రేపు మంత్రుల ఇళ్ల ముట్టడి

ABN , First Publish Date - 2020-11-16T05:04:08+05:30 IST

ఏపీ భవన నిర్మాణ కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న మంత్రుల ఇళ్లముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు సీఐటీయూ జిల్లా నాయకుడు సుధాకరప్ప తెలిపారు.

రేపు మంత్రుల ఇళ్ల ముట్టడి


కర్నూలు(న్యూసిటీ), నవంబరు 15: ఏపీ భవన నిర్మాణ కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న మంత్రుల ఇళ్లముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు సీఐటీయూ జిల్లా నాయకుడు  సుధాకరప్ప తెలిపారు.  ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుధాకరప్ప మాట్లాడుతూ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసే విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జీవో నెంబరు 17 ద్వారా రూ.450 కోట్లు సంక్షేమ బోర్డు నుంచి  ప్రభు త్వం వాడుకుందని ఆరోపించారు. ఈ డబ్బు ను  ప్రభుత్వం వెంటనే బోర్డులో జమచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.   ఏఐటీయూసీ జిలా కార్యదర్శి బి.నరసింహులు, నల్లన్న, ఎండీ. షరీఫ్‌, ఖాజాపాషా, ఏసు తదితరులు పాల్గొన్నారు. 


ఆదోని: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు తెలిపారు. ఆదివారం స్థానిక హావన్నపేట సర్కిల్‌లో భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి కార్మిక సంక్షేమానికి ఉపయోగించాల్సిన బోర్డులను వేరే పథకాలకు మళ్లించి భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న జగన్‌ ప్రభుత్వం సంక్షేమ బోర్డుకు తూట్లు పొడుస్తూ కార్మిక రంగానికి ఉపయోగించకుండా నవరత్నాలులో భాగంగా పవర్‌ప్లాంట్‌కు 450 కోట్లు వాడుకున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  17వ తేదీన కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్షావలి, జిల్లా సమితి సభ్యుడు కల్లుబావి రాజు, ఏఐటీయూసీ ఆదోని నియోజకవర్గ కార్యదర్శి ప్రకాష్‌, నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకన్న, జిల్లా సమితి సభ్యుడు హుసేన్‌, సోమన్న, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు టౌన్‌: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 17న మంత్రుల గృహాలను ముట్టడించనున్నట్లు ఏఐటీయూసీ కార్యదర్శి బాలరాజు ఆదివారం  అన్నారు. హనీఫ్‌, మునిస్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-16T05:04:08+05:30 IST