ఇళ్లలోనే తెలుగువారి తొలి పండుగ

ABN , First Publish Date - 2020-03-24T05:30:00+05:30 IST

ఉగాది శోభాయమానమైన తెలుగు పండుగ. షడ్రుచుల పచ్చడి, మామిడి తోరణాలు, బంతిపూలతో ఇంటింటా ప్రకృతి పులకించిపోతుంది.

ఇళ్లలోనే తెలుగువారి తొలి పండుగ

కరోనా నియంత్రణ స్ఫూర్తితో ఉగాది 

పుణ్యక్షేత్రాల్లో కనిపించని సందడి

పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు బంద్‌

నేడు తెలుగు సంవత్సరాది 


కర్నూలు(కల్చరల్‌), మార్చి 24: ఉగాది శోభాయమానమైన తెలుగు పండుగ. షడ్రుచుల పచ్చడి,  మామిడి తోరణాలు, బంతిపూలతో ఇంటింటా ప్రకృతి పులకించిపోతుంది. ఈసారి కరోనా కట్టడి కోసం స్వయం నియంత్రణ, సామాజిక దూరం లక్ష్యంతో ఇండ్లలోనే కుటుంబ సభ్యులకే పరిమితమై శార్వరీ నామ సంవత్సరానికి తెలుగు ప్రజలు స్వాగతం పలకవలసి వచ్చింది. అందరూ కలిసి ఆనందంగా జరుపుకొనే ఉగాది ఈసారి ఎవరిండ్లలో వారు కరోనా నియంత్రణే భవిష్యత్‌ అనే స్ఫూర్తితో జరుపుకోడానికి  సిద్ధమవుతున్నారు.  


ఉగాది అంటే బంధు మిత్రలుంతా కలవడం. దేవాలయాల్లో అర్చనలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా గడపడం. కానీ శార్వరీ నామ ఉగాది కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌లో నిర్వహించుకోవాల్సి వస్తోంది. దీంతో పండుగ సందడి దాదాపుగా దూరమైపోయింది. జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి వంటి పుణ్యక్షేత్రాల్లో ఉగాది ఉత్సవాలకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఇప్పటికే గత కొద్ది రోజుల కింద దేవదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 


ఆంక్షల మధ్యే వేడుక నిర్వహణ...

తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైన వేడుక ఉగాదిని బుధవారం జిల్లా ప్రజలు అధికారులు పెట్టిన ఆంక్షల మఽధ్యే నిర్వహించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు గృహాలను దాటి బయటకు రావద్దని కలెక్టర్‌తోపాటూ ఎస్పీ ఆంక్షలు పెట్టారు. దీంతో ఇండ్లలోనే    వేడుకలు జరుపుకోడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇండ్లను శుభ్రం చేసుకొని, ఇండ్లకు సున్నం పూయడం, రంగులు వేయడం వంటివి పూర్తి చేశారు. ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టి, బంతి, చేమంతి వంటి వివిధ రకాల పూలతో అలంకరించారు.   ఒకవైపు కరోనా వైరస్‌ భయం పీడిస్తున్నా, లాక్‌డౌన్‌  ఆంక్షలు ఉన్నా  ఇండ్లలోనే    వేడుకను నిర్వహించుకోనున్నారు.  


మండుతున్న ధరలు...

మామూలుగానే పండుగ వేళ ధరలు పెరుగుతాయి. ఈసారి కరోనా లాక్‌డౌన్‌తో నిత్యావసరాలు, పూజా ద్రవ్యాల ధరలు ప్రియమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పూలు కిలో రూ.250 నుంచీ రూ.300 వరకు అమ్మారు. మామిడి ఆకులకు గిరాకీ ఏర్పడింది. సమీప గ్రామాల నుంచి మామిడి ఆకులను పండుగకు ఒకరోజు ముందు మార్కెట్‌కు తీసుకొచ్చేవారు. ఈసారి కరోనా ప్రభావంతో అది లేకుండాపోయింది. రైతు బజార్లలో మామిడి ఆకులు, మామిడి కాయలు, వేపపూత వంటివి కొనలేని ధరలకు అతి తక్కువ అందుబాటులో ఉన్నాయి. 

 

పండుగ కన్నా ప్రపంచ విపత్తు ముఖ్యం...కురాడి చంద్రశేఖర కల్కూర, రాష్ట్ర అధ్యక్షుడు, గాడిచర్ల ఫౌండేషన్‌ సంస్థ

నేడు కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది ప్రపంచ విపత్తుగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ తరుణంలో పండుగ కన్నా ఆరోగ్యం ముఖ్యం. పండుగ గత ఏడాది చేశాం. రాబోయే ఏడాది చేస్తాం. ఈ ఏడాది చేయకపోతే నష్టం ఏమీ ఉండదు. అయితే  సంప్రదాయాలను పాటిస్తూ పండుగ ఇంటికే పరిమితమై జరుపుకోవాలి.   ఆర్భాటాలు వద్దు. అధికారుల సూచనలు తప్పక పాటించాలి. పండుగ అంటే అందరూ కలవడం. కానీ ఈ సారి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎవరింట్లో వాళ్లు పండుగ చేసుకోవడమే సంతోషకరం అనుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పండుగ రోజు కూడా తప్పక పాటించాలి.


ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి... జేఎ్‌సఆర్‌కే శర్మ, రాష్ట్ర కార్యదర్శి, తెలుగు భాషా వికాస ఉద్యమం సంస్థ   

ఉగాది తెలుగు వారికి అత్యంత ఇష్టమైన వేడుక. కవులు, భాషా పండితులకు మంచి వేదిక కూడా. అయితే ఈ ఏడాది వేడుక నిర్వహణ జాగ్రత్తగా చేసుకోవాలి. ఉగాది పచ్చడిలో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. కాబట్టి వేపపూత వంటి ఔషధాలు వేసి తయారు చేసే ఉగాది పచ్చడిని స్వీకరించాలి. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఎప్పటిలా  ఆర్భాటాలు లేకుండా కేవలం ఇండ్లకే పరిమితమై వేడుకలు చేసుకుంటే మనల్ని మనం రక్షించుకున్నట్లు అవుతుంది.


పండుగ కన్నా...ప్రాణాలు ముఖ్యం.. డాక్టర్‌ దండెబోయిన పార్వతీదేవి, రాష్ట్ర కార్యదర్శి, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం

ప్రస్తుతం ప్రజారోగ్యం  చాలా  సంక్షోభంలో ఉంది. కరోనా వైరస్‌ ప్రపంచ విపత్తుగా మారింది. ఈ తరుణంలో పండుగ కన్నా ప్రాణాలు ముఖ్యంగా భావించాలి. సమాజంలోని ప్రజలకు ఆనందాన్ని కలిగించేవే పండుగలు. కానీ కరోనా భయంతో అందరిలోనూ ఆనందం ఎప్పుడో దూరమై ఆందోళన పెరుగుతోంది. మనం సేఫ్‌గా ఉంటేనే పండుగలు, పర్వదినాలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని    కుటుంబాలకే  పరిమితమై పండుగ జరుపుకోవాలి. 


జిల్లాకు మంచిరోజులు రానున్నాయి...తెలకపల్లి రఘురామశర్మ, ప్రధాన అర్చకులు, సంగమేశ్వర క్షేత్రం

ఈ ఏడాది బుధుడు రాజు అయినందున జిల్లాకు మంచి రోజులు రానున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నా, సకాలంలో వర్షాలు కురిసి జిల్లాలోని జలాశయాలన్నీ నిండుగా ఉంటాయి. చంద్రుడు మంత్రి అయినందున వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు బాగా పండుతాయి. అలాగే ఈ ఏడాది నవంబర్‌ 20 నుంచీ ఆరంభమయ్యే తుంగభద్ర నదీ పుష్కరాలు మంచిని అందిస్తాయి. రాయలసీమ ప్రాంతంలో తిరుమల, శ్రీశైలం, అహోబిలం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నందున ఆ దేవతామూర్తుల చల్లని చూపు ఈ ప్రాంతంపై ఉంటుంది. ఉగాది నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు రెండు విపత్తులు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. 


పండగ సంబరం లేదు-వెంకటలక్ష్మి, నాగలాపురం గ్రామం, ఆదోని మండలం: 

ఉగాది పండగ వచ్చిందంటే చాలు.. మా ఇంట్లో   సందడిగా ఉండేది.   ఈ ఏడాది కరోనా వైరస్‌ కారణంగా పండుగ సంబరమే లేదు.   పప్పుదినుసులు కొనాలన్నా వ్యయప్రయాసలుపడి కొనాల్సి వస్తోంది.  బైట తిరిగితే  వైరస్‌ వస్తుందని భయంగా ఉంది.  దీంతో పండగ సందడి లేకపోవడం బాధగా ఉంది.  


బంధువులను పండగకు తీసుకెళ్దామని వచ్చాను...-పుష్పావతి, ఇంగళదహాల్‌ గ్రామం, హొళగుంద మండలం:

ఆదోనిలో ఉన్న మా బంధువులను ఉగాది పండుగకు ఊరికి తీసుకెళ్దామని ఆటో పట్టుకొని   వచ్చాను.   ఎక్కడికక్కడే పోలీసులు రోడ్లకు అడ్డంగా బారికేడ్‌లు  ఏర్పాటు చేశారు. వెళ్లేందుకు వీలులేకుండా ఉంది. చేసేదిలేక వచ్చినదారినే మా గ్రామానికి వెళ్తున్నాను. పండుగ సందడే లేదు. ఎప్పుడూ ఇలా చూడలేదు. 

Updated Date - 2020-03-24T05:30:00+05:30 IST