కరుణించు మల్లన్నా..!

ABN , First Publish Date - 2020-03-23T10:27:31+05:30 IST

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా వేడుకలకు భక్తులను అనుమతించడం లేదు.

కరుణించు మల్లన్నా..!

 శ్రీగిరిపై ఉగాది మహోత్సవాలు ఆరంభం

మొదటిసారిగా భక్తులు లేకుండా ఉత్సవాలు

యూట్యూబ్‌ ద్వారా వేడుకల ప్రసారం 


శ్రీశైలం, మార్చి 22: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా వేడుకలకు భక్తులను అనుమతించడం లేదు. దర్శనాలు కూడా రద్దు చేశారు. దీంతో తొలిసారిగా భక్తులు లేకుండా వేడుకలు జరుగుతున్నాయి. మొదటి రోజు ఆదివారం భ్రమరాంబదేవి మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లు భృంగి వాహన సేవలను అందుకున్నారు. పూజలు, సేవల్లో అర్చకులు, వేద పండితులు, అధికారులు మాత్రమే పాల్గొన్నారు. ఉత్సవాలు ఆలయానికే పరిమితమయ్యాయి. వేడుకలను యూ ట్యూబ్‌లో  ప్రసారం చేశారు. 


ఐదు రోజుల వేడుక

శ్రీగిరిపై ఆదివారం ఉదయం అర్చకులు, వేదపండితులు, అధికారులు పూజాద్రవ్యాలతో స్వామివారి యాగశాల ప్రవేశం చేశారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. జనులందరూ ఆరోగ్యంగా ఉండాలని, హానిచేసే సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా ఉండాలని సంకల్పంలో చెప్పారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతి పూజ జరిపించారు. మండపారాధనలో నవగ్రహ దేవతలను, దిక్పాలకులను శాస్త్రోక్తంగా ఆహ్వానించారు. రుద్రకలశ స్థాపన చేశారు. సాయంత్రం అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన జరిపించారు. 


యూ ట్యూబ్‌లో వీక్షించండి.. కేఎస్‌ రామరావు, ఈవో

శ్రీశైలంలో జరిగే ఉగాది మహోత్సవాలను భక్తులు యూ ట్యూబ్‌లో వీక్షించవచ్చు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉత్సవాలకు భక్తులను అనుమతించడం లేదు. ప్రజల ఆరోగ్యం కోసం క్షేత్రంలో మృత్యుంజయ హోమం, ఆరోగ్య పాశుపత హోమం నిర్వహిస్తున్నాము. క్షేత్రంలో తలపెట్టిన యజ్ఞయాగాదులు ఫలితాలు ఇచ్చేలా ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను కోరుకుంటున్నాం. 

Updated Date - 2020-03-23T10:27:31+05:30 IST