చేరింది. 2007లో దాదాపు 14 రోజుల పాటు భోజనాలు వండుకోవడానికి వీలులేకపోయిందని కొందరు గుర్తు చేశారు. గ్రామంలో మరోచోట ఉన్నవారు తమకు అన్నం వండి పెట్టారని, ఉన్నంతలో అందరూ సర్దుకుని ప్రాణాలు నిలుపుకున్నామని అంటున్నారు. రెండు వారాల తరువాత ఇళ్లలో వరద నీరు తగ్గిందని, సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఇప్పటికీ తాగునీరు లేదు 

చిలుకలూరులో ఇప్పటికీ తాగునీరు లేదు. నది ఒడ్డునే ఉన్నా.. ఉన్నదంతా ఉప్పునీరే. గ్రామానికి 800 మీటర్ల దూరంలో గంగమ్మ గుడి వద్ద ఉన్న చేతి పంపు నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. సరైన దారి లేక అక్కడికి వెళ్లేందుకు ఒంటరిగా ఉన్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


ఏరు దాటేది ఇద్దరే..

వకులానది ఎంత ఉధృతంగా ప్రవహించినా ఆ ఊరికి చెందిన ఇద్దరు ఈదుతూ దాటుతున్నారు. విధులు నిర్వహించేందుకు వేరే గ్రామాలకు వెళ్లాల్సిన వీఆర్వో మురళీ మోహన్‌ 24 ఏళ్ల నుంచి నదిని ఈది అవతలకు వెళుతున్నాడు. సాయంత్రం తిరిగి నదిని దాటుకుని ఇంటికి చేరుతున్నాడు. చాకలి సుబ్బరాయుడు పదిహేనేళ్ల నుంచి నదిని దాటి వెళ్లి వస్తున్నాడు. ఈ ఇద్దరు తప్ప మరెవ్వరూ నదిలో కాలు పెట్టే సాహసం చేయడం లేదు.


ఎవరూ పట్టించుకోరా..?

చిలుకలూరుకు ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు వెళతారు. వరద కష్టాలను తీరుస్తామని, బ్రిడ్జి ఏర్పాటు చేయిస్తామని వాగ్దానం చేస్తారు. ఆ తరువాత అటువైపు తిరిగి చూడరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.


15 ఏళ్లుగా ఈదుతున్నా..   

వకులానది ఉప్పొంగే సమయంలో 15 ఏళ్లుగా అవతలి ఒడ్డుకు ఈదుతూ చేరుకుంటున్నాను. ఆపదలో ఉన్న వారిని ఒడ్డుకు చేరుస్తున్నాను. ఏదైనా అవసరం పడితే నది దాటక తప్పడం లేదు. బ్రిడ్జి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.

చాకలి సుబ్బరాయుడు, చిలుకలూరు

వైద్యం అందదు.. 

వకులానది పొంగితే మా ఊరి ప్రజలకు వైద్య సేవలు అందవు. అనారోగ్యం చేస్తే కాటికి పోవాల్సిందే. 12 ఏళ్ల క్రితం మునయ్య అనే వ్యక్తి, ఏడేళ్ల క్రితం ఎల్లమ్మ అనే మహిళ వైద్య సేవలు అందక మృతి చెందారు. నది పారే సమయంలో గ్రామానికి రాకపోకలు ఉండవు. 

- బోజ సాహెబ్‌, చిలుకలూరు 

తాగునీరు లేదు.. 

గ్రామంలో తాగునీరు లేదు. అంతా ఉప్పునీరే. గ్రామానికి 800 మీటర్ల దూరంలో పెద్దమ్మ గుడి వద్ద చేతి పంపు ఉంది. అక్కడకు వెళ్లి తాగునీరు బిందేతో తెచ్చుకోవాల్సిందే. చాలా ఇబ్బందిగా ఉంది. 

- రంగమ్మ, చిలుకలూరు

ప్రాణాలు పోతున్నాయి.. 

వాగు పొంగినప్పుడు అనారోగ్యం చేస్తే మరణం తప్పదు. రాకపోకలు స్తంభిస్తాయి. వైద్య సేవలు అందవు. ఒక్కసారి వాగు పొంగితే 10 రోజుల పాటు ప్రవహిస్తుంది. ఆ సమయంలో నిత్యావసర సరుకులు కూడా ఉండవు. చాలా మంది ఆకలి బాధలు పడుతున్నారు

- సూరి, చిలుకలూరు


నిత్యావసరాలూ ఉండవు..  

వకులానది పొంగి ప్రవహిస్తే నిత్యావసర సరుకులు కూడా అందవు. వారం రోజులు నేల వంతెనపై వరద నీరు ప్రవహిస్తుంది. చిలుకలూరు నుంచి వేరే గ్రామానికి వెళ్లలేరు వేరే గ్రామస్థులు రాలేరు.

- ఇది మా గ్రామ దుస్థితి. - ఆంజనేయులు, చిలుకలూరుUpdated Date - 2020-09-18T11:31:49+05:30 IST